సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీ మరో ఉద్యమానికి వేదిక కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఎన్నో పర్యవరణ ఉద్యమాలను నిర్వహించిన చిప్కో ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమానికి సిద్ధమైంది. అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం చెపట్టిన చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే మూడు వేలకు పైగా చెట్లను నరికి వేసిందని, సరోజినీ నగర్‌లో మరో 16,500 చెట్లను తొలగించుటకు సిద్ధంగా ఉందని చిప్కో ఉద్యమకారుడు విక్రాంత్ తొంగాడ్ తెలిపారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీ వ్యాప్తంగా చిప్కో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు నిర్వహకులు ప్రకటించారు.
వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ కారణంగా వాతావరణ కాలుష్యంగా మారి ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్రం చేపట్టిన ఎన్‌బీసీసీ కంపెనీ నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చిప్కో ఉద్యమకారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 16,500 చెట్లను నరికివేతకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చిందని, దీనికి వ్యతిరేకంగా ఆదివారం సరోజినీ నగర్‌లో భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం చెట్లను కౌగిలించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నట్లు పర్యవరణ ఉద్యమకారిణి చావీ మేథి తెలిపారు. దీనిపై తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)ని కూడా ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. ఈ ఉద్యమానికి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment