ఓ రిస్ట్బ్యాండ్ మీ జీవితాన్ని కాపాడుతుంది!
లండన్: జేమ్స్బాండ్ సినిమాలోని హీరో క్యారెక్టర్ సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన పరికరాలతో ప్రత్యర్థులను బురిడీ కొట్టిస్తాడు కదా!. సరిగ్గా అలాంటి పరికరమే ఒకటి రూపొందించబడింది. కాకపోతే అది ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కాదు.. ఎవరికి వారు క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను కాపాడుకోవటానికి. సరికొత్త రిస్ట్బ్యాండ్ ఆవిష్కరణ ఇప్పుడు జేమ్స్బాండ్ చిత్రంలోని టెక్నాలజీని గుర్తుచేస్తోంది.
కింగ్లీ అనే రిస్ట్బ్యాండ్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. అన్ని రిస్ట్బ్యాండ్లలా ఇది కేవలం అలంకరణకే కాకుండా ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోతే ఇది కాపాడుతోంది. నీటిలో మునిగినప్పుడు దీనికి గల మీట నొక్కితే చాలు దీనిలో అదృశ్యంగా ఉన్న బెలూన్ ఓపెన్ అయిపోతుంది. అలా నీటిలో మునిగిన వారు పైకి తేలడానికి ఇది తోడ్పడటమే కాకుండా.. వారికి సంబంధించిన వ్యక్తులను సైతం ఇది అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతం దీని మార్కెట్ ధర సుమారు రూ. 7 వేల వరకూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఏటా నీటిలో మునిగిపోవటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ రిస్ట్బ్యాండ్ ఉపయుక్తంగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.