clearance certificate
-
విదేశాలకు క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలా..
విదేశాల వెళ్లాలనుకునేవారికి ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంటు వారి నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలా అనే ప్రశ్న ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి సుందరకాండలో హనుమంతుడి జవాబులాగా ‘‘అక్కర్లేదు’’ అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వివరాల్లోకి వెళదాం..ఈ మధ్యే ఆర్థిక శాఖ తెచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలో విదేశీయానం చేసేవారంతా ఆదాయపు పన్ను శాఖ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలనే అర్థం వచ్చేలా ధ్వనించింది. దీంతో అందరు పౌరులు ఉలిక్కిపడ్డారు. గాభరా పడ్డారు. షాక్ తిన్నారు. ఎందుకంటే, మనం చూస్తూనే ఉన్నాం. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగులు చూసేందుకు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు స్వయంగా చూసేందుకు విదేశాలకు వెళ్తున్నారు.2023 మార్చి 31తో పోలిస్తే 2024 మార్చి 31 నాటికి పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 15 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 69.6 మిలియన్ల మంది విదేశీయానం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అన్ని రకాల వారూ ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఆపాటి, ఈపాటి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో విదేశీయానం చెయ్యని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.బడ్జెట్లో ఒక కొత్త మార్పు వచ్చింది. విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆదాయం మొదలైనవాటిని చూపించని ఎంతో మంది భారతీయ పౌరులు ఉన్నారు. బ్లాక్‌మనీ 2015 చట్టం ప్రకారం ఇలాంటి ఆస్తులను చూపించకపోవటం నేరం. ఇలాంటి వారి మీద దృష్టి పెడుతోంది డిపార్టుమెంటు. ఒకప్పుడు ఎవరు విదేశీయానం చేసినా, ప్రయాణానికి ముందు క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని నిబంధన ఉండేది. దాన్ని సడలించారు. రద్దు చేశారని చెప్పారు. అంతేకాకుండా 1/4 బిఅని 1/6 అని షరతులు ఉండేవి. ఒక షరతు ప్రకారం స్వయంగా విదేశీయానం చేయకపోయినా ‘టికెట్’ కొని ఉంటే రిటర్నుల్లో చూపించాల్సి వచ్చేది. కాలక్రమేణా సరడలింపుల వల్ల అంతా మర్చిపోయారు.కానీ మొన్న బడ్జెట్లో ఈ ప్రస్తావన రావడంతో అందరిలోనూ గుబులు.. కానీ నిబంధన కొంతమందికే వర్తిస్తుంది. తల్లిదండ్రులెవరూ భయపడక్కర్లేదు. డిపార్టుమెంటుకి వెళ్లక్కర్లేదు. సర్టిఫికెట్ తీసుకోనవసరం లేదు. రిలాక్స్.. రిలాక్స్.. అందరికీ ఇది అవసరం లేదు. మీరంతా నిశ్చింతగా ప్లాన్ చేసుకోవచ్చు.ఎవరికి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలి..ఆర్థికపరంగా అవకతవకలు చేసినవారు, పది లక్షలు దాటి పన్ను చెల్లించాల్సిన వారు, ఈ పన్ను భారానికి ‘స్టే’ విధించకపోతే.. ఇటువంటి వారికి కావాలి. ఇది అరుదైన పరిస్థితి. అసాధారణ పరిస్థితి. ట్యాక్స్ చెల్లించకపోవడం నేరం. కట్టకుండా విదేశాలకు వెళ్లే వారి నుంచి .. అంటే డిఫాల్టర్ల నుంచి పన్ను వసూలు చెసే ప్రక్రియలో భాగంగా ఈ సర్టిఫికెట్ అడుగుతారు. పైన చెప్పిన రెండు షరతులు ఫిబ్రవరి 2004 నాడు జారీ చేసిన సూచన .. కాదు.. ఆదేశం అని అనాలి. అంటే 20 సంవత్సరాల మాట .. ఈ ఆదేశానికి, 2015 బ్లాక్ మనీ చట్టానికి లింకు కలిపారు. ఈ విషయాన్నే 2024లో ప్రస్తావించారు. ఇరవై సంవత్సరాల మాట .. ఇప్పుడు ప్రస్తావన తేవడంతో దురదృష్టవశాత్తూ ప్రజల్లో భయాందోళనలకు దారి తీసింది. ఏం గాభరాపడక్కర్లేదు.మీరు ఒక విజయ్ మాల్యాని .. ఒక నీరవ్ మోడీని ప్రస్తావించి గవర్నమెంటు మీద దుమ్మెత్తిపోయకండి. చట్టప్రకారం రిటర్ను వేయడం విధి. పన్ను చెల్లించడం తప్పనిసరి. ఆ దోవలో వెళ్తే మిమ్మల్ని ఎవరూ ఆపరు. అడ్డు చెప్పరు. ఆటంకపర్చరు. ఎయిర్‌పోర్టుకి ఎవరూ రారు. అయితే, ఒక సూచన. మీతోపాటు మీ పాన్‌కార్డు, మీరు అసెస్సీ అయితే లేటెస్ట్ రిటర్ను కాపీ పెట్టుకోండి. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపోయినా రిటర్నులు వేసే అవసరం లేకపోయినా.. అసెస్మెంట్ కాకపోయినా .. అసెస్మెంట్ ఆగిపోయినా 10 లక్షల లోపుల పన్నులు చెల్లించకపోయినా (మనలో మన మాట, బండి అంతవరకు పోనివ్వకండి) గాభరా పడక్కర్లేదు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. బాన్ వొయాజ్.. ఆల్ ద బెస్ట్. -
వేలాదిమంది రైతులకు క్లియరెన్స్ పత్రాలు
-
కొవాగ్జిన్.. ఇంకెంత కాలం?
కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకుని.. బయటి దేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఇదొక చేదు వార్త. కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతుల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుస్తోంది. పూర్తి స్వదేశీ కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’.. డబ్ల్యూహెచ్‌వో ఈయూఏ లిస్ట్‌లో లేదు. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్‌వో క్లియరెన్స్ తప్పనిసరిగా మారింది. రేపో, ఎల్లుండో అనే అంచనాల నడుమ.. ఇప్పుడు ఆ క్లియరెన్స్ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ►ఫేజ్ 3 ట్రయల్స్‌లో కొవాగ్జిన్ వ్యాక్సిన్ 77.8 శాతం సమర్థవంతంగా ప్రభావం చూపెట్టిందని భారత్ బయోటెక్ ప్రకటించుకుంది. ►అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).. మాత్రం కొవాగ్జిన్‌కు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు ►హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇప్పటికే క్లియరెన్స్ సంబంధిత దరఖాస్తు పత్రాలను డబ్ల్యూహెచ్‌వోకి సమర్పించింది ►కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌కు గ్లోబల్ బాడీ(డబ్ల్యూహెచ్‌వో) క్లియరెన్స్ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వస్తోంది. ►అయితే నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చైర్పర్సన్ డాక్టర్ వీకే పాల్ మాత్రం ఈ నెలాఖరుకల్లా క్లియరెన్స్ వస్తుందని గతంలో ప్రకటించారు. ►కానీ, టెక్నికల్ సంబంధిత సమస్యలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ►ఈ ఆలస్యం.. విదేశాలకు ప్రయాణించే భారతీయులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇబ్బందికరంగా మారనుంది. ► WHO స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇమ్యూనైజేషన్ (సేజ్) అక్టోబర్ 6న జరగబోయే భేటీలో కూడా కొవాగ్జిన్ క్లియరెన్స్‌పై స్పష్టత రాకపోవచ్చనే అంటున్నారు. ►భారత్‌లో కొవాగ్జిన్‌తో పాటు కొవిషీల్డ్‌ను ఈ ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా జనాభాకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ►ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ సంయుక్తంగా భారత్‌కు చెందిన సీరమ్‌తో ఒప్పందం ద్వారా కొవిషీల్డ్‌ను తయారు చేసి అందిస్తున్నాయి. ►కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అప్రూవల్(సర్టిఫికెట్ వెరిఫై ప్రక్రియ ద్వారా కొన్ని దేశాల్లోకి అనుమతిస్తున్నారు) ఉంది. ►అంతర్జాతీయ వైద్య విభాగంగా భావించే డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ లిస్ట్‌లో ఇప్పటిదాకా కేవలం.. ఫైజర్-బయోఎన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, సినోఫార్మ్ వ్యాక్సిన్లకు మాత్రమే చోటు దక్కింది. చదవండి: ఒక అడుగు ముందుకు.. రెండు వెనక్కు! -
అగ్నిమాపక శాఖలో పిరమిడ్ లొల్లి
► ఏడాదిగా ఎన్వోసీలు జారీ చేయని అగ్నిమాపక శాఖ ► న్యాయం కోసం కోర్టుకెళుతున్న డెవలపర్లు ► సానుకూలంగా తీర్పు వస్తే.. దాన్నీ అప్పీల్ చేస్తున్న శాఖ ► అనుమతుల కోసం 15 లక్షల చ.అ. నిర్మాణాలు ఎదురుచూపు ► ఫీజులు, పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడైనా సరే నిర్మాణ అనుమతుల నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) జారీ కోసం ఎక్కడికెళతారంటే? ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ‘సంబంధిత ప్రభుత్వ విభాగానికి అని’! కానీ, భాగ్యనగరంలో మాత్రం న్యాయస్థానం చుట్టూ తిరగాల్సి వస్తోంది! అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి మరి. నగరంలో భవనాలన్నీ ఒకే ఆకారంలో కాకుండా విభిన్న డిజైన్లలో ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నం.168ను తీసుకొచ్చింది. జీవో ప్రకారం స్టెప్ట్/ పోడియం ఆకారంలో నిర్మాణాలకు 5వ అంతస్తు వరకు 9 మీటర్ల సెట్‌బ్యాక్, ఆపైన 5 అంతస్తుల వరకు 1 మీటర్ సెట్‌బ్యాక్ వదలాలనే నిబంధన ఉంది. అయితే ఆయా నిబంధనల ప్రకారం అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) జారీ చేయట్లేదని డెవలపర్ల వాదన. ⇒ ఒకవైపు ఎన్వోసీ రాక, మరోవైపు తెచ్చుకున్న అప్పుకు వడ్డీ కట్టలేక విసిగిపోయిన ఓ డెవలపర్ గతంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. జీవో నిబంధనలు, డెవలపర్ వాదనను విన్న నాయయస్థానం సానుకూలంగా తీర్పునిచ్చింది. ‘‘ఆహా.. నువ్వు నా మీదే కోర్టుకు వెళతావా? ఇక నీకు ఎన్వోసీ ఎలా వస్తుందో చూసుకుంటానని’’ వ్యక్తిగతంగా తీసుకున్న సంబంధిత అగ్నిమాపక శాఖ అధికారి ఆ ఒక్క డెవలపర్‌దే కాదు పిరమిడ్ ఆకారంలోని ఏ నిర్మాణాలకూ ఎన్వోసీ జారీ చేయట్లేదు. ఇలా గత ఏడాది కాలంగా అగ్నిమాపక శాఖలో సుమారు 20కి పైగా ఫైళ్లు పడిఉన్నాయని సమాచారం. అంతే.. నేనింతే! ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. డెవలపర్‌కు సానుకూలంగా కోర్టు తీర్పునిస్తే.. దాని మీద సంబంధిత అగ్నిమాపక శాఖ అధికారి పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం! ⇒ ఎలాగోలా ఈ లొల్లి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధికి చేరింది. అయితే ఇప్పుడు సంబంధిత శాఖ అగ్నిమాపక శాఖకు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది? అసలీ సమస్యపై ఎలాంటి వివరణ కోరుతుందని డెవలపర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు కోర్టు తీర్పునూ కాదంటూ.. ఇటు ప్రభుత్వమూ పట్టించుకోకపోతే ఇక ఈ సమస్యకు పరిష్కారమెలానని డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. ⇒ ప్రస్తుతం నగరంలో చాలా భవంతులు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. మరో 15 నిర్మాణ సంస్థలు సుమారు 15–20 లక్షల చ.అ.ల్లో పిరమిడ్ ఆకారంలో భవంతులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క అధికారి మొండి పట్టుదలతో ఫీజులు, రిజిస్ట్రేషన్ చార్జీలు, వ్యాట్, పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడింది. మరోవైపు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలూ దూరమయ్యాయి. -
కాసులిస్తే ‘క్లియర్’
జిల్లాలో మరో అక్రమానికి తెరలేచింది. విదేశాలకు వెళ్లేందుకు కీలకమైన పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల(పీసీసీ)ను కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అంగట్లో అమ్ముతున్నారు. ఇష్టారాజ్యంగా నడుస్తున్న ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయి. వీటిపై నిఘా పెట్టాల్సిన విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కరీంనగర్ క్రైం : జిల్లా నుంచి నెలకు వంద మందికి పైగా ఇతర దేశాలకు జీవనోపాధి కోసం వెళ్తుంటారని అంచనా. వీరిలో అనేక మంది విజిటింగ్ వీసాతో గల్ఫ్‌దేశాలకు వెళ్లి పనిచేస్తుంటారు. వీసా గడువు ముగిసినా దొంగచాటుగా అక్కడే ఉంటున్నారు. గల్ఫ్ దేశాలు ప్రతీసారి అలాంటి వారిని వెతికి పట్టుకుని వారివారి దేశాలకు పంపిస్తుంటాయి. ఇలా వెళ్తున్న వారిలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లావాసులే ఎక్కువ. ఇలా దొంగచాటుగా వెళ్లి అక్కడి పోలీసులకు చిక్కి జైళ్లలో మగ్గుతున్న వారెందరో ఉన్నారు. ఏదైనా పెద్ద సంఘటన జరిగి మృతి చెందుతున్నా సమాచారం ఉండడం లేదు. గతంలో ఇలాంటి సమాచారం కోసం ప్రయత్నాలు చేయగా సరైన ఆధారాలు దొరికేవికావు. దీంతో దేశం నుంచి వెళ్లే వారు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) ఉండాలనే నిబంధన విధించింది. దొంగచాటుగా వెళ్తున్న వారికి అడ్డుకట్ట వేయడంతోపాటు నేరస్తులు దేశం దాటిపోకుండా నియంత్రించగలిగింది. సర్టిఫికెట్ ఇచ్చేది ఇలా... గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు పాస్‌పోర్టు, అక్కడి కంపెనీ కాంట్రాక్ట్(వీసా), వేతన వివరాలు, స్థానికం గా ఉన్న అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్‌లు, ఒరిజినల్ తీసుకుని జిల్లా పోలీస్‌కార్యాలయంలో ఏర్పాటుచేసిన విభాగంలో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడున్న అధికారులు వాటిని పరిశీలించి ఎస్పీకి పంపిస్తారు. ఎస్పీ ఎండార్స్తో ఇంటెలిజెన్స్ ఐజీ కార్యాలయానికి పంపిస్తారు. వీటితోపాటు ఎస్బీ(స్పెషల్ బ్రాంచ్) అధికారులూ ఒక కాపీ తీసుకుని విచారిస్తారు. ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులు విచారించిన అనంతరం దరఖాస్తుదారుడిపై ఎలాంటి కేసులు లేవని ఇతర చిరునామాలు విచారించి అనంతరం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) జారీ చేస్తారు. అప్పుడు ఇతర దేశాలకు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు. అంగట్లో పీసీసీలు నిబంధనలు కఠినతరం కావడంతో గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి పీసీసీలు రావడం గగనంగా మారింది. దీన్ని గ్రహించిన కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకు లు అందినకాడికి దండుకుంటున్నారు. సాధారణంగా ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో, జిల్లా నుంచే పీసీసీలు తీసుకోవాలి. ట్రావెల్ ఏజెంట్లు ఈ కొత్త దందాకు తెరలేపారు. నకిలీ పీసీసీలు ఇవ్వడం లేదా నిజామాబాద్, హైదరాబాద్ నుంచి ఇప్పించి పలువురిని దేశం దాటిస్తున్నారు. రిటైర్ అయిన పోలీస్ అధికారులు, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన పోలీస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి మరి పీసీసీలు అందిస్తున్నారు. ఇటీవల సిరిసిల్ల సీఐ సంతకం ఫోర్జరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిగురుమామిడి మండలానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా పోలీస్ కార్యాల యానికి దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లగా.. పత్రాలు నిబంధనల ప్రకారం లేవని తిప్పి పంపించారు. దీంతో కరీంనగర్‌లోని ఓ ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించగా.. పీసీసీ తయారుచేసి ఇచ్చారు. సర్టిఫికెట్‌కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. కొందరు ట్రావెల్ ఏజెంట్లు సమకూర్చిన పీసీసీలు సరిగా లేకపోవడంతో పలువురు ఎయిర్‌పోర్టు నుంచి తిరిగొచ్చిన ఘటనలున్నాయి. ఎస్బీ నిఘా ఎక్కడ? జిల్లా పోలీస్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్న వారి సమాచారం సేకరణలో స్పెషల్‌బ్రాంచ్(ఎస్బీ) వెనకబడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తుదారులను జిల్లా పోలీస్ కార్యాలయం తిప్పి పంపిస్తోంది. అలాంటి వారిపై నిఘా పెట్టాల్సిన ఎస్బీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ట్రావెలింగ్ ఏజెంట్ల ద్వారా పీసీసీలు పొంది దేశం దాటిపోతున్నా వారి సమాచారం సేకరించలేకపోతోంది. మరి కొన్నిచోట్ల పీసీసీలు రాని వారికి ట్రావెలింగ్ ఏజెన్సీలకు వెళ్లమని కొందరు ఎస్బీ అధికారులే సూచిస్తున్నారని సమాచారం. పాస్‌పోర్టు విచారణ, ఉద్యోగుల సమాచారం సేకరణ ఇతర విచారణలు కాసులు కురిపిస్తుండడం, పనిలో ఒత్తిడి లేకుండా ఉండడంతో ఎస్బీలోకి బదిలీ అయిన అధికారులు అక్కడే పాతుకుపోతున్నారనే ఆరోపణలున్నాయి. -
ఏసీబీ వలలో ఆర్టీఏ ఉద్యోగి
అత్తాపూర్, న్యూస్‌లైన్: ప్రైవేట్ బస్సుకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.30 వేల లంచం తీసుకుంటూ అత్తాపూర్ ఆర్టీఏ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ ప్రభాకర్ కథనం ప్రకారం... ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ మోహినుద్దీన్ 2013 అక్టోబర్‌లో శ్రీరాం ఫైనాన్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఆక్షన్ మేళాలో బస్సు (ఏపీ 28 టీబీ 4545)ను కొనుగోలు చేశారు. ఈ బస్సును తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసి వరంగల్‌లో నడిపించేందుకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించారు. అప్పటికే బస్సుపై వివిధ టాక్స్‌ల రూపంలో రూ. 5 లక్షల బకాయి ఉంది. దీన్ని చెల్లిస్తే క్లియరెన్స్ ఇస్తామని ఆర్టీఏ అధికారులు చెప్పడంతో మోహినుద్దీన్ శ్రీరాం ఫైనాన్స్‌ను సంప్రదించగా వారు తమకు సంబంధంలేదన్నారు. దీంతో మోహినుద్దీన్ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం రూ.2 లక్షల 86 వేలు కట్టాలని తీర్పు ఇవ్వడంతో ఆ మొత్తాన్ని ఆయన డీడీ ద్వారా జమ చేశారు. ఈనెల 16న అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేశారు. ఈ ఫైల్ సీనియర్ అసిస్టెంట్ జగన్నాథ్‌నాయక్ వద్దకు వెళ్లింది. తనకు రూ. 50 వేలు లంచం ఇస్తేనే క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. అంత ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పడంతో ఫైల్‌ను తన వద్దే ఉంచుకున్నారు. ఎట్టకేలకు మోహినుద్దీన్ మంగళవారం రూ. 30 వేలు ఇస్తానని చెప్పడంతో జగన్నాథ్‌నాయక్ పని పూర్తి చేసేందుకు ఒప్పుకున్నారు. బాధితుడు ఈవిషయాన్ని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్‌కు ఫిర్యాదు చేయడంతో వారు సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకొనేందుకు వల పన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మోహినుద్దీన్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి డబ్బులు తెచ్చానని చెప్పాడు. క్లియరెన్స్ సర్టిఫికెట్ ప్రింట్ తీసిన జగన్నాథ్‌నాయక్ డబ్బును తన సహాయకుడు రమేష్‌కు ఇవ్వాలని సూచించారు. మోహినుద్దీన్ నుంచి రమేష్ లంచం డబ్బు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాను జగన్నాథ్నాయక్కు సహాయకుడిగా పని చేస్తున్నానని, అతని సూచన మేరకే డబ్బు తీసుకున్నానని ఏసీబీ అధికారుల విచారణలో రమేష్ వెల్లడించాడు. దీంతో ఏసీబీ అధికారులు జగన్నాథ్నాయక్తో పాటు రమేష్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ వెంకట్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.