ఉద్యమ వ్యవసాయం చేయండి | Please Agriculture Movement | Sakshi
Sakshi News home page

ఉద్యమ వ్యవసాయం చేయండి

Published Wed, Oct 16 2013 2:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM

Please Agriculture Movement

 ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: రైతులు పంటలసాగుకు తాత్కాలికంగా విరామం ప్రకటించి సమైక్యాంధ్ర ఉద్యమ వ్యవసాయం చేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం రైతు సదస్సు నిర్వహించారు. రైతులు ఉద్యమపగ్గాలు చేతపట్టాలని, అప్పుడే సమైక్యాంధ్ర అనే ఫలసాయం అందుతుందని ప్రసాదరెడ్డి అన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా లేని నేతలను చెర్నకోలతో అదిలించి, కదిలించాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు మిగులుజలాల ఆధారంగానే గాలేరు నగరి, తెలుగుగంగ లాంటి ప్రాజెక్టులు ఆధారపడ్డాయన్నారు. కర్నాటక నుంచి నదీ జలాలు రానందువల్లే అనంతపురం జిల్లా కరువు కాటకాలకు నిలయమైందని, తుంగభద్ర జలాలు నిబంధనల ప్రకారం వచ్చి ఉంటే వారి పరిస్థితి మెరుగ్గా ఉండేదన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ వాస్తవానికి విభజన వలన మిగతా వారికంటే పూర్తిగా నష్టపోయేది రైతులేనని తెలిపారు. కృష్ణా నదీజలాలపై అల్మట్టి, నారాయణ కేడ్, జూరాల ప్రాజెక్టులు నిర్మించారని, తెలంగాణ విభజన జరిగి కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే మనకు సాగునీరు కరువు అవుతుందన్నారు.
 
 బాబ్లి ప్రాజెక్టు నిర్మాణం వల్ల మనకు నష్టం జరిగిందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి మిడ్‌పెన్నార్ ద్వారా కర్నాటక బార్డర్ వరకు తాగునీటిని తీసుకెళ్లడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టర్ మల్లేల లక్ష్మిప్రసన్న మాట్లాడుతూ ఉద్యమానికి ప్రతి ఇంటి నుంచి రైతులు తరలి రావాలని కోరారు. ఎన్జీఓ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఎవరూ అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదన్నారు.  ఏ క్షణంలోనైనా ఉద్యోగులు మెరుపు సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఉద్యమంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం కావాలని కోరారు.
 
 తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం విభజన జరిగితే జూరాల ప్రాజెక్టు ఎత్తు పెంచినా, శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ సరఫరాకు ముందుగా నీటిని విడుదల చేసినా మనకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. విద్యుత్ జేఏసీ నాయకుడు జయరాజ్, ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు రషీద్‌ఖాన్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకరాపురం ప్రసాదరెడ్డి, వల్లూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, మండల వ్యవసాయాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement