చచ్చిపోతానని బెదిరిస్తోంది... ఏం చేయను?
జీవన గమనం
డిగ్రీ పూర్తి చేశాను. నాకు పాటలు పాడటం ఇష్టం. సినీ రంగంలో ప్రయత్నించాలని ఉంది. కానీ అమ్మ, నాన్న ఒప్పుకోవడం లేదు. వాళ్లు చెప్పిన రంగంలోనే అడుగిడాలని బలవంతం చేస్తున్నారు. నేను దాన్ని ఎంజాయ్ చేయలేనని ఎంత చెప్పినా వినడం లేదు. ఏం చేయాలో తోచక కుమిలిపోతున్నాను. అమ్మానాన్నలకు నా బాధ అర్థమవ్వాలంటే ఏం చేయాలి?
- అక్షర, హైదరాబాద్
ప్రస్తుతం చాలామంది యువతకున్న సమస్య ఇది. మనకు ఒక రంగంలో ఇష్టం ఉంటుంది. తల్లిదండ్రులకేమో మనం ఇంకో పని చేస్తే బాగుంటుందని అని పిస్తుంది. కొంతవరకూ మీ తల్లిదండ్రులు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పాలి. మీ సమస్యకు ఉత్తమమైన పరిష్కారం ముందు మీరు మీ సంపాదనపై నిలబడటం.
జీవితపు ప్రారంభ దశలో మనకిష్టమైన వృత్తిని చేపట్టడం కుదరక పోవచ్చు. మన అభిరుచికి వ్యతిరేకంగా, డబ్బు కోసం, ఇష్టం లేని వృత్తిని చేపట్టాల్సి రావొచ్చు. అప్పుడేం చేయాలంటే... ఆర్థికంగా నిలదొక్కు కోవడం కోసం ముందు మీరు ఒక ఉద్యోగంలో చేరండి. తర్వాత మీకిష్టమైన వృత్తిలోకి మారండి. కానీ మీకిష్టమైన ఆ వృత్తి మీకు జీవితాధారం ఇవ్వగలిగేంత ఆర్థిక వనరుల్ని సమకూర్చేదై ఉండాలి. అలా సమకూర్చే వృత్తి కాకపోతే... బతకడం కోసం మొదటి వృత్తిలోనే కొనసాగి, మరోవైపు మీ అభిరుచిని కొనసాగించండి. అప్పుడు జీవితంలో నిరాకస్తత పోతుంది. ఒకవేళ మీ అభిరుచి ఆర్థికంగా నిలదొక్కు కునే వీలున్నదైతే... కొంతకాలానికి అదే మీ వృత్తి అవుతుంది.
నేనో ప్రభుత్వ ఉద్యోగిని. జనంలో కలిసిపోయి, జనం కోసం పని చేసే ఉద్యోగం నాది. సమస్యలు చెప్పుకోడానికి, సహాయం కోరడానికి చాలామంది ఫోన్ చేస్తారు. వారిలో ఆడవాళ్లూ ఉంటారు. అది నా భార్యకు నచ్చదు. మహిళల దగ్గర్నుంచి ఫోన్‌వస్తే పెద్ద రాద్ధాంతం చేస్తుంది. మొదట్నుంచీ తనకు అనుమానమే. తన గొడవ పడలేక కాలేజీ ఫ్రెండ్‌కి కూడా దూరమైపోయాను. చివరికి బంధువుల్లో ఆడవాళ్లతో మాట్లాడినా తట్టుకోలేదు. ఏమైనా అంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది. పిల్లల కోసమని భరించేకొద్దీ దీనికి అంతం లేకుండా పోతోంది. ఈ నరకం నుంచి నాకు విముక్తి దొరకదా?
- పాండురంగ ప్రసాద్, విజయనగరం
మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారో స్పష్టంగా చెప్పలేదు. ఉద్యోగరీత్యా ఆడవారికి ఏ రకంగా సహాయపడుతూ ఉంటారు? ఫోన్లు ఆఫీసు టైమ్‌లోనే వస్తాయా లేక అర్ధరాత్రి కూడా వస్తుంటాయా? బంధువుల్లో ఆడవారితో భార్య ఈర్ష్య పడేంతగా మాట్లాడాల్సిన అవసరం నిజంగా ఉందా? ఇలా కూడా ఆలోచించవచ్చు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు చూసుకుంటే... కొందరు ఆడవాళ్లు అలానే ఉంటారు. అభ్రదతా భావం, విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్లని నిరంతరం అనుమానం వెంటాడుతూనే ఉంటుంది. ఎంత చెప్పినా వినరు. వాళ్లను బాధపెట్టకుండా సహ జీవనం చేయడం తప్ప వేరే దారి లేదు. వీలయినంత వరకూ ఆఫీసు సమయం లోనే సహాయం చేస్తూ ఉండండి. అదొక్కటే మార్గం.
నేను ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. నా లక్ష్యం ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేయడం. అయితే నాతోపాటు కోచింగ్ తీసుకుంటున్న ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నాడు. పదే పదే డిస్టర్బ్ చేయడంతో కాన్సన్‌ట్రేషన్ తప్పుతోంది. అతణ్ని ఎలా అవాయిడ్ చేయాలో అర్థం కావడం లేదు. నేనెలా అయినా నా లక్ష్యాన్ని సాధించాలి? ఏం చేయాలో సలహా ఇవ్వండి.
- తన్మయి, మెయిల్
ఆ అబ్బాయి మిమ్మల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాడు? నిజంగా మీకు చదువే గమ్యం అయితే ఆ అబ్బాయిని అవాయిడ్ చేయడం అంత కష్టం కాదు. మీ నాన్న గారికి చెప్పండి. లేదంటే మీ ప్రిన్సిపల్‌తో చెప్పండి. అదీ సాధ్యం కాని పక్షంలో మీకు తెలిసిన సర్కిల్‌లో ఎవరైనా పెద్దవారికి చెప్పండి. ఇంటర్ చదివే కుర్రాడిని భయపెట్టి మీ నుంచి దూరం చేయడం అంత కష్టమైన పనేమీ కాదు. కానీ మీ ఉత్తరం చూస్తుంటే, అతణ్ని అవాయిడ్ చేయడం మీకే ఇష్టం లేదేమో అనిపిస్తోంది. అతను మీ వెంట పడుతూ ఉండాలి, మీరు కాదంటూనే ఉండాలి. ఒకవేళ మీ స్థితి ఇలాంటిదయితే మాత్రం మీరు చదువు మీద అస్సలు దృష్టి నిలపలేరు.
- యండమూరి వీరేంద్రనాథ్