జీవన గమనం
నా వయసు 40. నాకు ఒక్కతే కూతురు. వయసు పద్దెనిమిదేళ్లు. నా భర్త, నేను విడిగా ఉంటున్నాం. నా కూతురూ నేనే ఉండటం వల్ల తనమీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నాను. మొన్నీ మధ్య వరకూ తను ప్రతి విషయం నాతో చెప్పేది. ప్రతి విషయానికీ నామీదే ఆధారపడేది. కానీ ఇప్పుడు తను స్వతంత్రంగా ప్రవర్తిస్తోంది. అది నేను భరించలేకపోతున్నాను. ఏం చేయాలి?
- ప్రతిభ, వెంట్రప్రగడ
మీ అమ్మాయి తన పనులు తాను చేసుకుంటోంది... అంతే కదా! అలా కాకుండా ప్రతి విషయానికీ మీమీదే ఆధారపడి ఉంటే, ‘పద్దెనిమిదేళ్లు దాటినా నా కూతురు ప్రతి చిన్నదానికీ నామీదే ఆధారపడుతోంది, ఏం చేయాలి’ అంటూ ఇదే శీర్షికకి మీరు ఉత్తరం రాసి ఉండేవారు. చెప్పాలంటే చాలామంది సింగిల్ పేరెంట్స్‌కి వచ్చే సమస్య ఇది. తమ పిల్లలు ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా తమ మీదే ఆధారపడాలని కోరుకుంటారు. నిజానికి యుక్త వయసు వచ్చిన పిల్లలు, తల్లిదండ్రుల పరిధి నుంచి దూరంగా వెళ్లడం ఎంతో సర్వ సాధారణమైన విషయం.
కాబట్టి మారాల్సింది మీరే. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపయినా మీ అమ్మాయి మిమ్మల్ని విడిచి వెళ్లిపోవలసిందే కదా! మొదట్లో కొంత శూన్యత ఉంటుంది. తర్వాత అలవాటు అవుతుంది. అందుకే మీరు ఇప్పట్నుంచీ ఏదైనా మంచి అభిరుచిని పెంచుకోండి. బంధంలో ఇరుక్కోకుండా మనల్ని ‘మంచి అభిరుచి’ కాపాడుతుంది. అలాగే మీకు నచ్చిన మతగ్రంథం చదవండి. పాజిటివ్‌గా ఆలోచించి ప్రశాంతంగా ఉండండి.
నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమించింది. మేము ప్రేమించుకోవడం మొదలుపెట్టి ఒక సంవత్సరం అయ్యింది. కానీ అప్పుడే నాకు తనమీద నిరాసక్తత వచ్చేసింది. కొత్తదనం లేనట్లు అనిపిస్తోంది. పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇలా ఒకే వ్యక్తితో ఉండాలా అని ఓ రకమైన కాంప్లెక్స్‌కి లోనవుతున్నాను. నిజానికి నేను ఉద్యోగం కూడా ఎక్కడా సంవత్సరానికి మించి చేయను. ప్రతిసారీ కొత్తదనాన్ని కోరుకుంటాను. ఈ కాంప్లెక్స్ నుంచి బయటపడే మార్గం చెప్పండి.
- రఘువర, రాజమండ్రి
ప్రతిసారీ కొత్తదనాన్ని కోరుకుంటాను అని రాశారు. అంటే భోజనం, దుస్తులు... అన్నీ సంవత్సరం అయ్యేసరికి మారుస్తున్నారా? లేక ఉద్యోగాన్ని, ప్రియురాలిని మాత్రమేనా? ఎంత కొత్తదనాన్ని ఆశించేవాడైనా సంవత్సరానికో పెళ్లి చేసుకోడు కదా! మీకు నిరాసక్తత వచ్చింది మీ స్వభావం వల్ల కాదు. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించకపోవడం వల్ల. ఈ కోణంలో ఓసారి ఆలోచించి చూడండి తెలుస్తుంది.
ప్రేమ వేరు. బంధం వేరు. మీకు సంతానం కలిగి, ఒక పొదరిల్లు నెమ్మదిగా అల్లుకోవడం మొదలుపెడితే రోజూ కొత్తగానే ఫీలవుతారు. పిల్లలతో తప్పటడుగులు వేయించడం నుంచి అక్షరాలు దిద్దించడం వరకు ప్రతి విషయాన్నీ ఆస్వాదిస్తారు. వివాహబంధం లేకుండా ప్రేమించుకోవడమే చేశారు కాబట్టి బహుశా మీకది బోరు కొట్టింది. దాన్ని మీ మనస్తత్వానికి అన్వయించుకుని అదేదో కాంప్లెక్స్‌లాగా బాధపడుతున్నారు. మనం చాలా విషయాల్ని రొటీన్‌గానే కొనసాగిస్తుంటాం. ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. ఒక నెల భోజనం, మరొక నెల పులిహోర, ఆపై బిర్యానీ, తర్వాత చపాతీలు అంటూ వెరైటీగా తినం కదా! దుస్తులు, ఇల్లు అనే ఉదాహరణ ఇచ్చింది అందుకే!
నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాను. ఇక్కడ మా బాస్ తన ఆఫీస్ పనులన్నీ మాతోనే చేయిస్తాడు. దాంతో వర్క్‌లోడ్ ఎక్కువై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. మెమోలు ఇచ్చేది బాసే కదా! అందుకే మొహమాటంతో ఆయన ఎంత పని చెప్పినా ‘నో’ అనలేకపోతున్నాను. ఈ సమస్య నుంచి బయటపడేదెలా?
- రామోజీ, నల్లమర్ల
మీరు మొహమాటంతో ‘నో’ చెప్పలేకపోతున్నారా లేక మీ ఉద్యోగం బాసు మీద ఆధారపడి ఉంది కాబట్టి నో చెప్పలేకపోతున్నారా? మీ ఉద్యోగాన్ని తీసేసే అధికారం మీ బాసుకి ఉన్నట్లయితే మీకు రెండే దార్లు. ఆయన చెప్పిన పనంతా చేయడం లేదా ఉద్యోగాన్ని వదిలేయడం. కానీ మీరు మొహమాటం అన్న పదం వాడారు. ఒకవేళ మీరు నో చెప్పినా కూడా మీ బాస్ మిమ్మల్ని ఏమీ చేయలేడు అనుకున్నా, మీ ప్రమోషన్‌కి అడ్డుపడే అధికారం ఆయనకి ఏమాత్రం లేకపోయినా...
‘ఆ పని నేను చేయ(లే)ను’ అని నిర్మొహమాటంగా చెప్పేయండి. అలా చెప్పడానికి కూడా మొహమాటం అయితే... ఆఫీసులో ఎన్ని గంటలు పని చేసినా తరగని పని ఒత్తిడి, మీరు నిర్వహిస్తోన్న బాధ్యతల గురించి వివరంగా ఉత్తరం రాసి ఆయన టేబుల్ మీద పెట్టండి. ఏం చేయాలన్నా ముందు మీ బాస్‌కి ఉన్న అధికారాల గురించి నిర్దిష్టమైన అవగాహనకు వచ్చి, ఆ తర్వాత చేయండి.
- యండమూరి వీరేంద్రనాథ్
తనపై ఆసక్తి పోయింది... ఇప్పుడెలా?
Published Sun, Sep 27 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM
Advertisement
Advertisement