మద్యం సేవించే అధికారికంటే రిక్షా తొక్కేవాడిని, కూలీలను పెళ్లిచేసుకోవడం సముచితమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు తమ కుమార్తెలు, సోదరీమణులకు మద్యపానం చేసేవారితో అస్సలు వివాహం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యపానం డి అడిక్షన్‌పై జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ...తాను ఎంపీగా తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయినప్పుడూ..సామాన్య ప్రజలను ఎలా కాపాడగలనంటూ భావోద్వేగానికి గురయ్యారు. "తన కొడుకు ఆకాష్ తన స్నేహితులతో మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. మానిపించేందుకు డీ అడిక్షన్ సెంటర్‌లో చేర్పించాం. ఆ అలవాటు మానుకుంటాడని పెళ్లి కూడా చేశాను కానీ అతను పెళ్లైన తర్వాత కూడా తాగడం ప్రారంభించాడు. క్రమంగా అది అతని మరణానికి దారితీసింది. దీంతో అతడి భార్య వితంతువుగా మారింది. పైగా వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు." అని ఆవేదనగా చెప్పుకొచ్చారు.
అందువల్ల దయచేసి మీరు మీ కుమార్తెలను, సోదరీమణులను ఇలాంటి వ్యసనపరులకు కట్టబెట్టకుండా రక్షించండి. ఈ తాగుడు వ్యసనం కారణంగా ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎంపీ కూడా 80 శాతం క్యాన్సర్ మరణాలకు కేవలం పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనమే కారణమని అన్నారు. ఈ డీ అడిక్షన్ కార్యక్రమంలో ప్రజలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని కుటుంబాలను రక్షించుకోవాలని ఆయన కోరారు. అలాగే జిల్లాను వ్యసన రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్‌ను అన్ని పాఠశాలలకు తీసుకువెళ్లాలని, పైగా ఉదయం ప్రార్థన సమయంలో పిల్లలకు దీని గురించి చెప్పాలని కేంద్ర మంత్రి కౌశల్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment