విదేశాల వెళ్లాలనుకునేవారికి ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంటు వారి నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలా అనే ప్రశ్న ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి సుందరకాండలో హనుమంతుడి జవాబులాగా ‘‘అక్కర్లేదు’’ అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వివరాల్లోకి
వెళదాం..
ఈ మధ్యే ఆర్థిక శాఖ తెచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలో విదేశీయానం చేసేవారంతా ఆదాయపు పన్ను శాఖ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలనే అర్థం వచ్చేలా ధ్వనించింది. దీంతో అందరు పౌరులు ఉలిక్కిపడ్డారు. గాభరా పడ్డారు. షాక్ తిన్నారు. ఎందుకంటే, మనం చూస్తూనే ఉన్నాం. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగులు చూసేందుకు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు స్వయంగా చూసేందుకు విదేశాలకు వెళ్తున్నారు.
2023 మార్చి 31తో పోలిస్తే 2024 మార్చి 31 నాటికి పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 15 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 69.6 మిలియన్ల మంది విదేశీయానం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అన్ని రకాల వారూ ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఆపాటి, ఈపాటి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో విదేశీయానం చెయ్యని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.
బడ్జెట్‌లో ఒక కొత్త మార్పు వచ్చింది. విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆదాయం మొదలైనవాటిని చూపించని ఎంతో మంది భారతీయ పౌరులు ఉన్నారు. బ్లాక్‌మనీ 2015 చట్టం ప్రకారం ఇలాంటి ఆస్తులను చూపించకపోవటం నేరం. ఇలాంటి వారి మీద దృష్టి పెడుతోంది డిపార్టుమెంటు. ఒకప్పుడు ఎవరు విదేశీయానం చేసినా, ప్రయాణానికి ముందు క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని నిబంధన ఉండేది. దాన్ని సడలించారు. రద్దు చేశారని చెప్పారు. అంతేకాకుండా 1/4 బిఅని 1/6 అని షరతులు ఉండేవి. ఒక షరతు ప్రకారం స్వయంగా విదేశీయానం చేయకపోయినా ‘టికెట్’ కొని ఉంటే రిటర్నుల్లో చూపించాల్సి వచ్చేది. కాలక్రమేణా సరడలింపుల వల్ల అంతా మర్చిపోయారు.
కానీ మొన్న బడ్జెట్‌లో ఈ ప్రస్తావన రావడంతో అందరిలోనూ గుబులు.. కానీ నిబంధన కొంతమందికే వర్తిస్తుంది. తల్లిదండ్రులెవరూ భయపడక్కర్లేదు. డిపార్టుమెంటుకి వెళ్లక్కర్లేదు. సర్టిఫికెట్ తీసుకోనవసరం లేదు. రిలాక్స్.. రిలాక్స్.. అందరికీ ఇది అవసరం లేదు. మీరంతా నిశ్చింతగా ప్లాన్ చేసుకోవచ్చు.
ఎవరికి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలి..
ఆర్థికపరంగా అవకతవకలు చేసినవారు, పది లక్షలు దాటి పన్ను చెల్లించాల్సిన వారు, ఈ పన్ను భారానికి ‘స్టే’ విధించకపోతే.. ఇటువంటి వారికి కావాలి. ఇది అరుదైన పరిస్థితి. అసాధారణ పరిస్థితి. ట్యాక్స్ చెల్లించకపోవడం నేరం. కట్టకుండా విదేశాలకు వెళ్లే వారి నుంచి .. అంటే డిఫాల్టర్ల నుంచి పన్ను వసూలు చెసే ప్రక్రియలో భాగంగా ఈ సర్టిఫికెట్ అడుగుతారు. పైన చెప్పిన రెండు షరతులు ఫిబ్రవరి 2004 నాడు జారీ చేసిన సూచన .. కాదు.. ఆదేశం అని అనాలి. అంటే 20 సంవత్సరాల మాట .. ఈ ఆదేశానికి, 2015 బ్లాక్ మనీ చట్టానికి లింకు కలిపారు. ఈ విషయాన్నే 2024లో ప్రస్తావించారు. ఇరవై సంవత్సరాల మాట .. ఇప్పుడు ప్రస్తావన తేవడంతో దురదృష్టవశాత్తూ ప్రజల్లో భయాందోళనలకు దారి తీసింది. ఏం గాభరాపడక్కర్లేదు.
మీరు ఒక విజయ్ మాల్యాని .. ఒక నీరవ్ మోడీని ప్రస్తావించి గవర్నమెంటు మీద దుమ్మెత్తిపోయకండి. చట్టప్రకారం రిటర్ను వేయడం విధి. పన్ను చెల్లించడం తప్పనిసరి. ఆ దోవలో వెళ్తే మిమ్మల్ని ఎవరూ ఆపరు. అడ్డు చెప్పరు. ఆటంకపర్చరు. ఎయిర్‌పోర్టుకి ఎవరూ రారు. అయితే, ఒక సూచన. మీతోపాటు మీ పాన్‌కార్డు, మీరు అసెస్సీ అయితే లేటెస్ట్ రిటర్ను కాపీ పెట్టుకోండి. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపోయినా రిటర్నులు వేసే అవసరం లేకపోయినా.. అసెస్‌మెంట్ కాకపోయినా .. అసెస్‌మెంట్ ఆగిపోయినా 10 లక్షల లోపుల పన్నులు చెల్లించకపోయినా (మనలో మన మాట, బండి అంతవరకు పోనివ్వకండి) గాభరా పడక్కర్లేదు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. బాన్ వొయాజ్.. ఆల్ ద బెస్ట్.
Comments
Please login to add a commentAdd a comment