
యలమంచిలి (అనకాపల్లి జిల్లా)/ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): రైతు పక్షపాతిగా దివంగత విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు నిలిచిపోయారని టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ప్రశంసించారు. యలమంచిలిలోని తులసీనగర్‌లో బుధవారం నిర్వహించిన తులసీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని తులసీరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్‌కుమార్, కుమార్తె, యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారిని పరామర్శించి సానుభూతి తెలియజేశారు.
సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాన్ని తెలుసుకుని, నిరంతరం వారి సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను అమలుచేసిన ఒక శక్తి తులసీరావు అన్నారు. ఆయన మృతి పార్టీకి, ఉత్తరాంధ్ర జిల్లాల పాడి రైతులకు తీరని నష్టమని చెప్పారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు యు.వి.రమణమూర్తిరాజు, అవంతి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ విశాఖజిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, మళ్ల విజయప్రసాద్ పాల్గొన్నారు. కాగా, ఆడారి తులసీరావుకు పద్మశ్రీ ప్రదానం చేయాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆయన బుధవారం అడారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment