rtc driver save pasingers
- ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి
బూర్గంపాడు: కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బూర్గంపాడు వద్దకు చేరుకునే సరికి డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురై..నీరసంతో స్పృహ కోల్పోబోతున్నా..బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి..ప్రయాణికులను రక్షించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బస్సులోని ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం 10:30 గంటలకు కొత్తగూడెం నుంచి బస్సు బయల్దేరగా..40 నిమిషాల తర్వాత డ్రైవర్ మల్సూర్ అస్వస్థతకు గురై..చొక్కా తడిచేలా చెమట పట్టి.. నీరసంగా మారాడు. శరీరం తూలిపడుతున్న విషయాన్ని కండక్టర్ గమనించి ఏమైందని ప్రశ్నిస్తున్నా..ఓపికగా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. 11:30 గంటలకు బూర్గంపాడు వద్దకు చేరుకునే సరికి ఓపికంతా నశించి బస్సును రోడ్డు పక్కన ఆపేసి స్టీరింగ్‌పై వాలిపోయాడు. ప్రయాణికులు, స్థానిక యువకులు అతడిని కిందకు దింపి..బైక్‌పై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బీపీ, షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోవటంతో ఒళ్లంతా చెమటలు పోసి స్పృహ కోల్పోయే స్థితికి చేరాడని తెలిపారు. ఈ స్థితిలోనూ క్షేమంగా డ్రైవింగ్ చేసిన అతడిని అంతా అభినందించారు. ప్రథమ చికిత్స అనంతరం భద్రాచలం తరలించారు. బస్సులోని ప్రయాణికులను కండక్టర్ వేరే బస్సులో ఎక్కించి పంపించారు.