గిరిజనులను రక్షిస్తున్నారా? భక్షిస్తున్నారా? | are we save tribes or punish | Sakshi
Sakshi News home page

గిరిజనులను రక్షిస్తున్నారా? భక్షిస్తున్నారా?

Published Sat, Oct 15 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులను రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షిస్తున్నారా? భక్షిస్తున్నారా? అని ఆయా శాఖల అధికారులను హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రశ్నించారు. శనివారం మండలంలోని కేఆర్‌ పురం ఐటీడీఏ వద్ద గిరిజన ఎల్‌టీఆర్‌ పోడు భూములు, పునరావాస ప్యాకేజీ సమస్యలపై బహిరంగ విచారణ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

బుట్టాయగూడెం : 
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులను రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షిస్తున్నారా? భక్షిస్తున్నారా? అని ఆయా శాఖల అధికారులను హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రశ్నించారు. శనివారం మండలంలోని కేఆర్‌ పురం ఐటీడీఏ వద్ద గిరిజన ఎల్‌టీఆర్‌ పోడు భూములు, పునరావాస ప్యాకేజీ సమస్యలపై బహిరంగ విచారణ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు భూసమస్యలపై గోడును రిటైర్డ్‌ జడ్జి వద్ద మొరపెట్టుకున్నారు.  20 సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటున్నామని, ఆ భూములకు సంబంధించి తమకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో పాటు తమ పేర్లు 1(బి) లో కూడా ఉన్నాయంటూ వాటికి సంబంధించిన రికార్డులను ఆయనకు చూపించారు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే తమ పేర్లు 1(బి)లో లేకుండా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారంటూ వాపోయారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ గిరిజనుల కష్టాలను వింటుంటే చెప్పలేని బాధ కలుగుతుందన్నారు. ఆదివాసీలైన గిరిజనులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన చట్టాలు ఇక్కడ అమలు కావడంలేదని స్పష్టమవుతుందన్నారు. గిరిజనులను కాపాడాల్సిన అధికారులే గిరిజనేతరులకు అండగా ఉంటూ వారి హక్కులను కాలరాస్తున్నట్టు తెలుస్తుందని చెప్పారు. చట్టాలను కాలరాసే ఏ అధికారైనా వారిపై కేసులు పెట్టవచ్చన్నారు. ఏ గిరిజన ప్రాంతంలో లేని సమస్యలు ఈ ప్రాంతంలోనే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు నీతి, నిజాయితీతో ఉంటే సమస్యలు ఏర్పడేవే కావన్నారు. వారిలా లంచాలకు ఎగబడి అక్రమాలకు పాల్పడడం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నట్టు అర్థమవుతుందన్నారు. ఇక్కడి గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై గవర్నర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు.  రెడ్డిగణపవరంలో కూడా గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కూడా గిరిజనులు తమ బాధలను చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పల్లా త్రినా«థరావు, గిరిజన సంఘం నాయకులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు ఏ.రవి, ఎ.ఫ్రాన్సిస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర నాయకులు కాకి మధు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement