సాక్షి, విశాఖపట్నం: రాజకీయ నాయకులను, ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం కూటమి నేతలకు అలవాటేనని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.
కాగా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయానికి కృషి చేయాలి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే సంఖ్యా బలం ఉంది. ప్రలోభాలకు గురి చేయడం కూటమి నేతలకు అలవాటే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు గురిచేశారు. మా ప్రజా ప్రతినిధులపై మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అందరూ వైఎస్సార్‌సీపీకే అండగా ఉంటారు అని చెప్పారు.
అంతకుముందు, అనకాపల్లిలోని చోడవరం మాడుగుల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు, కరణం ధర్మశ్రీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ..‘ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ బలం ఉంది. 600 మందికిపైగా సభ్యుల బలం వైఎస్సార్‌సీపీకి ఉంది. కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే కూటమికి ఉంది. ప్రలోభాలతో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు మోసం ప్రజలకు తెలియాలి. దేశంలో రాష్ట్రం దివాళా తీసిందని మాట్లాడే వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే. రాజకీయాల్లో 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?. వైఎస్సార్‌సీపీ సభ్యులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా?. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు ఎన్నో రోజులు నమ్మరు అంటూ కామెంట్స్ చేశారు.
ఇక, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం కలెక్టర్ విడుదల చేశారు.
షెడ్యూల్ ఇలా..
ఈనెల 30 ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక.
రేపటి నుంచి అమలులోకి నోటిఫికేషన్.
ఈనెల 13వ తేదీ నామినేషన్‌లకు ఆఖరు తేదీ.
14న నామినేషన్ల స్క్రూన్నీ
నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు.
ఈనెల 30న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్.
సెప్టెంబర్ 3న కౌంటింగ్.
రేపటి నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు.
ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు సిద్దమైన వైఎస్సార్‌సీపీ.
Comments
Please login to add a commentAdd a comment