
జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలి: బండా శ్రీశైలం
కోదాడ: కరువుతో జిల్లా రైతాంగం, పనులు లేక వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండా శ్రీశైలం కోరారు. ఆదివారం కోదాడలోని సందరయ్య భవన్‌లో జరిగిన ఆ సంఘం డివిజన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల వల్ల వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకు పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించినప్పటికీ పలు కంపెనీలు ఇంకా ధరలు తగ్గించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు బ్యాంక్ రుణాలు ఇవ్వకుండా సతాయిస్తున్నాయన్నారు. పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం వల్ల అధిక వడ్డీలు చెల్లించలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కంది, పెసర కల్తీ విత్తనాలు సరఫరా చెయడం వల్ల రైతులు నష్టపోయారని,కల్తీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జుట్టుకొండ బసవయ్య, ఏనుగుల వీరాంజనేయులు, బుర్రి శ్రీరాములు, వీరయ్య, వెంకటేశ్వర్లు, బిక్షం తదితరులు పాల్గొన్నారు.