ఢిల్లీ: ఏపీ కూటమి అరాచకపాలనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాకు శివసేన(యూబీటీ) పార్టీ సంఘీభావం తెలిపింది. బుధవారం మధ్యాహ్నాం వైఎస్ జగన్‌ను కలిసిన ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ తమ పార్టీ మద్దతు ప్రకటించారు. ఏపీ పరిస్థితులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని ఆయన సందర్శించారు. అనంతరం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. వైఎస్ జగన్‌కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ, ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో గత 45 రోజులుగా నరమేధం కొనసాగుతోంది. ఈ రాజకీయ కక్ష సాధింపు ఏదైతే ఉందో.. అది దేశానికే మంచిది కాదు.
.. దేశంలో కేంద్ర హోం మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ ఉంటే.. వెంటనే స్పందించాలి. ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలి. అక్కడ జరుగుతున్న దాడుల, విధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలి. దాడులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు చూసిన తర్వాత.. మేము ఒక విషయం స్పష్టం చేయదల్చాము.
రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేదు. అందుకే మేము వైఎస్ జగన్‌కు, ఆయన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. వైఎస్ జగన్ పోరాటానికి అండగా నిలబడతాం’ అని ఆయన అన్నారు.
కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి..
శివసేన(యూబీటీ) ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత అరవింద్ సావంత్ వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో జరిగిన దాడలకు సంబంధించి.. ఫొటో గ్యాలరీ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ నేను శివసేన లోక్‌సభ పక్ష నేతను. మా ఆత్మకు క్షోభ కలిగించే ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. మేము గతంలో చంద్రబాబుతో కలిసి, కూటమిలో ఉన్నాము. ఎన్డీఏలో కూడా కొనసాగాం. శివసేన పార్టీలో చీలిక వచ్చినప్పుడు, చాలా మంది పార్టీని వీడారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే గట్టిగా నిలబడ్డారు. సరిగ్గా వైఎస్ జగన్ కూడా రాజకీయాల్లో అలా నిలబడ్డారు. అందుకే మేము మా పార్టీలో జగన్ గురించి మాట్లాడుకుంటాము. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, అన్నీ తట్టుకుని నిలబడ్డారు. ప్రజల మద్దతుతో సీఎం అయ్యారు.
నేను ఈరోజు ఇక్కడ కొన్ని చిత్రాలు, వీడియోలు చూశాను. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఉంటాయి. కానీ ఈ తరహాలో ప్రతీకార దాడులు, కక్ష సాధింపు సరికాదు. ఈరోజు నీవు అధికారంలో ఉండొచ్చు. రేపు దాన్ని కోల్పోవచ్చు. కానీ, ఈ విధంగా గెల్చిన తరవాత, ఓడిన పార్టీపై దాడులు చేయడం, ఆ పార్టీ నాయకులను ఎంచుకుని మరీ చంపడం, వారిపై దాడులు చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం.. ఏ మాత్రం సమర్థనీయం కాదు.
ఏపీలో సీఎం కుమారుడు ఏకంగా రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతున్నారు. విపక్షంపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు. రాజకీయాల్లో ఈ తరహా చర్యలు ఏ మాత్రం సరికాదు. ఏపీలో జరుగుతోందే.. మహారాష్ట్రలో కూడా కొనసాగుతోంది. ఈడీ దాడులు. సీబీఐ కేసులు. వేధింపులు. నీవు ఈరోజు అధికారంలోకి రావొచ్చు. రాకపోవచ్చు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజం. దేన్నైనా స్వీకరించాలి. అంతేకానీ, ఈ తరహాలో విపక్షంపై దాడులు, వేధింపులు సరికాదు. అందుకే వైఎస్ జగన్, ఆయన పార్టీకి అండగా నిలవడానికి, మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను.
.. మా ముంబైలో తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఏపీలో ఇంత జరుగుతున్నా, మీరు ఇలాగే కళ్లు మూసుకుని కూర్చుంటే, అది మరో మణిపూర్ అవుతుంది. ఇది ఏ మాత్రం సరికాదు. కాబట్టి, వెంటనే జోక్యం చేసుకొండి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడండి. ఈ పోరాటంలో మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి అండగా నిలుస్తా. పార్లమెంటులో కూడా వారితో కలిసి పని చేస్తాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment