రహస్యంగా పెళ్లాడా... రోజూ బాధపడుతున్నా!
జీవన గమనం
బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాను. ఓ అమ్మాయిని ప్రేమించాను. అనుకోని కారణాల వల్ల రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఎవరిళ్లకు వాళ్లం వెళ్లిపోయాం. నాకు బాగా చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఉంది. కానీ అమ్మానాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానన్న బాధ నన్ను తినేస్తోంది. మరోపక్క ఇంట్లోవాళ్లు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. నన్ను తీసుకెళ్లు, లేదంటే నేను బతకలేను, చచ్చిపోతాను అంటూ తను ఏడుస్తోంది. ఈ టెన్షన్లతో చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఇవన్నీ ఎలా డీల్ చేయాలో చెప్పండి ప్లీజ్.
- ప్రదీప్, ఖమ్మం
చదువుకుంటున్నప్పుడే ప్రేమించడం, పైగా రహస్యంగా పెళ్లి చేసుకోవడం, ఆపై ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవడం... ఇప్పటి వరకూ అన్నీ తప్పులే చేశారు మీరు. ఎలాగూ ఫైనలియర్ కాబట్టి ఇంకో నాలుగైదు నెలల్లో చదువు అయిపోతుంది. అప్పటి వరకూ ఆగమని ఆ అమ్మాయితో చెప్పండి. మీరు చదివిన చదువుకి పెద్ద ఉద్యోగం వస్తుందా అన్నది అనుమానమే. కాబట్టి రిజల్ట్స్ వచ్చేవరకూ ఆగకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయి ఆ అమ్మాయిని తెచ్చుకోండి. నిజానికి ఈ సమస్యకు పరిష్కారం చెప్పడం కష్టం. కానీ మీలాగ చదువుకోవాల్సిన సమయంలోనే పెళ్లి చేసుకుని, చదువు మీద ఏకాగ్రత నిలపకుండా, అటు ఆర్థిక స్తోమత లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకునే విద్యార్థుల కోసమే మీ ఉత్తరాన్ని ప్రచురిస్తున్నాం.
నా వయసు 52. దాదాపు జీవితం అయిపోవచ్చింది. కానీ ఇంతవరకూ నాకు జీవితాన్ని జీవించినట్టే లేదు. చాలా చిన్న వయసులోనే పెళ్లి చేశారు. కళ్లు మూసి తెరిచేలోగా పిల్లలు పుట్టేశారు. వాళ్లను పెంచడంతోనే ఇప్పటివరకూ సరిపోయింది. ఇన్నేళ్లలో నేను నా భర్తతో కూడా సంతోషంగా గడిపింది లేదు. ఆయన రాత్రీపగలూ కష్టపడి డబ్బు సంపాదించడం, నేను కష్టపడి ఇల్లు చక్కబెట్టడం... ఇదే పని. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉందామంటే మా పిల్లలు తమ పిల్లల బాధ్యత మాకే అప్పగిస్తున్నారు.
నేనిప్పటికే చాలా అలసిపోయాను. ఇక ఏ బరువు బాధ్యతలూ మోసే శక్తి నాకు లేదు. ఆ విషయం చెబితే నన్ను స్వార్థపరురాలు అంటారేమోనని భయం. నేనేం చేయాలి?
- వరలక్ష్మి, కోదాడ
మనిషి తాలూకు బాధలు రెండు రకాలు... శారీరకం, మానసికం. మానసికమైన బాధలు చాలా రకాలు ఉంటాయి. భయం, దిగులు, ఆందోళన మొదలైనవి. అయితే వీటన్నిటి కన్నా పెద్ద సమస్య మొహమాటం. మనం మొహమాటంగా ఉండేకొద్దీ సొంత పిల్లలు కూడా తమ బాధ్యతలని మనమీద రుద్దేయడానికి ప్రయత్నిస్తారు. మీరు మీవారితో వివరంగా మాట్లాడి, మీ సమస్యను ఆయనకు చెప్పండి.
ఎవరో ఏదో అనుకుంటారని బతికేకొద్దీ వారు అనుకుంటూనే ఉంటారు. మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మీ జీవితం మీది. అందరూ మిమ్మల్ని స్వార్థపరురాలు అనుకోవడం వల్ల మీకొచ్చే నష్టమేమీ లేదు. మనకి ఇష్టం వచ్చినట్టుగా బతికే స్థాయికి ఎదగాలంటే ఆత్మస్థయిర్యం ఉండాలి. వీలైతే ‘తప్పు చేద్దాం రండి’ అన్న పుస్తకం చదవండి. మొహమాటం తగ్గించుకోవడం ఎలాగో అర్థమవుతుంది.
నేను స్నేహానికి విలువిస్తాను. కానీ మా ఇంట్లోవాళ్లేమో... నువ్వెప్పుడూ సరిగ్గా చదవని వాళ్లతోనే స్నేహం చేస్తావంటూ తిడుతుంటారు. వాళ్ల ప్రభావంతో నేను చదువులో వెనుకబడిపోతానట. ఇప్పటి వరకూ అలా జరగలేదు. నేనెప్పుడూ బాగానే చదువుతాను. అయితే అవతలివాళ్లు బాగా చదువుతారా అన్నది కాకుండా మంచివాళ్లా కాదా అన్నది మాత్రమే చూసి స్నేహం చేస్తాను. నేనిలా ఆలోచించడం కరెక్టేనా? లేక మావాళ్లు అంటున్నది నిజమా? నేనేం చేయాలి? నా స్నేహితుల్ని వదులుకోవాలా?
- పావని, ములుగుర్తి
పూర్తిగా మంచి మనస్తత్వమే ఉన్నవారంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. మంచీ చెడుల మేళవింపే మనిషి. ఎవరూ కోరి కోరి చెడ్డవాళ్లతో స్నేహం చేయరు. చివరికి దొంగతనాలు చేసేవాడు కూడా మరో దొంగతోనే ఎందుకు స్నేహం చేస్తాడంటే, దొంగతనం అనేది చెడు కాదని, బతకడానికి అదొక మార్గమని నమ్ముతాడు కాబట్టి. అయితే ఈ కింది వారితో స్నేహం వల్ల మన సమయం వృథా అవుతుంది.
మాటల అతిసార వ్యాధితో బాధపడే వాళ్లు (Diarrhea of talking), తమ భావాలు మన మీద రుద్దేవారు, వాదనలతో మనల్ని ఒప్పించేందుకు మన సమయాన్ని వృథా చేసేవారు, పుకార్లను విస్తరింపజేయడం ద్వారా గుర్తింపు పొందాలనుకునేవారు, సూడో తెలివి తేటలతో మనపై అధికారాన్ని చెలాయించాలని అనుకునేవారు.
మీ స్నేహితులు బాగా చదువుతారా కాదా అన్నది ముఖ్యం కాదు. వారి ప్రభావం మీమీద ఎంత ఉందన్నదే ముఖ్యం. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు మీ ఫ్రెండ్స్‌లో ఉన్నాయోమో ఒకసారి పరిశీలించుకోండి. దాన్నిబట్టి స్నేహాన్ని కంటిన్యూ చేయండి.
- యండమూరి వీరేంద్రనాథ్