సోమశిల, న్యూస్‌లైన్: జిల్లాలోని రైతులు పంటలు పండించుకునేందుకు శ్రీశైలం జలాశయం నుంచి వస్తున్న కృష్ణానది నీళ్లే దిక్కవుతున్నాయి. పెన్నానది పరివాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోతుండటంతో నదికి వరద ప్రవాహం లేకుండా పోయిం ది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా వస్తున్న కృష్ణానది జలాలతోనే జలాశయంలోని నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ఈ జలాలతో జలాశయం పూర్తిగా నిండే పరిస్థితి లేకపోవడంతో పంటలు ఎలా పండించుకోవాలని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఐఏబీ సమావేశం నిర్వహణ అనుమానంగా మారింది.
ఆయకట్టు పరిధిలో తొలికారు సాగుకు సుమారు 50 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం జలాశయంలో 43 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో డెడ్‌స్టోరేజీ కింద 7 టీఎంసీలు, చెన్నైకు తాగునీటి అవసరాలకు తరలించేందుకు 10 టీ ఎంసీలు కేటాయించాలి. మరోవైపు అక్టోబర్ మొదలైనా పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా పరిమిత ఆయకట్టుకే సాగునీరు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. నీటి విడుదలకు సంబంధించి నిర్వహించాల్సిన ఐఏబీ సమావేశం ప్రక్రియ సైతం డోలాయమానంలో పడింది.
ఈ సమావేశంలో ప్రధాన భూమిక పోషించే మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పితాని సత్యనారాయణ హాజరుపై అనుమానాలు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో వీరు జిల్లాకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో రైతుల సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు. 2010-11లో తొలికారులో భాగంగా 4.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన అధికారులు గత ఏడాది 3 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు.
రెండు పంటకు చుక్కనీరు కూడా విడుదల చేయలేదు. కండలేరు జలాశయంలోని ఆయకట్టు పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం జలాశయంలో 16 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో అధిక శాతం చెన్నైకి తరలించాలి. గత ఏడాది కూడా నీటి లభ్యత లేకపోవడంతో 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, కేవలం 75 వేల ఎకరాలకే అందించారు. పెన్నానదికి వరదలు రాకపోతే ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలాలేవు.
కృష్ణా నీళ్లే దిక్కు
Published Sun, Oct 6 2013 3:55 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement