ప్రేమా గీమా వద్దంటోంది... ఎలా?
జీవన గమనం
* నాకు నలుగురు పిల్లలు. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. నాకు పిల్లలంటే పిచ్చి ప్రేమ. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కుంటూ ఉంటాను. అయితే ఒక్కోసారి వాళ్లు... బాగానే ఉంటాం, ఎందుకంత కంగారు అని విసుక్కుంటున్నారు. వీలయితే మేమే చేస్తాం కదా అంటారు. దాంతో నా మనసు చివుక్కుమంటుంది. మావారు కూడా, అస్తమానం ఫోన్లు ఎందుకు అంటుంటారు. పిల్లల మీద ప్రేమ చూపించడం తప్పా?
- లక్ష్మి, నాయుడుపేట
జీవితంలో గొప్ప గొప్ప విషాదాలకి కారణం... ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు. అయితే వాటికంటే తీవ్రమైన అసంతృప్తి... ప్రేమించడానికి ఎవరూ లేకపోవడం. దానికన్నా దారుణమైనది... ప్రేమ హద్దులు దాటడం! అందుకే ఆర్థిక, కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నవారి కన్నా ప్రేమ కారణంగా చనిపోయినవారే ఎక్కువ. ఏది ఎంతవరకు కావాలో, ఏది ఎప్పుడు వదులుకోవాలో తెలుసుకోలేకపోవడమే మోహం. అది ఓ అనారోగ్యకరమైన అటాచ్‌మెంట్. బంధం వల్ల విషాదం వస్తుందని తెలుసుకోవడమే జ్ఞానం. ప్రేమ హద్దులు దాటితే మోహం. మోహం ముదిరితే వ్యామోహం!
ప్రేమకూ మోహానికీ తేడా ఏంటని అలెగ్జాండర్ అడిగినప్పుడు, అరిస్టాటిల్ రెండే రెండు వాక్యాల్లో అద్భుతంగా చెప్పాడు... ‘ఇష్టపడిన పువ్వును కోయడం మోహం. ఆ పువ్వునిచ్చిన మొక్కకు నీరు పోయడం ప్రేమ’ అని. దూరంగా ఉన్న సంతానం గురించి బాధపడే తల్లిదండ్రుల కోసం బుద్ధ చరిత్రలో గొప్ప కథ ఉంది.
బుద్ధుడి శిష్యుల్లో సారిపుట్ట ప్రథ ముడు. దాదాపు బుద్ధుడంతటి గొప్ప వాడు అనిపించుకున్న అతను, దేవతలకు కూడా నిర్వాణయోగం బోధించేవాడట. అతనికి చిన్న వయసులోనే ప్రాణ సంకట మైన వ్యాధి వచ్చింది. మరణం ఆసన్న మైనదని తెలుసుకుని, బుద్ధుడి దగ్గరకు వెళ్లి... ‘మరణించే ముందు నా తల్లికి క్షమాపణలు చెప్పుకోవాలి, ఆమె అంగీ కారం లేకుండా చిన్న వయసులోనే నేనిక్కడకు వచ్చేశాను’ అని అనుమతి అడిగాడు. బుద్ధుడు అంగీకారం తెలిపాడు.
సారిపుట్ట అసలు పేరు సారిపుత్ర (సారి అనే స్త్రీ కొడుకు). వద్దంటున్నా వినకుండా కొడుకు బౌద్ధారామాల్లో చేరిపోయాడని తల్లికి కోపం. కొడుకు మరణం దగ్గర పడిన సంగతి ఆమెకు తెలీదు. మనసు మార్చుకుని వెనక్కి వస్తున్నాడనుకుని ఆశగా వెళ్లి, అతడింకా సన్యాసి దుస్తుల్లోనే ఉండటం చూసి హతా శురాలవుతుంది. మాట్లాడమని కొడుకు బతిమాలినా వినకుండా వెళ్లిపోతుంది.
మరణం ఆసన్నమవుతుండగా ఒక చిత్రం జరిగింది. అతడు పడుకున్న గదితో పాటు, నగరమంతా ప్రకాశించసాగింది. ఆ వెలుగు చూసి తల్లి అక్కడికి వచ్చించి. ఆ వెలుగుకు కారణం దేవతలు. తమ గురువు ఆఖరి శుభవచనం వినడానికి ఆ గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఆమె చేష్టలుడిగి చూస్తోంది. సాక్షాత్తూ దేవతలు తన కొడుకు ముందు చేతులు జోడించి వరుసలో నిలబడుతున్నారు. అప్పుడే కొడుకు అవసాన దశ గురించి కూడా ఆమెకు అవగతమయ్యింది. తన కోరిక ఎంత స్వార్థమైనదో అర్థమయ్యింది. చేతు లెత్తి నమస్కరించి మంచం పక్కన నేల మీద వాలిపోయిందామె. వారించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు కొడుకు. అతడి కోరిక తీరింది. దేవతలంతా వింటూండగా నాలుగు సత్యాలు (వీటినే బౌద్ధంలో ఫోర్ నోబెల్ ట్రూత్స్ అంటారు) చెబుతూ శరీర బంధ విముక్తుడయ్యాడు. ఆత్మీయులు దూరంగా ఉండటం దుఃఖమే. తల్లిదండ్రులతో, తోబుట్టువు లతో కలిసి ఉండాలని పిల్లలకు మాత్రం ఉండదా! పైకి ఎంత హుషారుగా కన బడినా తమ వాళ్లందరినీ వదిలేసి వెళ్తున్నా మన్న బాధ వారికీ లోలోపల ఉంటుంది. కానీ ఆశయం కోసం త్యాగాలు తప్పవు.
* నేను ఫార్మా-డి చేస్తున్నాను. నాకో మరదలు ఉంది. తనని నేనెంతో ప్రేమిస్తున్నాను. కానీ తను... ఫ్రెండ్స్‌లా ఉందాం, ప్రేమా గీమా వద్దు అంటోంది. తననెలా ఒప్పించాలి?
- శివతేజ, ఊరు రాయలేదు
ఆమె ఎందుకు ఒప్పుకోవడం లేదు? మిమ్మల్ని భర్తగా చూడటం ఇష్టం లేకా? తల్లిదండ్రులు ఒప్పుకోరని భయమా? మొదటిదే కారణం అయితే... మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేని అమ్మాయిని చేసుకుని మీరేం సుఖపడతారు? ఒకవేళ రెండో కారణం అయితే, ఆమె తండ్రి మీ బంధువే కాబట్టి ఆయనతోనే మాట్లాడి ఒప్పించండి. అన్నిటికన్నా ముందు మీరు మీ చదువు పూర్తి చేయండి. ఉద్యోగస్తుడైతే అడిగే అర్హత కూడా మీకు లభిస్తుంది. ఈలోపు మీ శక్తి, ఏకాగ్రత, నిద్రలేని రాత్రుల ఆలోచనలు... అన్నీ చదువు మీదే ఉపయోగించండి తప్ప ఆమెను ఎలా ఒప్పించాలా అని కాదు.
- యండమూరి వీరేంద్రనాథ్