చట్టాలతో ముస్లిం మహిళలకు రక్షణ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి
గుంటూరు ఈస్ట్: గృహ హింసకు గురయ్యే ముస్లిం మహిళలకు చట్టాలు పటిష్టవంతంగా రక్షణ కల్పిస్తున్నాయని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. మహిళలు వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పొన్నూరు రోడ్డులోని లాల్ జాన్ బాషా కల్యాణ మండపంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం మహిళా చట్టాలు– హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల హక్కుల రక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు తూర్పు ఎమ్యెల్యే ముస్తఫా మాట్లాడుతూ గృహ హింసకు గురయిన మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులు తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలను సమాజంలోని అందదూ ఖండించాలని కోరారు. అనంతరం మొదటి స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.జె.సుధా, జిల్లా జువైనల్ కోర్టు ప్రధానన్యాయమూర్తి కె.ప్రత్యూష కుమారి, ఏఎస్పీ భాస్కర్‌రావు మాట్లాడారు. సదస్సులో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ ఖాజా వలీ, గౌరవాధ్యక్షుడు ఎస్.ఎం.గౌస్ మోహిద్దీన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ సయ్యద్‌రసూల్, ముస్లింలు పాల్గొన్నారు.