శ్రీశైలం ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి
శ్రీశైలం ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి
Published Fri, Feb 17 2017 10:57 PM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM
అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ రావు
కర్నూలు(రాజ్‌విహార్): మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శైవ క్షేత్రాల్లో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌ఎస్) కె. సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా శ్రీశైలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నాలుగు ప్రాంతాలను గుర్తించామన్నారు. వాటిలో కంట్రోల్ రూమ్ (ఆసుపత్రి), ఆలయం వెనుక, పాతాళగంగ రోడ్డు, కర్ణాటక గెస్టు హౌస్ వద్ద ఒక్కొక్క ఫైర్ ఇంజన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు ఒక బుల్లెట్ అగ్నిమాపక వాహనం కూడా సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపారు.
పాతాళగంగ వద్ద భక్తుల రక్షణ కోసం 15 మంది రెస్క్యూ సిబ్బంది నియమిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 75 మంది విధులు నిర్వహిస్తుండగా ఐదుగురు అధికారులుంటారని వెల్లడించారు. తమ శాఖ సిబ్బందితోపాటు పోలీసు, ఇతర అధికారులు సూచించిన నిబంధనలు, హెచ్చరికలను పాటించి సహకరించాలని కోరారు. గుజరాత్ రాష్ట్రంలో విపత్తు, అగ్ని మాపకంపై డిగ్రీలో కోర్సులు ఉన్నాయని, ఈ మేరకు ప్రమాద, విపత్తులను నివారణ కోసం ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కర్నూలు, వైఎస్‌ఆర్ కడప జిల్లా ఫైర్ అఫీసర్లు భూపాల్ రెడ్డి, విజయకుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement