⇒ కాంట్రాక్టు వ్యవహారం తేలే వరకూ అంతే
⇒ పదుల సంఖ్యలోనే
⇒ డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు
⇒ రేషనలైజేషన్ తరువాతే
⇒ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం తేలేవరకు లెక్చరర్ పోస్టులు, హేతుబద్ధీకరణ పూర్తయ్యే వరకు ఉపాధ్యాయపోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావడం కష్టమే. వచ్చేనెల నుంచి నోటిఫికేషన్లు జారీచేసి, భర్తీ చేయాలనుకుంటున్న పోస్టుల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్), పాలిటెక్నిక్ లెక్చరర్, విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశం లేదు. గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల విద్యాలయాల పరిధిలోని పాఠశాలల్లో మాత్రం దాదాపు 2 వేల వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.
హేతుబద్ధీకరణతో లంకె
విద్యాశాఖ పరిధిలో 17 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గతంలోనే విదాశాఖ లెక్కలు వేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు.. విద్యార్థులు ఉన్నచోట టీచర్లు లేరు. ఈ నేపథ్యంలో టీచర్ల హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది. అది పూర్తయితేనే ఇంకా ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు అవసరం.. ఎన్నింటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలన్న స్పష్టత రానుంది. అప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ కష్టమేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఖాళీలేవీ..?
జూనియర్ కాలేజీల్లో 3,755 జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3,164 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తుండగా, 591 ఖాళీలు ఉన్నాయి. 200 మంది పార్‌టటైం లెక్చరర్లు పనిచేస్తున్నారు. దీంతో 391 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నట్లు లెక్క. నిబంధనల ప్రకారం మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులను పదోన్నతులపైనే భర్తీ చేయాలి. అంటే మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులైన 375 ఖాళీలను డెరైక్టు రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేయడానికి వీల్లేదు. మరోవైపు పోస్టులే మంజూరుకాని కాలేజీల్లో 748 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అంటే ఇందులో మిగిలేవి పెద్దగా ఉండవు.
డిగ్రీ, పాలిటెక్నిక్ కాలే జీల్లో..
డిగ్రీ కాలేజీల్లో 450 వరకు డీఎల్ పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 900 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. అందులో సగం మంది పోస్టులు మంజూరై ఖాళీగా ఉన్న వాటిల్లో పనిచేస్తుండగా మరో సగం మంది పోస్టులు మంజూరు కాని కాలేజీల్లో పనిచేస్తున్నారు. ఇక పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీలు 350 పోస్టులు ఉంటే కాం ట్రాక్టు లెక్చరర్లు 450 మంది ఉన్నారు. అంటే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో డీఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం అసాధ్యమన్న వాదన నెలకొంది.