Living Pacing
-
రహస్యంగా పెళ్లాడా... రోజూ బాధపడుతున్నా!
జీవన గమనం బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాను. ఓ అమ్మాయిని ప్రేమించాను. అనుకోని కారణాల వల్ల రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఎవరిళ్లకు వాళ్లం వెళ్లిపోయాం. నాకు బాగా చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఉంది. కానీ అమ్మానాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానన్న బాధ నన్ను తినేస్తోంది. మరోపక్క ఇంట్లోవాళ్లు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. నన్ను తీసుకెళ్లు, లేదంటే నేను బతకలేను, చచ్చిపోతాను అంటూ తను ఏడుస్తోంది. ఈ టెన్షన్లతో చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఇవన్నీ ఎలా డీల్ చేయాలో చెప్పండి ప్లీజ్. - ప్రదీప్, ఖమ్మం చదువుకుంటున్నప్పుడే ప్రేమించడం, పైగా రహస్యంగా పెళ్లి చేసుకోవడం, ఆపై ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవడం... ఇప్పటి వరకూ అన్నీ తప్పులే చేశారు మీరు. ఎలాగూ ఫైనలియర్ కాబట్టి ఇంకో నాలుగైదు నెలల్లో చదువు అయిపోతుంది. అప్పటి వరకూ ఆగమని ఆ అమ్మాయితో చెప్పండి. మీరు చదివిన చదువుకి పెద్ద ఉద్యోగం వస్తుందా అన్నది అనుమానమే. కాబట్టి రిజల్ట్స్ వచ్చేవరకూ ఆగకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయి ఆ అమ్మాయిని తెచ్చుకోండి. నిజానికి ఈ సమస్యకు పరిష్కారం చెప్పడం కష్టం. కానీ మీలాగ చదువుకోవాల్సిన సమయంలోనే పెళ్లి చేసుకుని, చదువు మీద ఏకాగ్రత నిలపకుండా, అటు ఆర్థిక స్తోమత లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకునే విద్యార్థుల కోసమే మీ ఉత్తరాన్ని ప్రచురిస్తున్నాం. నా వయసు 52. దాదాపు జీవితం అయిపోవచ్చింది. కానీ ఇంతవరకూ నాకు జీవితాన్ని జీవించినట్టే లేదు. చాలా చిన్న వయసులోనే పెళ్లి చేశారు. కళ్లు మూసి తెరిచేలోగా పిల్లలు పుట్టేశారు. వాళ్లను పెంచడంతోనే ఇప్పటివరకూ సరిపోయింది. ఇన్నేళ్లలో నేను నా భర్తతో కూడా సంతోషంగా గడిపింది లేదు. ఆయన రాత్రీపగలూ కష్టపడి డబ్బు సంపాదించడం, నేను కష్టపడి ఇల్లు చక్కబెట్టడం... ఇదే పని. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉందామంటే మా పిల్లలు తమ పిల్లల బాధ్యత మాకే అప్పగిస్తున్నారు. నేనిప్పటికే చాలా అలసిపోయాను. ఇక ఏ బరువు బాధ్యతలూ మోసే శక్తి నాకు లేదు. ఆ విషయం చెబితే నన్ను స్వార్థపరురాలు అంటారేమోనని భయం. నేనేం చేయాలి? - వరలక్ష్మి, కోదాడ మనిషి తాలూకు బాధలు రెండు రకాలు... శారీరకం, మానసికం. మానసికమైన బాధలు చాలా రకాలు ఉంటాయి. భయం, దిగులు, ఆందోళన మొదలైనవి. అయితే వీటన్నిటి కన్నా పెద్ద సమస్య మొహమాటం. మనం మొహమాటంగా ఉండేకొద్దీ సొంత పిల్లలు కూడా తమ బాధ్యతలని మనమీద రుద్దేయడానికి ప్రయత్నిస్తారు. మీరు మీవారితో వివరంగా మాట్లాడి, మీ సమస్యను ఆయనకు చెప్పండి. ఎవరో ఏదో అనుకుంటారని బతికేకొద్దీ వారు అనుకుంటూనే ఉంటారు. మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మీ జీవితం మీది. అందరూ మిమ్మల్ని స్వార్థపరురాలు అనుకోవడం వల్ల మీకొచ్చే నష్టమేమీ లేదు. మనకి ఇష్టం వచ్చినట్టుగా బతికే స్థాయికి ఎదగాలంటే ఆత్మస్థయిర్యం ఉండాలి. వీలైతే ‘తప్పు చేద్దాం రండి’ అన్న పుస్తకం చదవండి. మొహమాటం తగ్గించుకోవడం ఎలాగో అర్థమవుతుంది. నేను స్నేహానికి విలువిస్తాను. కానీ మా ఇంట్లోవాళ్లేమో... నువ్వెప్పుడూ సరిగ్గా చదవని వాళ్లతోనే స్నేహం చేస్తావంటూ తిడుతుంటారు. వాళ్ల ప్రభావంతో నేను చదువులో వెనుకబడిపోతానట. ఇప్పటి వరకూ అలా జరగలేదు. నేనెప్పుడూ బాగానే చదువుతాను. అయితే అవతలివాళ్లు బాగా చదువుతారా అన్నది కాకుండా మంచివాళ్లా కాదా అన్నది మాత్రమే చూసి స్నేహం చేస్తాను. నేనిలా ఆలోచించడం కరెక్టేనా? లేక మావాళ్లు అంటున్నది నిజమా? నేనేం చేయాలి? నా స్నేహితుల్ని వదులుకోవాలా? - పావని, ములుగుర్తి పూర్తిగా మంచి మనస్తత్వమే ఉన్నవారంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. మంచీ చెడుల మేళవింపే మనిషి. ఎవరూ కోరి కోరి చెడ్డవాళ్లతో స్నేహం చేయరు. చివరికి దొంగతనాలు చేసేవాడు కూడా మరో దొంగతోనే ఎందుకు స్నేహం చేస్తాడంటే, దొంగతనం అనేది చెడు కాదని, బతకడానికి అదొక మార్గమని నమ్ముతాడు కాబట్టి. అయితే ఈ కింది వారితో స్నేహం వల్ల మన సమయం వృథా అవుతుంది. మాటల అతిసార వ్యాధితో బాధపడే వాళ్లు (Diarrhea of talking), తమ భావాలు మన మీద రుద్దేవారు, వాదనలతో మనల్ని ఒప్పించేందుకు మన సమయాన్ని వృథా చేసేవారు, పుకార్లను విస్తరింపజేయడం ద్వారా గుర్తింపు పొందాలనుకునేవారు, సూడో తెలివి తేటలతో మనపై అధికారాన్ని చెలాయించాలని అనుకునేవారు. మీ స్నేహితులు బాగా చదువుతారా కాదా అన్నది ముఖ్యం కాదు. వారి ప్రభావం మీమీద ఎంత ఉందన్నదే ముఖ్యం. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు మీ ఫ్రెండ్స్‌లో ఉన్నాయోమో ఒకసారి పరిశీలించుకోండి. దాన్నిబట్టి స్నేహాన్ని కంటిన్యూ చేయండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
ఆలోచనల భయం వెంటాడుతుంటే?
జీవన గమనం నాకు కొన్నాళ్లుగా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. అలా జరిగితేనో, ఇలా జరిగితేనో అని ఆలోచించి భయపడుతుంటాను. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైపోయింది. నాకు ‘గే’లంటే చాలా భయం. కానీ ఎందుకో ఈ మధ్య నేను కూడా ‘గే’గా మారిపోతానేమో అనిపిస్తోంది. నిజానికి నాలో ఆ లక్షణాలు లేవు. అయినా ఎందుకనిపిస్తోందో! ఈ లక్ష ణాల గురించి నెట్లో వెతికితే దీన్ని యాంగ్జయిటీ డిజార్డరంటారని తెలిసింది. దీన్నుంచి నేనెలా బయటపడాలి? - అశ్విన్ చంద్ర, మెయిల్ భయం రెండు రకాలు. అర్ధరాత్రి పక్క గదిలో చప్పుడు వర్తమాన భయం. వచ్చే నెల పెళ్లికి డబ్బు సమకూరక పోవడం రేపటి భయం. దాన్నే ఆందోళన అని కూడా అంటారు. భయం సమస్య కాదు, బలహీనత. దానివల్ల వచ్చేది సమస్య. పరాయి రాష్ట్రంలో ఉద్యోగం వస్తే కూతుర్ని పంపకపోవడం, వాస్తు బాలేదని బంగారం లాంటి ఇల్లు వదులుకోవడం, భార్య పారిపోతుందన్న భయంతో మాంగల్యానికి నాలుగో ముడి వేయడం లాంటివన్నీ భయం తాలూకు పరిణామాలే. భయానికి అభద్రతాభావం కూడా ఒక కారణం. ఆడిటోరియంలో ముందు సీట్లు ఖాళీగా ఉన్నా వెనుక వరుసల్లో కూర్చునే విద్యార్థులు ఈ కోవలోకి వస్తారు. మనం భయపడే కొద్దీ అవతలివారు మన బలహీనతలతో ఆడుకుంటారు. ‘ఈ ఉత్తరాన్ని వందమందికి పంపకపోతే నీ బతుకు బస్టాండ్ అవుతుంది’ అని రాస్తాడొకడు. ‘ముఖద్వారం మార్చకపోతే నీ వ్యాపారం మటాష్’ అంటాడు ఇంకొకడు. ‘కడుపు మీద ఊచతో ఎర్రగా కాల్చకపోతే నీ కొడుక్కి కడుపు నొప్పి తగ్గదు’ అంటాడు మరొకడు. మీరెప్పుడైనా గమనించారా! చాలా మంది క్రికెటర్ల మణికట్లకి తాళ్లకట్లు, మెడలో దండలు మెండుగా కనబడుతూ ఉంటాయి. బహుశా వారి తల్లిదండ్రులు కట్టించి ఉంటారు. ఆ క్రికెటర్లకి బాగా డబ్బుంది కాబట్టి, ఎక్కడ డబ్బుంటే అక్కడ అభద్రతా భావం, ఎక్కడైతే ఒక అభద్రతా భావం ఉంటుందో ఆ భావాన్ని నిరంతరం పెంచుతూ ఉండటానికి అక్కడ ఒక బాబానో జ్యోతిష్యుడో ఉంటారు. వాళ్లు వీళ్ల తల్లిదండ్రుల్లో భయాన్ని ప్రవేశపెట్టి, తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. రంజీ ఆడేవారిక్కూడా తాయెత్తులుంటాయి. కానీ యాభైమంది రంజీ ఆటగాళ్లలో కేవలం ఒకరే దేశానికి సెలెక్ట్ అవుతారు. వారు దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఇక్కడ బాగా ఆడాలి. ఆటకి కావలసింది ప్రత్యర్థి ఎత్తుకి పై ఎత్తు. తాయెత్తు కాదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే... మీది సమస్యే. కానీ నెట్లో వెతికి ఒక నిర్ణయానికి రాకండి. మంచి కౌన్సెలర్‌ను కలుసుకుని మీ సమస్యను వివరించండి. ప్రతి మనిషిలోనూ కొన్ని నెగిటివ్ ఆలోచనలుంటాయి. ముఖ్యంగా ఓ లక్ష్యమూ పనీ లేనివారికి ఇలాంటి ఆలోచనలు మరింత ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మీరు ముందు ఓ మంచి వ్యాపకం కల్పించుకోండి. ఊపిరి సలపనంత పనిలో మునిగి, ఆ పనిని ఆస్వాదించడం ప్రారంభించండి. అప్పుడు మీ మనసులో ప్రవేశించడానికి భయానికి అసలు చోటే దొరకదు. నేను పీజీ చేసి ఈ మధ్యనే ఉద్యోగంలో చేరాను. కష్టపడి పనిచేసే తత్వం నాది. కానీ చాలా త్వరగా ఎమోషనల్ అయిపోతాను. ఎవరైనా నా పనికి కాస్త వంక పెట్టినా బెంగ వచ్చేస్తుంది. నన్ను ఇలా అన్నారే అని దాని గురించే చాలాసేపు ఆలోచిస్తుంటాను. అది కరెక్ట్ కాదని తెలిసినా కంట్రోల్ చేసుకోలేను. అర్థం పర్థం లేని ఇలాంటి ఎమోషన్సని కంట్రోల్ చేసుకోవడం ఎలా? - సంజీవ్, విశాఖపట్నం నాలుగైదు వాక్యాల్లో దీనికి సమా ధానం రాయడం కష్టం. భావోద్వేగాల్ని ఎలా నియంత్రించుకోగలమన్న టెక్నిక్స్‌ని వివరంగా చెప్పాల్సి ఉంటుంది. ఎమోషన్ మేనేజ్మెంట్ గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. నేనే విజయానికి అయిదు మెట్లు, మైండ్ పవర్, లోయ నుంచి శిఖరానికి మొదలైన పుస్తకాల్లో ఈ విషయం గురించి చాలా చర్చించాను. వీలైతే ఆ పుస్తకాలు చదవండి. కేవలం చదవడం కాదు, ఆచరణలో పెట్టండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
ప్రేమా గీమా వద్దంటోంది... ఎలా?
జీవన గమనం * నాకు నలుగురు పిల్లలు. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. నాకు పిల్లలంటే పిచ్చి ప్రేమ. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కుంటూ ఉంటాను. అయితే ఒక్కోసారి వాళ్లు... బాగానే ఉంటాం, ఎందుకంత కంగారు అని విసుక్కుంటున్నారు. వీలయితే మేమే చేస్తాం కదా అంటారు. దాంతో నా మనసు చివుక్కుమంటుంది. మావారు కూడా, అస్తమానం ఫోన్లు ఎందుకు అంటుంటారు. పిల్లల మీద ప్రేమ చూపించడం తప్పా? - లక్ష్మి, నాయుడుపేట జీవితంలో గొప్ప గొప్ప విషాదాలకి కారణం... ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు. అయితే వాటికంటే తీవ్రమైన అసంతృప్తి... ప్రేమించడానికి ఎవరూ లేకపోవడం. దానికన్నా దారుణమైనది... ప్రేమ హద్దులు దాటడం! అందుకే ఆర్థిక, కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నవారి కన్నా ప్రేమ కారణంగా చనిపోయినవారే ఎక్కువ. ఏది ఎంతవరకు కావాలో, ఏది ఎప్పుడు వదులుకోవాలో తెలుసుకోలేకపోవడమే మోహం. అది ఓ అనారోగ్యకరమైన అటాచ్మెంట్. బంధం వల్ల విషాదం వస్తుందని తెలుసుకోవడమే జ్ఞానం. ప్రేమ హద్దులు దాటితే మోహం. మోహం ముదిరితే వ్యామోహం! ప్రేమకూ మోహానికీ తేడా ఏంటని అలెగ్జాండర్ అడిగినప్పుడు, అరిస్టాటిల్ రెండే రెండు వాక్యాల్లో అద్భుతంగా చెప్పాడు... ‘ఇష్టపడిన పువ్వును కోయడం మోహం. ఆ పువ్వునిచ్చిన మొక్కకు నీరు పోయడం ప్రేమ’ అని. దూరంగా ఉన్న సంతానం గురించి బాధపడే తల్లిదండ్రుల కోసం బుద్ధ చరిత్రలో గొప్ప కథ ఉంది. బుద్ధుడి శిష్యుల్లో సారిపుట్ట ప్రథ ముడు. దాదాపు బుద్ధుడంతటి గొప్ప వాడు అనిపించుకున్న అతను, దేవతలకు కూడా నిర్వాణయోగం బోధించేవాడట. అతనికి చిన్న వయసులోనే ప్రాణ సంకట మైన వ్యాధి వచ్చింది. మరణం ఆసన్న మైనదని తెలుసుకుని, బుద్ధుడి దగ్గరకు వెళ్లి... ‘మరణించే ముందు నా తల్లికి క్షమాపణలు చెప్పుకోవాలి, ఆమె అంగీ కారం లేకుండా చిన్న వయసులోనే నేనిక్కడకు వచ్చేశాను’ అని అనుమతి అడిగాడు. బుద్ధుడు అంగీకారం తెలిపాడు. సారిపుట్ట అసలు పేరు సారిపుత్ర (సారి అనే స్త్రీ కొడుకు). వద్దంటున్నా వినకుండా కొడుకు బౌద్ధారామాల్లో చేరిపోయాడని తల్లికి కోపం. కొడుకు మరణం దగ్గర పడిన సంగతి ఆమెకు తెలీదు. మనసు మార్చుకుని వెనక్కి వస్తున్నాడనుకుని ఆశగా వెళ్లి, అతడింకా సన్యాసి దుస్తుల్లోనే ఉండటం చూసి హతా శురాలవుతుంది. మాట్లాడమని కొడుకు బతిమాలినా వినకుండా వెళ్లిపోతుంది. మరణం ఆసన్నమవుతుండగా ఒక చిత్రం జరిగింది. అతడు పడుకున్న గదితో పాటు, నగరమంతా ప్రకాశించసాగింది. ఆ వెలుగు చూసి తల్లి అక్కడికి వచ్చించి. ఆ వెలుగుకు కారణం దేవతలు. తమ గురువు ఆఖరి శుభవచనం వినడానికి ఆ గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఆమె చేష్టలుడిగి చూస్తోంది. సాక్షాత్తూ దేవతలు తన కొడుకు ముందు చేతులు జోడించి వరుసలో నిలబడుతున్నారు. అప్పుడే కొడుకు అవసాన దశ గురించి కూడా ఆమెకు అవగతమయ్యింది. తన కోరిక ఎంత స్వార్థమైనదో అర్థమయ్యింది. చేతు లెత్తి నమస్కరించి మంచం పక్కన నేల మీద వాలిపోయిందామె. వారించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు కొడుకు. అతడి కోరిక తీరింది. దేవతలంతా వింటూండగా నాలుగు సత్యాలు (వీటినే బౌద్ధంలో ఫోర్ నోబెల్ ట్రూత్స్ అంటారు) చెబుతూ శరీర బంధ విముక్తుడయ్యాడు. ఆత్మీయులు దూరంగా ఉండటం దుఃఖమే. తల్లిదండ్రులతో, తోబుట్టువు లతో కలిసి ఉండాలని పిల్లలకు మాత్రం ఉండదా! పైకి ఎంత హుషారుగా కన బడినా తమ వాళ్లందరినీ వదిలేసి వెళ్తున్నా మన్న బాధ వారికీ లోలోపల ఉంటుంది. కానీ ఆశయం కోసం త్యాగాలు తప్పవు. * నేను ఫార్మా-డి చేస్తున్నాను. నాకో మరదలు ఉంది. తనని నేనెంతో ప్రేమిస్తున్నాను. కానీ తను... ఫ్రెండ్స్‌లా ఉందాం, ప్రేమా గీమా వద్దు అంటోంది. తననెలా ఒప్పించాలి? - శివతేజ, ఊరు రాయలేదు ఆమె ఎందుకు ఒప్పుకోవడం లేదు? మిమ్మల్ని భర్తగా చూడటం ఇష్టం లేకా? తల్లిదండ్రులు ఒప్పుకోరని భయమా? మొదటిదే కారణం అయితే... మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేని అమ్మాయిని చేసుకుని మీరేం సుఖపడతారు? ఒకవేళ రెండో కారణం అయితే, ఆమె తండ్రి మీ బంధువే కాబట్టి ఆయనతోనే మాట్లాడి ఒప్పించండి. అన్నిటికన్నా ముందు మీరు మీ చదువు పూర్తి చేయండి. ఉద్యోగస్తుడైతే అడిగే అర్హత కూడా మీకు లభిస్తుంది. ఈలోపు మీ శక్తి, ఏకాగ్రత, నిద్రలేని రాత్రుల ఆలోచనలు... అన్నీ చదువు మీదే ఉపయోగించండి తప్ప ఆమెను ఎలా ఒప్పించాలా అని కాదు. - యండమూరి వీరేంద్రనాథ్ -
చచ్చిపోతానని బెదిరిస్తోంది... ఏం చేయను?
జీవన గమనం డిగ్రీ పూర్తి చేశాను. నాకు పాటలు పాడటం ఇష్టం. సినీ రంగంలో ప్రయత్నించాలని ఉంది. కానీ అమ్మ, నాన్న ఒప్పుకోవడం లేదు. వాళ్లు చెప్పిన రంగంలోనే అడుగిడాలని బలవంతం చేస్తున్నారు. నేను దాన్ని ఎంజాయ్ చేయలేనని ఎంత చెప్పినా వినడం లేదు. ఏం చేయాలో తోచక కుమిలిపోతున్నాను. అమ్మానాన్నలకు నా బాధ అర్థమవ్వాలంటే ఏం చేయాలి? - అక్షర, హైదరాబాద్ ప్రస్తుతం చాలామంది యువతకున్న సమస్య ఇది. మనకు ఒక రంగంలో ఇష్టం ఉంటుంది. తల్లిదండ్రులకేమో మనం ఇంకో పని చేస్తే బాగుంటుందని అని పిస్తుంది. కొంతవరకూ మీ తల్లిదండ్రులు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పాలి. మీ సమస్యకు ఉత్తమమైన పరిష్కారం ముందు మీరు మీ సంపాదనపై నిలబడటం. జీవితపు ప్రారంభ దశలో మనకిష్టమైన వృత్తిని చేపట్టడం కుదరక పోవచ్చు. మన అభిరుచికి వ్యతిరేకంగా, డబ్బు కోసం, ఇష్టం లేని వృత్తిని చేపట్టాల్సి రావొచ్చు. అప్పుడేం చేయాలంటే... ఆర్థికంగా నిలదొక్కు కోవడం కోసం ముందు మీరు ఒక ఉద్యోగంలో చేరండి. తర్వాత మీకిష్టమైన వృత్తిలోకి మారండి. కానీ మీకిష్టమైన ఆ వృత్తి మీకు జీవితాధారం ఇవ్వగలిగేంత ఆర్థిక వనరుల్ని సమకూర్చేదై ఉండాలి. అలా సమకూర్చే వృత్తి కాకపోతే... బతకడం కోసం మొదటి వృత్తిలోనే కొనసాగి, మరోవైపు మీ అభిరుచిని కొనసాగించండి. అప్పుడు జీవితంలో నిరాకస్తత పోతుంది. ఒకవేళ మీ అభిరుచి ఆర్థికంగా నిలదొక్కు కునే వీలున్నదైతే... కొంతకాలానికి అదే మీ వృత్తి అవుతుంది. నేనో ప్రభుత్వ ఉద్యోగిని. జనంలో కలిసిపోయి, జనం కోసం పని చేసే ఉద్యోగం నాది. సమస్యలు చెప్పుకోడానికి, సహాయం కోరడానికి చాలామంది ఫోన్ చేస్తారు. వారిలో ఆడవాళ్లూ ఉంటారు. అది నా భార్యకు నచ్చదు. మహిళల దగ్గర్నుంచి ఫోన్‌వస్తే పెద్ద రాద్ధాంతం చేస్తుంది. మొదట్నుంచీ తనకు అనుమానమే. తన గొడవ పడలేక కాలేజీ ఫ్రెండ్‌కి కూడా దూరమైపోయాను. చివరికి బంధువుల్లో ఆడవాళ్లతో మాట్లాడినా తట్టుకోలేదు. ఏమైనా అంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది. పిల్లల కోసమని భరించేకొద్దీ దీనికి అంతం లేకుండా పోతోంది. ఈ నరకం నుంచి నాకు విముక్తి దొరకదా? - పాండురంగ ప్రసాద్, విజయనగరం మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారో స్పష్టంగా చెప్పలేదు. ఉద్యోగరీత్యా ఆడవారికి ఏ రకంగా సహాయపడుతూ ఉంటారు? ఫోన్లు ఆఫీసు టైమ్‌లోనే వస్తాయా లేక అర్ధరాత్రి కూడా వస్తుంటాయా? బంధువుల్లో ఆడవారితో భార్య ఈర్ష్య పడేంతగా మాట్లాడాల్సిన అవసరం నిజంగా ఉందా? ఇలా కూడా ఆలోచించవచ్చు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు చూసుకుంటే... కొందరు ఆడవాళ్లు అలానే ఉంటారు. అభ్రదతా భావం, విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్లని నిరంతరం అనుమానం వెంటాడుతూనే ఉంటుంది. ఎంత చెప్పినా వినరు. వాళ్లను బాధపెట్టకుండా సహ జీవనం చేయడం తప్ప వేరే దారి లేదు. వీలయినంత వరకూ ఆఫీసు సమయం లోనే సహాయం చేస్తూ ఉండండి. అదొక్కటే మార్గం. నేను ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. నా లక్ష్యం ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేయడం. అయితే నాతోపాటు కోచింగ్ తీసుకుంటున్న ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నాడు. పదే పదే డిస్టర్బ్ చేయడంతో కాన్సన్ట్రేషన్ తప్పుతోంది. అతణ్ని ఎలా అవాయిడ్ చేయాలో అర్థం కావడం లేదు. నేనెలా అయినా నా లక్ష్యాన్ని సాధించాలి? ఏం చేయాలో సలహా ఇవ్వండి. - తన్మయి, మెయిల్ ఆ అబ్బాయి మిమ్మల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాడు? నిజంగా మీకు చదువే గమ్యం అయితే ఆ అబ్బాయిని అవాయిడ్ చేయడం అంత కష్టం కాదు. మీ నాన్న గారికి చెప్పండి. లేదంటే మీ ప్రిన్సిపల్‌తో చెప్పండి. అదీ సాధ్యం కాని పక్షంలో మీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా పెద్దవారికి చెప్పండి. ఇంటర్ చదివే కుర్రాడిని భయపెట్టి మీ నుంచి దూరం చేయడం అంత కష్టమైన పనేమీ కాదు. కానీ మీ ఉత్తరం చూస్తుంటే, అతణ్ని అవాయిడ్ చేయడం మీకే ఇష్టం లేదేమో అనిపిస్తోంది. అతను మీ వెంట పడుతూ ఉండాలి, మీరు కాదంటూనే ఉండాలి. ఒకవేళ మీ స్థితి ఇలాంటిదయితే మాత్రం మీరు చదువు మీద అస్సలు దృష్టి నిలపలేరు. - యండమూరి వీరేంద్రనాథ్ -
గురువును పెళ్లాడటం... తప్పు కాదా?!
జీవన గమనం నేనొక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. నేను చేస్తోన్న ఉద్యోగం నాకు సుఖాన్నిస్తోంది. కానీ నా నమ్మకాలకు వ్యతి రేకంగా పని చేస్తేనే ఆ ‘సుఖం’ నాకు లభి స్తోంది. ఇలా నమ్మకాలకి, మరింత సుఖపడ టానికి మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు ఎలా సమన్వయపరచుకోవాలి? ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సిందేనా? - నన్నపనేని, సామర్లకోట ‘నా నైతిక విలువల్ని వదులుకోవాలా, సుఖాన్ని వదులుకోవాలా’ అన్నది మీ ప్రశ్న. హోటల్లో ఇడ్లీ తింటున్నప్పుడు పక్క వాడి పూరీని చూసి, తప్పు నిర్ణయం తీసు కున్నామేమో అని బాధపడితే ఇడ్లీ ఏ మాత్రం సంతృప్తినివ్వదు. మీ ఉద్యోగం మీకు సుఖాన్నిస్తోంది కానీ సంతృప్తినివ్వ ట్లేదని రాశారు. ఒక పని సంతృప్తినివ్వక పోవడానికి కారణం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి - శారీరకంగా మనం ఆ పని చేయలేకపోయినప్పుడు. ఉదాహరణకి, రోగంతో బలహీనమైన వ్యక్తి రైల్వే కూలీగా పనిచేస్తే చాలా బాధపడవలసి ఉంటుంది. రెండోది - మానసికంగా ఆ పని ఇష్టం లేకపోయినప్పుడు. ఉదాహర ణకి, సృజనాత్మకత ఉన్న ఒక కళాకారిణి బ్యాంక్‌లో రొటీన్ ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు చాలా నిరాసక్తత ఆవహి స్తుంది. మూడోది - చేస్తున్న పనికి, సిద్ధాంతాలకు నిరంతర ఘర్షణ జరుగుతున్నప్పుడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కూడా లంచాలు, కమీషన్లు ఉంటాయి. మీ సమస్య మూడోదే అనుకుంటున్నాను. నైతిక విలువల పట్ల నమ్మకం ఉన్న వ్యక్తికి, పక్క సీట్లో కూర్చుని లంచాలు తీసుకుం టున్న వ్యక్తి రోజురోజుకీ ధనవంతుడవడం చూసి... ‘తనకున్న నైతిక విలువ గొప్పదా ధనం విలువ గొప్పదా’ అన్న సంఘర్షణ మొదలవుతుంది. మీ సమస్య ఇదే అయితే ముందొక నిర్ణయం తీసుకోండి. సుఖం అనేది రెలిటివ్ టర్మ్. దానికి అంతు లేదు. డబ్బు నిశ్చయంగా సుఖాన్ని స్తుంది. కానీ ఆనందాన్ని ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ప్రస్తుతం మీకు బతకటానికి లోటు లేదు కదా! నిరంతరం ‘నేను చాలా మంచివాడిని, అందుకే నాకిన్ని బాధలు’ అని మనసులో సంఘర్షిస్తూ ఉంటే ఆనందం ఎప్పటికీ దొరకదు. నేను నైతిక విలువలు కోల్పో మని మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు. ఘర్షణను వదులుకుని జీవించమని చెప్తున్నానంతే. లంచం పొందడానికి వీలున్న కుర్చీలో కూర్చుని కూడా నిజాయితీగా బతికేవాడి మొహంలో ఉండే ప్రశాంతత, విలువలు కోల్పోయిన వ్యక్తి ముఖంలో ఉండదు. కష్టపడి సంపాదించే డబ్బు సంతృప్తినిస్తుంది. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. మా కాలేజీలో ఒక లెక్చెరర్ దగ్గర సాయంత్రం ట్యూషన్ చెప్పించుకుంటున్నాను. ఓ రోజు ఆయన ఒంటరిగా ఉన్న నా దగ్గరకు వచ్చి నేనంటే ఇష్టమని చెప్పారు. నేనేం మాట్లాడ లేదు. గురువును ప్రేమించడం తప్పు అని నా ఉద్దేశం. కానీ ఆయన తనకే దురుద్దేశం లేదని, నేను కూడా సెటిలయ్యాక మా పేరెంట్స్‌తో మాట్లాడి పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఆయనను నమ్మాలా? లేక నో చెప్పాలా? - సుజిత, నకిరేకల్ ఇందులో ‘నమ్మటం’ అన్న ప్రసక్తి ఎక్కడుంది? మీ అభ్యంతరం కేవలం ఆయన మీ ‘గురువు’ అన్నదొక్కటే అయితే, మిగతా అన్ని విషయా ల్లోనూ ఆయన కరెక్టుగా ఉంటే.. ఏమాత్రం సంశయించకుండా వివాహం చేసుకోవచ్చు. అయినా గురువును పెళ్లాడటం తప్పు అని ఎక్కడా రాసి లేదు. ఈ రోజుల్లో బీటెక్ పాసయిన కుర్రాళ్లే తర్వాతి సంవత్సరం లెక్చెరర్స్గా మారు తున్నారు. మీ ఉత్తరాన్ని బట్టి అతను మంచివాడిలానే కనిపిస్తున్నాడు. వయ సులో ఎక్కువ తేడా లేకపోతే నిరభ్యంత రంగా పెళ్లి చేసుకోవచ్చు. బెస్టాఫ్ లక్. నేను ఎమ్మెస్సీ చదువుతున్నాను. కానీ నాది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వమే అని అందరూ అంటుంటారు. మా నాన్న అయితే ఎక్కడ పడితే అక్కడే తిట్టేస్తుంటారు. నాకు చాలా బాధనిపిస్తోంది. నిజానికి ఏ పని ఎలా చక్క బెట్టాలో నాకు తెలియదు. అందుకే అందరూ అనేది నిజమేనేమో, నాకంత జ్ఞానం లేదేమో అనిపిస్తోంది. హాస్టల్లో ఉండి చదివితే మైండ్ మెచ్యూరవుతుందని విన్నాను. నేనెప్పుడూ హాస్టల్లో లేను. అందుకే నా మైండ్ ఎదగలేదా? - సునీల్, అనంతపురం ఒక తాగుబోతు తండ్రి కన్నా, పిల్లల్ని సరిగ్గా పెంచలేని తండ్రి నికృష్టుడు అని ఎక్కడో చదివాను. ఎదిగిన పిల్లల్ని అందరి ముందూ తిడితే వాళ్ల మనస్తత్వంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రతి తండ్రీ తెలుసుకోవాలి. మీకు జ్ఞానం లేక పోవడానికి (కనీసం మీరు అలా అను కుంటూ ఉండడానికి) కారణం మీ తండ్రి ఒక్కరే కాకపోవచ్చు. ఏదేమైనా, హాస్టల్లో ఉండి చదువుకుంటే మైండ్ మెచ్యూర్ అవుతుందనుకోవడం నూరుపాళ్లూ నిజం కాదు. మీరు ఎలానూ మరికొంత కాలానికి ఉద్యోగంలో ప్రవేశిస్తారు. అప్పుడు సహజంగానే ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. చదువు ఆఖరి దశలో ఇల్లు వదిలి హాస్టల్లో చేరితే కొత్త సమస్యలు రావచ్చు. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా కొంతకాలం ఆగండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
తనపై ఆసక్తి పోయింది... ఇప్పుడెలా?
జీవన గమనం నా వయసు 40. నాకు ఒక్కతే కూతురు. వయసు పద్దెనిమిదేళ్లు. నా భర్త, నేను విడిగా ఉంటున్నాం. నా కూతురూ నేనే ఉండటం వల్ల తనమీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నాను. మొన్నీ మధ్య వరకూ తను ప్రతి విషయం నాతో చెప్పేది. ప్రతి విషయానికీ నామీదే ఆధారపడేది. కానీ ఇప్పుడు తను స్వతంత్రంగా ప్రవర్తిస్తోంది. అది నేను భరించలేకపోతున్నాను. ఏం చేయాలి? - ప్రతిభ, వెంట్రప్రగడ మీ అమ్మాయి తన పనులు తాను చేసుకుంటోంది... అంతే కదా! అలా కాకుండా ప్రతి విషయానికీ మీమీదే ఆధారపడి ఉంటే, ‘పద్దెనిమిదేళ్లు దాటినా నా కూతురు ప్రతి చిన్నదానికీ నామీదే ఆధారపడుతోంది, ఏం చేయాలి’ అంటూ ఇదే శీర్షికకి మీరు ఉత్తరం రాసి ఉండేవారు. చెప్పాలంటే చాలామంది సింగిల్ పేరెంట్స్‌కి వచ్చే సమస్య ఇది. తమ పిల్లలు ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా తమ మీదే ఆధారపడాలని కోరుకుంటారు. నిజానికి యుక్త వయసు వచ్చిన పిల్లలు, తల్లిదండ్రుల పరిధి నుంచి దూరంగా వెళ్లడం ఎంతో సర్వ సాధారణమైన విషయం. కాబట్టి మారాల్సింది మీరే. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపయినా మీ అమ్మాయి మిమ్మల్ని విడిచి వెళ్లిపోవలసిందే కదా! మొదట్లో కొంత శూన్యత ఉంటుంది. తర్వాత అలవాటు అవుతుంది. అందుకే మీరు ఇప్పట్నుంచీ ఏదైనా మంచి అభిరుచిని పెంచుకోండి. బంధంలో ఇరుక్కోకుండా మనల్ని ‘మంచి అభిరుచి’ కాపాడుతుంది. అలాగే మీకు నచ్చిన మతగ్రంథం చదవండి. పాజిటివ్‌గా ఆలోచించి ప్రశాంతంగా ఉండండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమించింది. మేము ప్రేమించుకోవడం మొదలుపెట్టి ఒక సంవత్సరం అయ్యింది. కానీ అప్పుడే నాకు తనమీద నిరాసక్తత వచ్చేసింది. కొత్తదనం లేనట్లు అనిపిస్తోంది. పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇలా ఒకే వ్యక్తితో ఉండాలా అని ఓ రకమైన కాంప్లెక్స్‌కి లోనవుతున్నాను. నిజానికి నేను ఉద్యోగం కూడా ఎక్కడా సంవత్సరానికి మించి చేయను. ప్రతిసారీ కొత్తదనాన్ని కోరుకుంటాను. ఈ కాంప్లెక్స్ నుంచి బయటపడే మార్గం చెప్పండి. - రఘువర, రాజమండ్రి ప్రతిసారీ కొత్తదనాన్ని కోరుకుంటాను అని రాశారు. అంటే భోజనం, దుస్తులు... అన్నీ సంవత్సరం అయ్యేసరికి మారుస్తున్నారా? లేక ఉద్యోగాన్ని, ప్రియురాలిని మాత్రమేనా? ఎంత కొత్తదనాన్ని ఆశించేవాడైనా సంవత్సరానికో పెళ్లి చేసుకోడు కదా! మీకు నిరాసక్తత వచ్చింది మీ స్వభావం వల్ల కాదు. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించకపోవడం వల్ల. ఈ కోణంలో ఓసారి ఆలోచించి చూడండి తెలుస్తుంది. ప్రేమ వేరు. బంధం వేరు. మీకు సంతానం కలిగి, ఒక పొదరిల్లు నెమ్మదిగా అల్లుకోవడం మొదలుపెడితే రోజూ కొత్తగానే ఫీలవుతారు. పిల్లలతో తప్పటడుగులు వేయించడం నుంచి అక్షరాలు దిద్దించడం వరకు ప్రతి విషయాన్నీ ఆస్వాదిస్తారు. వివాహబంధం లేకుండా ప్రేమించుకోవడమే చేశారు కాబట్టి బహుశా మీకది బోరు కొట్టింది. దాన్ని మీ మనస్తత్వానికి అన్వయించుకుని అదేదో కాంప్లెక్స్‌లాగా బాధపడుతున్నారు. మనం చాలా విషయాల్ని రొటీన్‌గానే కొనసాగిస్తుంటాం. ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. ఒక నెల భోజనం, మరొక నెల పులిహోర, ఆపై బిర్యానీ, తర్వాత చపాతీలు అంటూ వెరైటీగా తినం కదా! దుస్తులు, ఇల్లు అనే ఉదాహరణ ఇచ్చింది అందుకే! నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాను. ఇక్కడ మా బాస్ తన ఆఫీస్ పనులన్నీ మాతోనే చేయిస్తాడు. దాంతో వర్క్‌లోడ్ ఎక్కువై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. మెమోలు ఇచ్చేది బాసే కదా! అందుకే మొహమాటంతో ఆయన ఎంత పని చెప్పినా ‘నో’ అనలేకపోతున్నాను. ఈ సమస్య నుంచి బయటపడేదెలా? - రామోజీ, నల్లమర్ల మీరు మొహమాటంతో ‘నో’ చెప్పలేకపోతున్నారా లేక మీ ఉద్యోగం బాసు మీద ఆధారపడి ఉంది కాబట్టి నో చెప్పలేకపోతున్నారా? మీ ఉద్యోగాన్ని తీసేసే అధికారం మీ బాసుకి ఉన్నట్లయితే మీకు రెండే దార్లు. ఆయన చెప్పిన పనంతా చేయడం లేదా ఉద్యోగాన్ని వదిలేయడం. కానీ మీరు మొహమాటం అన్న పదం వాడారు. ఒకవేళ మీరు నో చెప్పినా కూడా మీ బాస్ మిమ్మల్ని ఏమీ చేయలేడు అనుకున్నా, మీ ప్రమోషన్‌కి అడ్డుపడే అధికారం ఆయనకి ఏమాత్రం లేకపోయినా... ‘ఆ పని నేను చేయ(లే)ను’ అని నిర్మొహమాటంగా చెప్పేయండి. అలా చెప్పడానికి కూడా మొహమాటం అయితే... ఆఫీసులో ఎన్ని గంటలు పని చేసినా తరగని పని ఒత్తిడి, మీరు నిర్వహిస్తోన్న బాధ్యతల గురించి వివరంగా ఉత్తరం రాసి ఆయన టేబుల్ మీద పెట్టండి. ఏం చేయాలన్నా ముందు మీ బాస్‌కి ఉన్న అధికారాల గురించి నిర్దిష్టమైన అవగాహనకు వచ్చి, ఆ తర్వాత చేయండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
బాయ్‌ఫ్రెండ్‌ని కలవడం తప్పా?!
జీవన గమనం నేను బీటెక్ పూర్తిచేశాను. సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలని ఉంది. కానీ ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఎందుకంటే నాకు నత్తి. సరిగ్గా మాట్లాడలేను. సైకియాట్రిస్టులు నత్తిని పోగొడతారని విన్నాను. నిజమేనా? - లక్ష్మి, బెంగళూరు నత్తికీ ఉద్యోగానికీ సంబంధం లేదు. కొన్ని ఇంటర్వ్యూ కమిటీలలో నేను మెంబర్ని. మీకు సదరు సాఫ్ట్‌వేర్‌లో ప్రవేశం ఉందన్న నమ్మకం ఇంటర్వ్యూ కమిటీకి కలిగిస్తే, (మీరు అప్లై చేసిన ఉద్యోగానికీ, నత్తికీ సంబంధం లేకపోతే) ఎవరూ మీ వైకల్యం గురించి పట్టించుకోరు. ఇహ మీ నిజ జీవితంలో సమస్య గురించి: నత్తి రెండు రకాలు. శారీరకంగా వచ్చినది, మానసికంగా వచ్చినది. శారీ రకమైన నత్తిని పోగొట్టడానికి నాకు తెలిసి, మందులేమీ లేవు. మానసికమైన నత్తిని సైకాలజిస్టులు పోగొట్టే వీలుంది. మీరు సైకియాట్రిస్టులు అనే పదం వాడారు. మానసిక రోగాల్ని ‘మందుల ద్వారా’ తగ్గించేవారు సైకియాట్రిస్టులు. మానసిక ఇబ్బందులని ‘మాటల ద్వారా’ తొలగించే వారు సైకాలజిస్టులు. మీ అవసరం సైకా లజిస్టులతో ఉన్నది. నెమ్మదిగా, సున్ని తంగా, ఆవేశపడకుండా మాట్లాడే టెక్నిక్స్ నేర్పి, ధైర్యం కలిగించి, మాట్లాడటాన్ని ఒక పద్ధతిలో పెట్టటం ద్వారా వారు నత్తిని పోగొడతారు. ప్రయత్నించండి. నేను ఓ స్కూల్లో టీచర్ని. ఓరోజు మార్కెట్‌కి వెళ్లినప్పుడు తొమ్మిదో తరగతి విద్యార్థిని అక్కడ తారస పడింది. తను నాకు చాలా నచ్చింది. తనని అలానే చూస్తూ ఉండి పోయాను. తనూ అంతే. మెల్లగా నాకు తనంటే ఇష్టం ఏర్పడింది. వాళ్ల నాన్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేస్తే, రిప్లై ఇచ్చింది. రెండు నెలల తర్వాత నేను ఉద్యోగానికి రాజీనామా చేసి కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం మొదలు పెట్టాను. ఓరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్ కనబడితే నాకు ఆ అమ్మాయంటే ఇష్టమని తనతో చెప్పాను. తను వెళ్లి ఏం చెప్పిందో కానీ ఆ రోజు నుంచీ ఆ అమ్మాయి నాతో మాట్లాడటం మానేసింది. మెసేజ్ ఇస్తే రిప్లై ఇవ్వదు. ఎందుకలా మారిపోయిందో అర్థం కావడం లేదు. నేను చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాను. ఓ విద్యార్థిని పట్ల ఇలాంటి భావాలు కలిగివుండటం తప్పే. కానీ తనంటే నాకు ఇష్టం. ఏం చేయను? - ఓ సోదరుడు తొమ్మిదో తరగతి అమ్మాయంటే సాధారణంగా మైనరయ్యుంటుంది. అటువంటివారితో సంబంధం మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపించే ప్రమాదం ఉంది. వాళ్ల నాన్నగారి ఫోనుకి మీరు మెసేజులు పంపుతున్నారు. అది మరీ ప్రమాదం. ఎన్నో సందర్భాల్లో గ్రామస్థులు టీచర్లకి దేహశుద్ధి చేయటం మీరు చదివే ఉంటారు. ఆ అమ్మాయి మీకు మెసేజ్ రిప్లై ఇవ్వటంలో కేవలం స్నేహభావమో లేక మీరు పెద్దవారనే గురుభావమో ఉండి ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు ప్రేమను ప్రకటించారో ఆ చిన్న అమ్మాయి తన గూడులోకి వెళ్లిపోయింది. పదిహేనేళ్ల అమ్మాయి ఆ విధంగా ప్రవర్తించటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇక తనంటే మీకు చాలా ఇష్టం అన్నారు. మొదటి ప్రేమలో ఇటువంటి ఆకర్షణలు చాలా బలంగా ఉంటాయి. ప్రేమలో పడితే చదువు ఎక్కక పోవటం సహజమే. కాబట్టి కొంతకాలం ఆ ఆలోచనల్ని పక్కన పెట్టండి. దీనికి మీకు నిర్వాణ యోగ ప్రక్రియ ఉపయోగ పడుతుంది. దాని గురించి వివరంగా నా ‘విజయ రహస్యాలు’ అనే పుస్తకంలో ఇచ్చాను. ప్రాక్టీసు చేయండి. ముందే చెప్పినట్టు కొంత కాలం కేవలం చదువు మీదే ఏకాగ్రత నిలిపితే మీ భవిష్యత్తుకి మంచిది. ప్రేమ ముఖ్యమే. కానీ భవిష్యత్తు దానికన్నా ముఖ్యం కదా! నా స్నేహితురాలికి ఇటీవలే పెళ్లయ్యింది. ఆమెకి ఓ చిన్ననాటి స్నేహితుడున్నాడు. ఇద్దరిదీ మంచి స్నేహం. దానికి నేనే సాక్షిని. కానీ తన భర్త ఈ స్నేహాన్ని ఒప్పుకోవడం లేదు. అతణ్ని కలుసుకోవద్దని ఆంక్ష పెట్టాడు. తను బాధ పడుతోంది. ఏం చేయమంటారు? - శ్రీ సత్య, నంద్యాల ప్రతి సమస్యకీ కొన్ని పరిష్కారాలు ఉంటాయి. వాటిలో ఏది మంచిదో మనమే నిర్ణయించుకోవాలి. ఈ పరిస్థితిలో మీ స్నేహితురాలు - అయితే భర్తని లెక్క చేయకుండా స్నేహితుణ్ని కలుసుకోవచ్చు. నొప్పింపక తానొవ్వక రీతిలో భర్త పరో క్షంలో అతణ్ని కలుసుకోవచ్చు. గతంలో పిక్నిక్కి వెళ్లినప్పుడు, ఇద్దరూ ఒకే గదిలో రాత్రంతా ఉన్నప్పుడు స్నేహితుడి ప్రవర్తన, అతడి పవిత్ర వ్యక్తిత్వం గురించి భర్తకి వివరించవచ్చు (కానీ ఇది విడా కులకి దారితీసే ప్రమాదం ఉంది). అతడి భార్యని తన భర్తకి చెల్లిగా పరిచయం చేస్తూ ఆమెను నోరారా వదినా అని పిలుస్తూ, మొత్తం ఫ్యామిలీని ఫ్రెండ్స్‌గా చేసుకోవచ్చు. పడక సత్యాగ్రహం లాంటి పద్ధతుల ద్వారా భర్తని దారిలోకి తెచ్చుకో వచ్చు. భర్త కోసం ఇష్టం లేకపోయినానో లేక మనస్ఫూర్తిగానో పాత స్నేహానికి బై చెప్పవచ్చు. నిరంతరం నిరాశతో బాధ పడటం కంటే పై వాటిలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవడం మేలు.