ఆలోచనల భయం వెంటాడుతుంటే?
జీవన గమనం
నాకు కొన్నాళ్లుగా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. అలా జరిగితేనో, ఇలా జరిగితేనో అని ఆలోచించి భయపడుతుంటాను. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైపోయింది. నాకు ‘గే’లంటే చాలా భయం. కానీ ఎందుకో ఈ మధ్య నేను కూడా ‘గే’గా మారిపోతానేమో అనిపిస్తోంది. నిజానికి నాలో ఆ లక్షణాలు లేవు. అయినా ఎందుకనిపిస్తోందో! ఈ లక్ష ణాల గురించి నెట్‌లో వెతికితే దీన్ని యాంగ్జయిటీ డిజార్డరంటారని తెలిసింది. దీన్నుంచి నేనెలా బయటపడాలి?
- అశ్విన్ చంద్ర, మెయిల్
భయం రెండు రకాలు. అర్ధరాత్రి పక్క గదిలో చప్పుడు వర్తమాన భయం. వచ్చే నెల పెళ్లికి డబ్బు సమకూరక పోవడం రేపటి భయం. దాన్నే ఆందోళన అని కూడా అంటారు. భయం సమస్య కాదు, బలహీనత. దానివల్ల వచ్చేది సమస్య. పరాయి రాష్ట్రంలో ఉద్యోగం వస్తే కూతుర్ని పంపకపోవడం, వాస్తు బాలేదని బంగారం లాంటి ఇల్లు వదులుకోవడం, భార్య పారిపోతుందన్న భయంతో మాంగల్యానికి నాలుగో ముడి వేయడం లాంటివన్నీ భయం తాలూకు పరిణామాలే. భయానికి అభద్రతాభావం కూడా ఒక కారణం.
ఆడిటోరియంలో ముందు సీట్లు ఖాళీగా ఉన్నా వెనుక వరుసల్లో కూర్చునే విద్యార్థులు ఈ కోవలోకి వస్తారు. మనం భయపడే కొద్దీ అవతలివారు మన బలహీనతలతో ఆడుకుంటారు. ‘ఈ ఉత్తరాన్ని వందమందికి పంపకపోతే నీ బతుకు బస్టాండ్ అవుతుంది’ అని రాస్తాడొకడు. ‘ముఖద్వారం మార్చకపోతే నీ వ్యాపారం మటాష్’ అంటాడు ఇంకొకడు. ‘కడుపు మీద ఊచతో ఎర్రగా కాల్చకపోతే నీ కొడుక్కి కడుపు నొప్పి తగ్గదు’ అంటాడు మరొకడు.
మీరెప్పుడైనా గమనించారా! చాలా మంది క్రికెటర్ల మణికట్లకి తాళ్లకట్లు, మెడలో దండలు మెండుగా కనబడుతూ ఉంటాయి. బహుశా వారి తల్లిదండ్రులు కట్టించి ఉంటారు. ఆ క్రికెటర్లకి బాగా డబ్బుంది కాబట్టి, ఎక్కడ డబ్బుంటే అక్కడ అభద్రతా భావం, ఎక్కడైతే ఒక అభద్రతా భావం ఉంటుందో ఆ భావాన్ని నిరంతరం పెంచుతూ ఉండటానికి అక్కడ ఒక బాబానో జ్యోతిష్యుడో ఉంటారు. వాళ్లు వీళ్ల తల్లిదండ్రుల్లో భయాన్ని ప్రవేశపెట్టి, తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. రంజీ ఆడేవారిక్కూడా తాయెత్తులుంటాయి. కానీ యాభైమంది రంజీ ఆటగాళ్లలో కేవలం ఒకరే దేశానికి సెలెక్ట్ అవుతారు. వారు దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఇక్కడ బాగా ఆడాలి. ఆటకి కావలసింది ప్రత్యర్థి ఎత్తుకి పై ఎత్తు. తాయెత్తు కాదు.
ఇదంతా ఎందుకు చెప్పానంటే... మీది సమస్యే. కానీ నెట్‌లో వెతికి ఒక నిర్ణయానికి రాకండి. మంచి కౌన్సెలర్‌ను కలుసుకుని మీ సమస్యను వివరించండి. ప్రతి మనిషిలోనూ కొన్ని నెగిటివ్ ఆలోచనలుంటాయి. ముఖ్యంగా ఓ లక్ష్యమూ పనీ లేనివారికి ఇలాంటి ఆలోచనలు మరింత ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మీరు ముందు ఓ మంచి వ్యాపకం కల్పించుకోండి. ఊపిరి సలపనంత పనిలో మునిగి, ఆ పనిని ఆస్వాదించడం ప్రారంభించండి. అప్పుడు మీ మనసులో ప్రవేశించడానికి భయానికి అసలు చోటే దొరకదు.
నేను పీజీ చేసి ఈ మధ్యనే ఉద్యోగంలో చేరాను. కష్టపడి పనిచేసే తత్వం నాది. కానీ చాలా త్వరగా ఎమోషనల్ అయిపోతాను. ఎవరైనా నా పనికి కాస్త వంక పెట్టినా బెంగ వచ్చేస్తుంది. నన్ను ఇలా అన్నారే అని దాని గురించే చాలాసేపు ఆలోచిస్తుంటాను. అది కరెక్ట్ కాదని తెలిసినా కంట్రోల్ చేసుకోలేను. అర్థం పర్థం లేని ఇలాంటి ఎమోషన్‌సని కంట్రోల్ చేసుకోవడం ఎలా?
- సంజీవ్, విశాఖపట్నం
నాలుగైదు వాక్యాల్లో దీనికి సమా ధానం రాయడం కష్టం. భావోద్వేగాల్ని ఎలా నియంత్రించుకోగలమన్న టెక్నిక్స్‌ని వివరంగా చెప్పాల్సి ఉంటుంది. ఎమోషన్ మేనేజ్‌మెంట్ గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. నేనే విజయానికి అయిదు మెట్లు, మైండ్ పవర్, లోయ నుంచి శిఖరానికి మొదలైన పుస్తకాల్లో ఈ విషయం గురించి చాలా చర్చించాను. వీలైతే ఆ పుస్తకాలు చదవండి. కేవలం చదవడం కాదు, ఆచరణలో పెట్టండి.
- యండమూరి వీరేంద్రనాథ్