టెక్నాలజీని వినాశనానికి ఉపయోగిస్తే ఎంతటి తీవ్ర పరిణామాలుంటాయో ఇప్పటికే ఎన్నో ఘటనల ద్వారా తెలిసింది. అదే టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటే ఎంతటి ప్రయోజనాలుంటాయో ఢిల్లీ పోలీసులు చాటిచెప్పారు. ఇంతకీ టెక్నాలజీ సాయంతో వారు చేసిన మంచిపని ఏంటో తెలుసా? ఇది చదవండి...
న్యూఢిల్లీ : సెల్‌ఫోన్‌లాంటి చిన్న వస్తువు పోతేనే విలవిల్లాడిపోతాం. మరి కన్నబిడ్డలు దూరమైతే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణించలేనిది. కనిపించకుండా పోయిన బిడ్డ గురించే ఆలోచిస్తూ రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిపేస్తున్న తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. మరి వారి గర్భశోకాన్ని తీర్చేదెలా? ఇందుకు పరిష్కారం చూపారు ఢిల్లీ పోలీసులు. తప్పిపోయిన చిన్నారులను ఓ సాఫ్ట్‌వేర్ సాయంతో, వారి సొంతవారెవరో గుర్తించేస్తున్నారు. కేవలం నాలుగు రోజుల్లో 3వేల మంది చిన్నారులను గుర్తించి, కన్నవారి చెంతకు చేర్చారట. ఇందుకోసం ఢిల్లీ పోలీసులు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏంటో తెలుసా?
ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్). సాఫ్ట్‌వేర్ ప్రయోగాత్మకంగా ఎటువంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకునేందుకు ఓ నాలుగు రోజులు ప్రయత్నిస్తేనే 3 వేల మంది చిన్నారులను కాపాడగలిగామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను వాడేందుకు ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఎప్రిల్ 5న ఢిల్లీ హైకోర్టు అనుమతిని కోరారు. కానీ హైకోర్టు మాత్రం ఈ అప్లికేషన్‌ను వాడేందుకు అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతేగాక పిల్లల డేటాను ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టవద్దని హెచ్చరికలు జారీచేసింది. దాంతో పోలీసులు వివిధ చిల్డ్రన్స్ హోమ్స్‌లో ఉంటున్న 45 వేలమంది పిల్లలపై ఎఫ్‌ఆర్‌ఎస్ సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు.
దీంతో వారి ముఖాల ద్వారా 2,930 మంది పిల్లల వివరాలను గుర్తించారు. ఈ విషయాన్నే మహిళాశిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్‌లో వివరించింది. తప్పిపోయిన పిల్లలను వెతకడానికి ఈ సాఫ్ట్‌వేర్ బాగా ఉపయోగపడడంతో అనేక ఎన్జీవో సంస్థలు హర్షం వ్యక్తం చేస్తూ.. సాఫ్ట్‌వేర్‌ను పోలీసులకు ఉచితంగా అందించాలని సూచించాయి. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌సైతం పిల్లలను గుర్తించేందుకు ఉపయోగపడే ఈ సాఫ్ట్‌వేర్‌ను సమర్థించింది. తప్పిపోయిన చిన్నారులను తమ వారి దగ్గరు చేర్చేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment