గంటలగుంట సమీపంలోని వాగులోని నీటిని టిన్నులో పోస్తున్న గొత్తికోయగిరిజన మహిళ
సాక్షి, ఏటూరునాగారం: గిరిజనులకు చెలిమల నీరే తాగునీరు. వేసవి కాలం కావడంతో వాగుల్లో నీరు ఎండిపోయి కాల్వలను తలపిస్తున్నాయి. దీంతో గిరిపుత్రులు దప్పిక తీర్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుత వేసవిలో ములుగు జిల్లా ఏజెన్సీ పరిధి 7 మండలాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడంలేదు. ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, గోవిందరావుపేటతోపాటు వాజేడు, వెంకటాపురం మండలాల్లోని అటవీ ప్రాంతంలో సుమారు 50 గొత్తికోయగూడేలు ఉండగా.. వాటిలో 3 వేల మంది జనాభా నివాసం ఉంటోంది.
వీరికి సరైన తాగునీటి వసతి లేక సమీపంలోని వాగులు, తోగుల నుంచి నీటిని తెచ్చుకుని తాగడానికి వినియోగిస్తున్నారు. ఎండలకు వాగుల్లో నీరు లేకపోవడంతో చెలిమలు తీసీ ఊటగా వచ్చిన నీటిని బిందెల్లో వడబోసి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి నీటిని తాగడం వల్ల ఒంటిపై దద్దుర్లు, చర్మవ్యాధులు, ఇతర జబ్బులు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
పటికబెల్లంతో నీటి శుద్ధి..
వాగులు, చెలిమల నుంచి తెచ్చిన నీరు మురికిగా ఉంటుంది. ఆ నీటిలో పటికబెల్లం వేసి రెండు గంటల పాటు ఉంచితే శుద్ధి అయి తేటగా మారిన తర్వాత తాగడానికి ఉపయోగిస్తుంటా రు. దీనికితోడు చిల్లిగిజ్జలను సైతం బిందెలో వేస్తే నీటిలో ఉన్న మలినాలు అడుగుకుపోయి తేటగా మారతాయి. నీటిని శుద్ధి చేయడానికి గిరిజనులు ఈ పద్ధతులను అవలంభిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఇది పూర్తి స్థాయి రక్షిత విధానం కాకపోవడంతో రోగాలపాలవుతున్నారు. గిరిజనులకు తాగునీటి కోసం ఐటీడీఏ నుంచి ఎలాంటి స దుపాయం ఏర్పాటు చేయడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment