సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డుల్లో ఇంధన సామర్థ్య చర్యల ద్వారా విద్యుత్‌ను, డబ్బును ఆదా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. గుంటూరు యార్డును ఆసియాలోనే అతిపెద్ద విద్యుత్ ఆదా మిర్చి వ్యాపార కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖతో భాగస్వామి అయ్యేందుకు అంగీకరించింది. రాష్ట్రంలోని మరికొన్ని కీలక మార్కెట్ యార్డుల్లో కూడా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయనుంది.
వ్యవసాయ వాణిజ్యానికి మార్కెట్ యార్డులు కీలక కేంద్రాలు. ఇక్కడ లైటింగ్, శీతలీకరణ, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ కోసం విద్యుత్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వీటిని విద్యుత్ పొదుపు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవితో ఈఈఎస్‌ఎల్ కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ సీజీఎం అనిమేష్ మిశ్రా ఆదివారం భేటీ అయ్యారు.
విద్యుత్ ఆదా చర్యలకు సంబంధించిన నివేదికను చిరంజీవికి అందజేశారు. అనంతరం ఈఈఎస్‌ఎల్ అధికారులు, మార్కెటింగ్, సహకార శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. తొలుత గుంటూరు మిర్చి యార్డులో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేస్తా మన్నారు. ఈఈఎస్‌ఎల్ ప్రతినిధులు నితిన్ భట్, సావిత్రి సింగ్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment