అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ‘రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఉద్యోగులు, రైతులు, కూలీలు, వ్యాపారులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్రం విడిపోతే మనగతేం అవుతుందంటూ ఎంతో మంది ఉద్వేగానికి గురై గుండెపోటుతో తనువు చాలించారు. ఈ పరిస్థితిలో రాష్టాన్ని సమైక్యంగా ఉంచడానికి ఉద్యమించాల్సింది పోయి.. కేవలం రాజకీయ స్వార్థంతో రాయల తెలంగానం చేయడం ఎంత వరకు సమంజసమ’ంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు పైలా నరసింహయ్య ధ్వజమెత్తారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఓ సీనియర్ రాజకీయ వేత్తగా సరైన మార్గం అనుసరిస్తున్నారో.. లేదో.. ఆయనే అర్థం చేసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలో జేసీ పావుగా మారారని పైలా ఆరోపించారు. తెలంగాణ సీఎల్‌పీ సమావేశానికి పిలవకుండానే వెళ్లి, అక్కడ రాయల తెలంగాణ వాదాన్ని వినిపించడమేమిటని నిలదీశారు. తనది గద్వాల్ ప్రాంతమని, తన పూర్వీకులు తాడిపత్రి ప్రాంతానికి వలస వచ్చారని అక్కడ మాట్లాడడం.. మీ అవకాశవాద రాజకీయానికి నిదర్శనమన్నారు. రాజకీయ కురు వృద్ధుడైన జేసీ రాయలసీమ అస్థిత్వాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను రెండుగా చీల్చి తెలంగాణ లో కలుపుతామనడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు.
‘కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లాలకు ప్రాణం కేసీ కెనాల్. సీమను చీల్చడం వల్ల ఈ రెండు ప్రాంతాల రైతుల మధ్య అంతర్రాష్ట్ర నీటి వివాదాలు, యుద్ధాలు తలెత్తుతాయి. రూ.600 కోట్లు వెచ్చించిన జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం, చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లు, యాడికి కాలువ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. మీ కుటుంబానికి అత్యున్నత రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా ప్రజల రుణం ఈ విధంగా తీర్చుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు కడుపులు మాడ్చుకుని రోడ్లపైకొచ్చి సమ్మెలు చేస్తుంటే, మీ బస్సులను హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నగరాలకు ఎక్కువ ట్రిప్పులు పెంచి.. ప్రజల నుంచి అత్యధికంగా చార్జీలు వసూలు చేస్తోంది నిజం కాదా.. అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోబియాతో.. రాయల తెలంగాణ జపం పఠిస్తున్నారన్నది బహిరంగ రహస్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో విజయ ఢంకా మోగిస్తుందని, తాడిపత్రిలో తమ పార్టీ చేతిలో ఓటమి ఖాయమనే నిర్ధారణకు వచ్చిన మీరు రాయల తెలంగాణ మంత్రాన్ని జపిస్తున్నారని జేసీపై ధ్వజమెత్తారు. వేలాది మంది సమైక్యాంధ్ర ఉద్యోగులతో చేపట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతమైన తర్వాత కూడా.. రాయల తెలంగాణ ప్రస్తావన తేవడం లక్షలాది మంది సీమాంధ్ర ఉద్యోగుల మనోభావాలను అవమానపర్చడమేనని అన్నారు.
మీ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వందలాది బస్సులు నిరాటంకంగా హైదారాబాద్‌కు తిరగడం కోసం మీరు వేర్పాటు వాదాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు ఆత్మను క్షోభ పెట్టవద్దని ఆయన బహిరంగ లేఖలో జేసీని కోరారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్ పీరా, నాయకులు మీసాల రంగన్న, జేఎం బాషా, తాడిపత్రి టౌన్ కన్వీనర్ సలాం, తదితరులు పాల్గొన్నారు.
జేసీ.. పచ్చి అవకాశవాది
Published Fri, Sep 13 2013 3:37 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement