జిల్లాలో మరో అక్రమానికి తెరలేచింది. విదేశాలకు వెళ్లేందుకు కీలకమైన పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల(పీసీసీ)ను కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అంగట్లో అమ్ముతున్నారు. ఇష్టారాజ్యంగా నడుస్తున్న ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయి. వీటిపై నిఘా పెట్టాల్సిన విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
కరీంనగర్ క్రైం : జిల్లా నుంచి నెలకు వంద మందికి పైగా ఇతర దేశాలకు జీవనోపాధి కోసం వెళ్తుంటారని అంచనా. వీరిలో అనేక మంది విజిటింగ్ వీసాతో గల్ఫ్‌దేశాలకు వెళ్లి పనిచేస్తుంటారు. వీసా గడువు ముగిసినా దొంగచాటుగా అక్కడే ఉంటున్నారు. గల్ఫ్ దేశాలు ప్రతీసారి అలాంటి వారిని వెతికి పట్టుకుని వారివారి దేశాలకు పంపిస్తుంటాయి. ఇలా వెళ్తున్న వారిలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లావాసులే ఎక్కువ. ఇలా దొంగచాటుగా వెళ్లి అక్కడి పోలీసులకు చిక్కి జైళ్లలో మగ్గుతున్న వారెందరో ఉన్నారు. ఏదైనా పెద్ద సంఘటన జరిగి మృతి చెందుతున్నా సమాచారం ఉండడం లేదు. గతంలో ఇలాంటి సమాచారం కోసం ప్రయత్నాలు చేయగా సరైన ఆధారాలు దొరికేవికావు. దీంతో దేశం నుంచి వెళ్లే వారు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) ఉండాలనే నిబంధన విధించింది. దొంగచాటుగా వెళ్తున్న వారికి అడ్డుకట్ట వేయడంతోపాటు నేరస్తులు దేశం దాటిపోకుండా నియంత్రించగలిగింది.
సర్టిఫికెట్ ఇచ్చేది ఇలా...
గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు పాస్‌పోర్టు, అక్కడి కంపెనీ కాంట్రాక్ట్(వీసా), వేతన వివరాలు, స్థానికం గా ఉన్న అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్‌లు, ఒరిజినల్ తీసుకుని జిల్లా పోలీస్‌కార్యాలయంలో ఏర్పాటుచేసిన విభాగంలో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడున్న అధికారులు వాటిని పరిశీలించి ఎస్పీకి పంపిస్తారు. ఎస్పీ ఎండార్స్‌తో ఇంటెలిజెన్స్ ఐజీ కార్యాలయానికి పంపిస్తారు. వీటితోపాటు ఎస్‌బీ(స్పెషల్ బ్రాంచ్) అధికారులూ ఒక కాపీ తీసుకుని విచారిస్తారు. ఇంటెలిజెన్స్, ఎస్‌బీ అధికారులు విచారించిన అనంతరం దరఖాస్తుదారుడిపై ఎలాంటి కేసులు లేవని ఇతర చిరునామాలు విచారించి అనంతరం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) జారీ చేస్తారు. అప్పుడు ఇతర దేశాలకు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు.
అంగట్లో పీసీసీలు
నిబంధనలు కఠినతరం కావడంతో గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి పీసీసీలు రావడం గగనంగా మారింది. దీన్ని గ్రహించిన కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకు లు అందినకాడికి దండుకుంటున్నారు. సాధారణంగా ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో, జిల్లా నుంచే పీసీసీలు తీసుకోవాలి. ట్రావెల్ ఏజెంట్లు ఈ కొత్త దందాకు తెరలేపారు. నకిలీ పీసీసీలు ఇవ్వడం లేదా నిజామాబాద్, హైదరాబాద్ నుంచి ఇప్పించి పలువురిని దేశం దాటిస్తున్నారు. రిటైర్ అయిన పోలీస్ అధికారులు, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన పోలీస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి మరి పీసీసీలు అందిస్తున్నారు.
ఇటీవల సిరిసిల్ల సీఐ సంతకం ఫోర్జరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిగురుమామిడి మండలానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా పోలీస్ కార్యాల యానికి దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లగా.. పత్రాలు నిబంధనల ప్రకారం లేవని తిప్పి పంపించారు. దీంతో కరీంనగర్‌లోని ఓ ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించగా.. పీసీసీ తయారుచేసి ఇచ్చారు. సర్టిఫికెట్‌కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. కొందరు ట్రావెల్ ఏజెంట్లు సమకూర్చిన పీసీసీలు సరిగా లేకపోవడంతో పలువురు ఎయిర్‌పోర్టు నుంచి తిరిగొచ్చిన ఘటనలున్నాయి.
ఎస్‌బీ నిఘా ఎక్కడ?
జిల్లా పోలీస్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్న వారి సమాచారం సేకరణలో స్పెషల్‌బ్రాంచ్(ఎస్‌బీ) వెనకబడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తుదారులను జిల్లా పోలీస్ కార్యాలయం తిప్పి పంపిస్తోంది. అలాంటి వారిపై నిఘా పెట్టాల్సిన ఎస్‌బీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ట్రావెలింగ్ ఏజెంట్ల ద్వారా పీసీసీలు పొంది దేశం దాటిపోతున్నా వారి సమాచారం సేకరించలేకపోతోంది. మరి కొన్నిచోట్ల పీసీసీలు రాని వారికి ట్రావెలింగ్ ఏజెన్సీలకు వెళ్లమని కొందరు ఎస్‌బీ అధికారులే సూచిస్తున్నారని సమాచారం. పాస్‌పోర్టు విచారణ, ఉద్యోగుల సమాచారం సేకరణ ఇతర విచారణలు కాసులు కురిపిస్తుండడం, పనిలో ఒత్తిడి లేకుండా ఉండడంతో ఎస్‌బీలోకి బదిలీ అయిన అధికారులు అక్కడే పాతుకుపోతున్నారనే ఆరోపణలున్నాయి.
కాసులిస్తే ‘క్లియర్’
Published Tue, Sep 2 2014 2:41 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement