
‘ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’లో లొసుగులు
జూనియర్ టీచర్లకు నష్టం జరిగేలా నిబంధనలు..
9 నెలలు పూర్తయితేనే విద్యా సంవత్సరంగా పరిగణన
స్టడీ లీవ్‌లో ఉన్న టీచర్ల స్థానాలు ఖాళీగా ప్రకటన
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల కోసం తీసుకురానున్న కొత్త చట్టం వారికి మరిన్ని కష్టాలకు కారణం కానుంది. గతానికి భిన్నంగా విద్యా సంవత్సరం లెక్కింపును చూపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త చట్టంపై ప్రణాళిక సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ శనివారం విడుదల చేసిన ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’ ప్రకారం ఇకమీదట ఏటా బదిలీలు చేపడతామని ప్రకటించింది.
జూన్ 1 నుంచి మే 31 వరకు విద్యా సంవత్సరంగా పేర్కొని, దాని ఆధారంగానే బదిలీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు 9 నెలలు మించిన కాలాన్ని పూర్తి విద్యా సంవత్సరంగా గణిస్తామని తెలిపింది. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు ఒక పాఠశాలలో గరిష్ఠంగా 5 విద్యా సంవత్సరాలు, ఇతర ఉపాధ్యాయులు 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకుంటే బదిలీలకు అనుమతిస్తారు.
బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ఠంగా రెండు విద్యా సంవత్సరాలు పూర్తవాలనే నిబంధన విధించారు.ప్రస్తుత ఖాళీలు, భవిష్యత్ ఖాళీలు, కంపల్సరీ బదిలీల ఖాళీలు, స్టడీ లీవ్ ఖాళీలు, ముందస్తు అనుమతుల్లేకుండా ఏడాదికి పైగా గైర్హాజరు ఖాళీలు, రేషనలైజేషన్ వల్ల ఏర్పడే ఖాళీలు.. వీటిని బదిలీల్లో వేర్వేరుగా చూపి, ఏటా మే 31 నాటికి లెక్కించి ఖాళీల బ్లాకింగ్ విధానాన్ని అమలు చేస్తారు. అయితే పాయింట్ల కేటాయింపులో కొందరికి అన్యాయం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టం
రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025ను శనివారం విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచిన ముసాయిదాపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ విజయ్ రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు.
హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఛిట్ఛ.్చp.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో ఉంచిన ప్రొఫార్మాను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నింపి 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఛీట్చజ్ట.్చp్ట్ట్చ 2025ఃజఝ్చజీ . ఛిౌఝకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయ అవార్డు పాయింట్లు ఎత్తివేత
ముసాయిదా లోపభూయిష్టంగా ఉన్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో బదిలీలకు విద్యా సంవత్సరంలో ఆరు నెలలు పూర్తి చేసుకుంటే పూర్తి కాలంగా పరిగణించగా, ముసాయిదాలో దాన్ని 9 నెలలకు పెంచడం ద్వారా చాలామంది నష్టపోయే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటిదాకా జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులకు ప్రత్యేక గౌరవంగా బదిలీల్లో 5 స్పెషల్ పాయింట్లు కేటాయిస్తుండగా, ముసాయిదా చట్టంలో వాటిని తొలగించారు. స్టడీ లీవ్ పై వెళ్లే ఉపాధ్యాయులు పనిచేసే ప్రాంతాలను ఖాళీగా చూపడం వల్ల వారు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఖాళీలన్నింటినీ బదిలీల్లో కోరుకునేందుకు వీల్లేకుండా బ్లాకింగ్ విధానాన్ని అమలు చేయడం అన్యాయమంటున్నారు.
» ప్రభుత్వం (జీవో ద్వారా) ద్వారా బదిలీ పొందినవారికి పాత, కొత్త ప్రాంతాల సర్వీసును దీర్ఘకాలిక సర్వీస్‌గా పరిగణించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన కొత్త విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే బదిలీలకు వర్తిస్తుందా! లేక పాతవారికీ వర్తిస్తుందా? అన్నది ముసాయిదాలో చెప్పకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
» దీర్ఘకాలం ఒకే పాఠశాలలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలి. కానీ ఎన్‌సీసీ టీచర్లకు ఈ నిబంధన వర్తించే అవకాశం లేదు. ఎన్‌సీసీ ఉపాధ్యాయులు అదే యూనిట్ ప్రాంతాలకే బదిలీ కోరుకోవాలి. ఆ ప్రాంతాలు లేకపోతే ఆ టీచర్లకు దీర్ఘకాలిక సర్వీస్ ఉన్నా అదే పాఠశాలలో కొనసాగిస్తారని ముసాయిదాలో పేర్కొన్నారు. దీంతో సాధారణ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.
» హెచ్‌ఆర్‌ఏ ఆధారంగా పాఠశాలలను నాలుగు విభాగాలుగా విభజించారు. హెచ్‌ఆర్‌ఏ 16 శాతం ఉంటే కేటగిరీ–1, 12 శాతం ఉంటే కేటగిరీ–2, 10 శాతం ఉంటే కేటగిరీ–3గా పేర్కొన్నారు. 10 శాతం హెచ్‌ఆర్‌ఏతో పాటు రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాల్లోని స్కూళ్లను కేటగిరీ–4గా చూపారు.
వీటికి వరుసగా ఏటా పాఠశాల స సర్వీస్ కు 1, 2, 3, 5 పాయింట్లు చొప్పున బదిలీ సీనియార్టీకి కలుపుతారు. పదోన్నతుల్లో మొదట ఉపాధ్యాయులు కేటగిరీ–3, 4లో ఖాళీలనే ఎంచుకోవాలి, వాటిల్లో ఖాళీలు లేకుంటేనే కేటగిరి–1, 2 ప్రాంతాలకు అవకాశం కల్పించేలా నిబంధన విధించారు. దీనివల్ల సీనియర్లకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.
» గతంలో ఒక విద్యా సంవత్సరానికి అర పాయింట్ ఇవ్వగా ఇప్పుడు దాన్ని పాయింట్‌కు పెంచారు. దీనివల్ల జూనియర్ టీచర్లకు అన్యాయం జరిగే ప్రమాదముంది. 2003 నుంచి డీఎస్సీ టీచర్లు నష్టపోయే అవకాశం ఉందంటున్నారు.
» ఇప్పటివరకు 80 శాతం వైకల్యం ఉన్నవారు సంఖ్యతో నిమిత్తం లేకుండా అందరికీ ప్రాధాన్యత కేటగిరీలో అవకాశం కల్పించారు. ప్రస్తుత ముసాయిదా ప్రకారం ఎస్‌జీటీలు 40 శాతం, స్కూల్ అసిస్టెంట్లు 50 శాతం మందికే ప్రాధాన్యత కేటగిరీలో అవకాశమిస్తారు. మిగిలిన వారు నష్టపోయే అవకాశం ఉంది.
» ఇప్పటిదాకా ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న స్త్రీలకు ప్రాధాన్య కేటగిరీలో ఉంచి బదిలీల్లో మొదట ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు వారికి స్పెషల్ పాయింట్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అవి ఎన్ని పాయింట్లు అనేది స్పష్టత లేదు. గతంలో వయసుతో నిమిత్తం లేకుండా అవివాహిత మహిళలకు స్పెషల్ పాయింట్లు ఇచ్చేవారు. ఇప్పుడు 40 ఏళ్లు దాటినవారికే పాయింట్లు కల్పిస్తున్నట్లు పేర్కొనడం ఆ వర్గం ఉపాధ్యాయినులను నిరాశకు గురిచేస్తోంది.
» ముసాయిదాలో ఏడాదికి ఒక్కసారే బదిలీలు ంటాయని పేర్కొన్నారు. కానీ, అభ్యర్థన/పరస్పర/అంతర్ జిల్లా/అంతర్ రాష్ట్ర బదిలీలను పరిగణనలోకి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొనడం ద్వారా ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు బదిలీలు చేస్తామని చెప్పకనే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment