మాస్కో: సాధారణంగా మనం.. ఒక్కోసారి.. అనుకోని సంఘటనలు.. విపత్కర పరిస్థితులు చూస్తుంటాం. ఈ క్రమంలో, కొంత మంది స్పందిస్తే.. మరికొంత మంది మనకెందుకులే అనుకుని పట్టించుకోరు. ఇది మా పనికాదనో.. మాకేందుకు రిస్క్‌లే అనుకుని కనీసం ప్రయత్నం కూడా చేయరు. మరికొంత మంది మాత్రం.. తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి సాటివారిని కాపాడుతుంటారు. రష్యాలో ఇటీవల జరిగిన సంఘటన కూడా ఈ కోవకు చెందినదే.
ఒక అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కొంత మంది పిల్లలు దాంట్లో చిక్కుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన కొంతమంది వెంటనే స్పందించి ఆ పిల్లలను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేవరకు వేచి చూడకుండా వారు తక్షణం స్పందించడంతో పిల్లలంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సాహసీకులు పిల్లలను కాపాడిన తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
వివరాలు.. రష్యాలోని కోస్ట్రోమా నగరంలో ఉన్న మూడంతస్తుల అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో మంటలు అపార్ట్‌మెంట్ చుట్టు వ్యాపించాయి. ప్రమాదం జరిగినప్పుడు అపార్ట్‌మెంట్‌లోని ఒక ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలు మాత్రమే ఉన్నారని తెలిసింది. దీంతో, ఇంటి పక్కన ఉన్న కొంత మంది యువకులు, ఆ పిల్లలను ఎలాగైన కాపాడాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో, ఆ ఇంటి ప్రవేశ ద్వారాన్ని పగుల గొట్టాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం సఫలం కాలేదు. మంటలు మాత్రం, వేగంగా వ్యాపిస్తున్నాయి.
ఆ పిల్లలు ఇంట్లోని ఒక కిటికీ దగ్గరకు వచ్చి కాపాడాలని అరుస్తున్నారు. దీంతో వారికొక ఐడియా వచ్చింది. వెంటనే వారు అపార్ట్‌మెంట్‌కు ఆనుకొని ఉన్న ఒక పైపును పట్టుకొని, పిల్లలు చిక్కుకొని ఉన్న ఇంటి కిటికీ దగ్గరకు చేరుకున్నారు. వారంతా, ఒకరి తర్వాత మరోకరు చైన్ మాదిరిగా నిలబడ్డారు. ఈ క్రమంలో మొదటి వ్యక్తి, కిటికీ దగ్గర ఉన్న పిల్లలను చేరుకున్నారు. ఆ తర్వాత, వెంటనే కిటికీ నుంచి ఒకరి తర్వాత..మరొకరుగా.. ముగ్గురు పిల్లలను నెమ్మదిగా కిందకు దించారు. ఈ క్రమంలో, ముగ్గురు పిల్లలు క్షేమంగా కిందకు చేరడంతో అక్కడి వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు.
ఆ తర్వాత అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే, ముగ్గురు పిల్లల ప్రాణాలను కాపాడిన వారిని అక్కడి అధికారులు సాహాస పురస్కారానికి నామినెట్ చేసినట్టుగా తెలిసింది. కాగా, ఆ ఇంట్లో ఉంటున్న సదరు, మహిళకు నలుగురు సంతానం. అగ్నిప్రమాదం జరగటానికి ముందు తన భర్తను ఇంట్లో ఉంచి, ఆమె ఏదో పనిమీద నాలుగో బిడ్డను తీసుకొని బయటకు వెళ్లింది. కాగా, ఆమె భర్త కూడా పిల్లలు పడుకున్నారని బయట తాళం వేసుకొని మరో పనిమీద బయటకు వెళ్లినట్టు తెలిసింది.
అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్..’, ‘ ముగ్గురి నిండు ప్రాణాలు కాపాడారు..’, ‘ ఇప్పటికీ మానవత్వం బతికే ఉందని ఇలాంటప్పుడే అనిపిస్తోంది..’, ‘ ఐకమత్యంగా ఉంటే గొప్ప పనులు సాధించొచ్చు.. అని మరోసారి రుజువైంది..’ ‘ నిజమైనా హీరోలు మీరే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment