వ్యసనాల బారిన పడిన వ్యక్తిని ఆ కుటుంబంలోని వారు మొదట్లో గుర్తించరు. తమ వాళ్లు మంచివాళ్లని, చెడు అలవాట్లకు బానిసలు కారని నమ్ముతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్నేహితుల ప్రభావమో, మరొకటో అనుకుంటారు తప్ప సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్యను ఫ్యామిలీ డినైల్ అంటున్నారు నిపుణులు. అడిక్షన్స్ గురించి అసలు మన కుటుంబాలు ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నాయి..? ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నాయి? ఈ అంశం పై ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’
► అపార్ట్‌మెంట్‌లో దాదాపు అన్ని ఫ్లాట్స్ ఒకేలా ఉంటాయి. ఒకబ్బాయి రాత్రి టైమ్‌లో బాగా తాగేసి తమ ఇల్లు అనుకొని, వేరేవాళ్ల ఇంటి బెడ్‌రూమ్‌కి వెళ్లి పడుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్లు పెద్ద గొడవ చేశారు. ఆ అబ్బాయి వాళ్ల తల్లితండ్రులు తమ పిల్లవాడిని తిట్టకుండా ఏదో పొరపాటున జరిగి ఉంటుందంటూ ఆ కుటుంబంతో గొడవ పడ్డారు.
► ఫ్యామిలీ ఫంక్షన్‌కి భర్త రాలేదు. ‘ఏమైంది..’అని ఎవరైనా అడిగితే ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఆ సదరు వ్యక్తి ఇంట్లో ఉండి తాగుతుంటాడు.
► మల్టిపుల్ అడిక్షన్స్‌కు అలవాటుపడిన ఓ అబ్బాయి వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటానంటే, తల్లి ఒప్పుకోలేదు. ‘నీకేమైంది, బాగానే ఉన్నావ్ కదా! పై చదువుల కోసం అమెరికా వెళుతున్నావ్. బాధ్యత తెలిస్తే సెట్ అవుతావులే’ అంటుంది.
► ఒక భార్య ‘మా ఆయన తాగినప్పుడు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు. మిగతా సమయాల్లో చాలా చాలా బాగుంటాడు’ అని సరిపెట్టుకుంటుంది.
► ‘మా వాడు చాలా మంచోడు సార్, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మొన్ననే తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యింది’ అంటాడు తండ్రి.
► కజిన్స్ రిలేటివ్ ఫంక్షన్‌లో ఒకబ్బాయి ఓవర్‌గా తాగాడు. మనవాడు కదా అని మరుసటి రోజు తల్లికి ఫోన్ చేసి ‘అక్కా, మీ అబ్బాయి పార్టీలో ఓవర్‌గా తాగాడు’ అని చెబితే ‘మా అబ్బాయి అలాంటోడు కాదు, ఫ్రెండ్స్, కజిన్స్ బలవంతం చేసుంటారు’ అని వెనకేసుకొచ్చింది. విషయం చెప్పిన వ్యక్తితో మాట్లాడటమే మానేసింది. బంధుమిత్రులు ఎవరైనా ‘మీ అబ్బాయి తాగుతుండగా ఫలానా చోట చూశాం’ అని చెబితే వాళ్లతోనూ మాట్లాడటం మానేసింది. ఒకసారి కాలేజీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. తల్లిదండ్రులని పిలిస్తే ‘మా అబ్బాయిని కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. మీదే అసలు సమస్య అనేసింది.’ ఇలాంటి సమర్థింపులు ఎన్నో .. ఎన్నెన్నో మీకూ తెలిసే ఉంటాయి.
వెరీ డేంజర్!!
చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు వ్యసనాల బారినపడ్డారనే విషయం తెలిసినా వారు ఒప్పుకోరు. వ్యసనపరులకు కుటుంబాల నుంచి ఇలాంటి రక్షణ దొరికితే ఎప్పటికీ మార్పు రాదు సరికదా సర్దుకుపోవడం, కొట్టిపారేయడం చేస్తుంటే మీ కుటుంబం బీటలు వారడానికి సిద్ధంగా ఉందని గ్రహించాల్సిందే! అడిక్షన్ వెరీ వెరీ డేంజర్ డిసీజ్. ఈ సందర్భంలో కుటుంబంలో ఎవరిలోనైనా అడిక్షన్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించడం మేలు.
ధైర్యమే ఆయుధం
వ్యసనాల బారిన పడ్డవారు నమ్మబలికే మాటలు చెబుతారు. సంఘటన తర్వాత ‘సారీ..’ అనేస్తారు. చిన్న చిన్న కానుకలు ఇచ్చి, తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేవారుంటారు. దీంతో అమ్మ/భార్య/అక్క/ మన వాళ్లే కదా, మన పిల్లలే కదా.. మరోసారి ఇలా చేయరులే అనుకుంటారు. ఇదే విధమైన ప్రవర్తన కొన్నాళ్లకు ముదిరి ఇంట్లో భయోత్పాతాలను సృష్టిస్తుంటారు.
కుటుంబం ప్రవర్తన మారాల్సిందే!
కొడుకు/కూతురు/హజ్బెండ్/ఫాదర్ కి అడిక్షన్ పట్ల సపోర్ట్ ఇవ్వకూడదు. ఇంట్లో డబ్బులివ్వకపోతే బయట అప్పులు చేస్తారు. పదివేలు, ఇరవైవేలు అప్పు చేసినప్పుడు ఎవరైనా ఇంటి మీదకు వస్తే కుటుంబంలో ఉన్నవారిని బెదిరియ్యకుండా ఆ అప్పు తీర్చేస్తారు. సదరు వ్యక్తికి ఇబ్బంది కలగనీయకుండా అడ్డుగా నిలబడతారు. ఆ సమస్యను ఫేస్ చేయనీయకుండా వెనకేసుకొస్తారు. కాలేజీలో సమస్య వచ్చినా, మరోచోట సమస్య వచ్చినా తల్లిదండ్రులు కొడుకును కాపాడటానికి ట్రై చేస్తారు. దీనివల్ల పిల్లవాడు మరిన్ని తప్పులు చేసేలా ఆ కుటుంబంలోని వారు ప్రోత్సహిస్తున్నట్లే.
మందలించాల్సిందే!
ముందు తప్పించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం నుంచి కుటుంబాల్లో ఉన్నవారు బయటకు రావాలి. కౌన్సెలింగ్ సమయంలో ముఖ్యంగా ఆడవాళ్లకు బలంగా ఉండాలని చెబుతాం. గట్టిగా మందలించమని చెబుతాం. ‘ఇది మా వ్యక్తిత్వం కాదు కదా’ అంటారు. కానీ, మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అని గుర్తించరు. సమస్యను భరిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మిమ్మల్ని వ్యసనపరులు నిస్సహాయ స్థితికి తీసుకెళతారు. కుటుంబం బలంగా ఉండాలంటే మేజర్ రోల్ భార్య/తల్లిదే.
ఆమె గట్టిగా ఉండాల్సిందే. కుటుంబం బాగుండాలంటే మంచిగవ్వాల్సిందే! అని చెప్పాలి. ఒకతను ఆల్కహాల్/ డ్రగ్స్ వాడుతున్నాడంటే అతని మైండ్ నిలకడగా లేదని అర్ధం చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషుల సాయంతోనైనా సమస్యను చక్కదిద్దాలి. ‘థెరపీ అవసరం లేదు, సదరువ్యక్తికి తెలియకుండా మందులు ఇప్పిద్దాం’ అనుకుంటారు. కానీ, యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ వాడటం వల్ల బ్రెయిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు.
అవగాహన, బిహేవియరల్ థెరపీ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుంది. ముందుగా కుటుంబాల వాళ్లు... 1. ఇదొక వ్యసనం అని అంగీకరించాలి. 2. పూర్తి చికిత్స ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 3. చికిత్సకు కావాల్సినంత టైమ్ ఇవ్వాలి. నలుగురిలో తెలిస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్‌కు ఎలా వెళతామో సైకలాజికల్ సమస్య వస్తే అందుకు సంబంధించిన డాక్టర్‌ని కలవడానికి ఇబ్బంది పడకూడదు.
– డాక్టర్ గిడియన్,
డి–అడిక్షన్ థెరపిస్ట్
Comments
Please login to add a commentAdd a comment