ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 270కిపైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మూడు రైళ్లు ఢీకొన్న నేపధ్యంలో కొన్ని సెకెన్ల వ్యవధిలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంటనే తేరుకున్న కొందరు ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటపడ్డారు. ఇదేరీతిలో ఒక మహిళ ఎంతో ధైర్యంతో తన ముగ్గురు పిల్లలను కాపాడుకుంది.
రైళ్లు ఢీకొన్న సమయంలో చాలా బోగీలు చెల్లాచెదురైపోయాయి. ఇదేవిధంగా పక్కకు ఒరిగిపోతున్న బోగీలో ఉన్న ఒక మాతృమూర్తి ఎంతో ధైర్యం, సమయస్ఫూర్తితో తన పిల్లల ప్రాణాలను రక్షించింది. రైళ్లు ఢీకొన్న సమయంలో ప్రయాణికుల అరుపులు, కేకలు విన్న సీతాదాస్ అనే 45 ఏళ్ల మహిళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఇద్దరు కుమార్తెలను ఒక కుమారుడిని బోగీలోని కిటికీలో నుంచి బయటకు విసిరివేసింది. ఆ రైలు పట్టాలకు ఒకవైపు పంట పొలాలు ఉన్నాయి.
ఆ చిన్నారులను ఆమె ఆ పంటపొలాలలోకి విసిరివేసింది. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రమాదం జరిగిన సమయంలో ఇక తన ప్రాణాలు పోవడం ఖాయమని అనిపించిందని, అందుకే పిల్లలను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నానన్నారు. వెంటనే పిల్లలను కిటికీలో నుంచి బయటకు తోసివేశానని’ తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో సీతతో పాటు ఆమె భర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. విపత్కర సమయంలో అంత్యంత తెలివితేటలతో పిల్లలను కాపాడుకున్న ఆమెను అందరూ అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment