ఆ చర్యతో కేంద్రానికి 21,000 కోట్ల మిగులు!
న్యూఢిల్లీ: ఎల్పీజీ సబ్సిడీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ప్రస్తుత విధానం ద్వారా గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఖజానాకు రూ. 21,000 కోట్ల మిగులుబాటు నమోదైంది. ఈ విషయాన్ని బుధవారం స్వయంగా ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు.
గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమచేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2014 నవంబర్లో దేశంలో కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పటకీ 2015 జనవరి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారా 3.34 కోట్ల నకిలీ లబ్దిదారులకు సబ్సిడీ ఫలాలను అందకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 14,672 కోట్లు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 7,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలిందని ఢిల్లీలో సబ్సిడీలపై నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 2015-16లో సేవింగ్స్ తగ్గడానికి కారణం ప్రపంచ మార్కెట్లో చమురు ధర తక్కువగా ఉంటమేనని ఆయన తెలిపారు.