Secretly married
-
నటి పూజ రహస్య వివాహం?
నటి పూజ వ్యాపారవేత్తను ఆదివారం రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హల్చల్ చేస్తోంది. తమిళంలో నాన్‌కడవుల్, జేజే, తంబి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన నటి పూజ. ఈమె తల్లి శ్రీలంకకు, తండ్రి కర్ణాటకకు చెందిన వారన్నది గమనార్హం. బెంగళూర్‌లో చదువుకున్న పూజ తమిళం, తెలుగు, మలయాళం, సింహళ భాషల్లో నటించారు. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేని పూజ సింహళ భాషలోనే అడపాదడపా నటిస్తున్నారు. ఈమె శ్రీలంకకు చెందిన వ్యాపారవేత్త, మోడల్ నటుడు అయిన దీపక్ షణ్ముగనాథన్ ప్రేమించికుంటున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అంతే కాదు రెండేళ్ల క్రితమే వీరిద్దరికి వివాహ నిశ్చితార్థం జరిగింది. ఒక దశలో దీపక్, పూజల వివాహం జరిగినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అనంతరం అవి వదంతులేనని పూజ ఖండించారు. అయితే కొంత కాలం సన్నిహితంగా మెలిగిన వీరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు, దీంతో దీపక్‌తో తనకు సరిపడదని భావించిన పూజా ఆయనకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దీపక్, పూజల మధ్య విభేదాలు తొలగి మళ్లీ దగ్గరయ్యారని, వీరిద్దరూ ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలో రహస్య వివాహం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హల్చల్ చేస్తోంది. -
శ్రీమతి ఇలియానా?!
పెళ్లైన ఆడవాళ్లను ‘శ్రీమతి’ అని, కానివాళ్లను ‘కుమారి’ అని సంబోధించడం, గౌరవించడం మన భారతీయ సంప్రదాయం. ఆ లెక్కన ఇలియానాకి పెళ్లి కాలేదు కనుక ‘కుమారి ఇలియానా’ అనడం సబబు. మరి, శ్రీమతి అంటున్నారేంటి అని ఆలోచిస్తున్నారా! ఈ గోవా బ్యూటీకి పెళ్లైందనేది తాజా ఖబర్. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా ప్రేమలో ఉన్నారనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆండ్రూతో తన ప్రేమాయణం బయటకు రాకుండా దాచేయాలని ఇలియానా ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఈ ప్రేమ పక్షులు బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. అటు ముంబై, ఇటు హైదరాబాద్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. గతేడాది డిసెంబర్ లోనే ఆస్ట్రేలియాలో ఆండ్రూ, ఇలియానాల పెళ్లి జరిగిందట. పెళ్లికి హాజరైన అతిథులతో ఎక్కడా తమ పెళ్లి విషయం చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారట. ప్రేమ, శృంగారం వంటి విషయాల గురించి పలు సందర్భాల్లో ఓపెన్‌గా మాట్లాడిన ఇలియానా పెళ్లైన సంగతి ఎందుకు దాచారు? ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లుగా.. పెళ్లి జరగలేదా? -
రహస్యంగా పెళ్లాడా... రోజూ బాధపడుతున్నా!
జీవన గమనం బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాను. ఓ అమ్మాయిని ప్రేమించాను. అనుకోని కారణాల వల్ల రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఎవరిళ్లకు వాళ్లం వెళ్లిపోయాం. నాకు బాగా చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఉంది. కానీ అమ్మానాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానన్న బాధ నన్ను తినేస్తోంది. మరోపక్క ఇంట్లోవాళ్లు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. నన్ను తీసుకెళ్లు, లేదంటే నేను బతకలేను, చచ్చిపోతాను అంటూ తను ఏడుస్తోంది. ఈ టెన్షన్లతో చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఇవన్నీ ఎలా డీల్ చేయాలో చెప్పండి ప్లీజ్. - ప్రదీప్, ఖమ్మం చదువుకుంటున్నప్పుడే ప్రేమించడం, పైగా రహస్యంగా పెళ్లి చేసుకోవడం, ఆపై ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవడం... ఇప్పటి వరకూ అన్నీ తప్పులే చేశారు మీరు. ఎలాగూ ఫైనలియర్ కాబట్టి ఇంకో నాలుగైదు నెలల్లో చదువు అయిపోతుంది. అప్పటి వరకూ ఆగమని ఆ అమ్మాయితో చెప్పండి. మీరు చదివిన చదువుకి పెద్ద ఉద్యోగం వస్తుందా అన్నది అనుమానమే. కాబట్టి రిజల్ట్స్ వచ్చేవరకూ ఆగకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయి ఆ అమ్మాయిని తెచ్చుకోండి. నిజానికి ఈ సమస్యకు పరిష్కారం చెప్పడం కష్టం. కానీ మీలాగ చదువుకోవాల్సిన సమయంలోనే పెళ్లి చేసుకుని, చదువు మీద ఏకాగ్రత నిలపకుండా, అటు ఆర్థిక స్తోమత లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకునే విద్యార్థుల కోసమే మీ ఉత్తరాన్ని ప్రచురిస్తున్నాం. నా వయసు 52. దాదాపు జీవితం అయిపోవచ్చింది. కానీ ఇంతవరకూ నాకు జీవితాన్ని జీవించినట్టే లేదు. చాలా చిన్న వయసులోనే పెళ్లి చేశారు. కళ్లు మూసి తెరిచేలోగా పిల్లలు పుట్టేశారు. వాళ్లను పెంచడంతోనే ఇప్పటివరకూ సరిపోయింది. ఇన్నేళ్లలో నేను నా భర్తతో కూడా సంతోషంగా గడిపింది లేదు. ఆయన రాత్రీపగలూ కష్టపడి డబ్బు సంపాదించడం, నేను కష్టపడి ఇల్లు చక్కబెట్టడం... ఇదే పని. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉందామంటే మా పిల్లలు తమ పిల్లల బాధ్యత మాకే అప్పగిస్తున్నారు. నేనిప్పటికే చాలా అలసిపోయాను. ఇక ఏ బరువు బాధ్యతలూ మోసే శక్తి నాకు లేదు. ఆ విషయం చెబితే నన్ను స్వార్థపరురాలు అంటారేమోనని భయం. నేనేం చేయాలి? - వరలక్ష్మి, కోదాడ మనిషి తాలూకు బాధలు రెండు రకాలు... శారీరకం, మానసికం. మానసికమైన బాధలు చాలా రకాలు ఉంటాయి. భయం, దిగులు, ఆందోళన మొదలైనవి. అయితే వీటన్నిటి కన్నా పెద్ద సమస్య మొహమాటం. మనం మొహమాటంగా ఉండేకొద్దీ సొంత పిల్లలు కూడా తమ బాధ్యతలని మనమీద రుద్దేయడానికి ప్రయత్నిస్తారు. మీరు మీవారితో వివరంగా మాట్లాడి, మీ సమస్యను ఆయనకు చెప్పండి. ఎవరో ఏదో అనుకుంటారని బతికేకొద్దీ వారు అనుకుంటూనే ఉంటారు. మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మీ జీవితం మీది. అందరూ మిమ్మల్ని స్వార్థపరురాలు అనుకోవడం వల్ల మీకొచ్చే నష్టమేమీ లేదు. మనకి ఇష్టం వచ్చినట్టుగా బతికే స్థాయికి ఎదగాలంటే ఆత్మస్థయిర్యం ఉండాలి. వీలైతే ‘తప్పు చేద్దాం రండి’ అన్న పుస్తకం చదవండి. మొహమాటం తగ్గించుకోవడం ఎలాగో అర్థమవుతుంది. నేను స్నేహానికి విలువిస్తాను. కానీ మా ఇంట్లోవాళ్లేమో... నువ్వెప్పుడూ సరిగ్గా చదవని వాళ్లతోనే స్నేహం చేస్తావంటూ తిడుతుంటారు. వాళ్ల ప్రభావంతో నేను చదువులో వెనుకబడిపోతానట. ఇప్పటి వరకూ అలా జరగలేదు. నేనెప్పుడూ బాగానే చదువుతాను. అయితే అవతలివాళ్లు బాగా చదువుతారా అన్నది కాకుండా మంచివాళ్లా కాదా అన్నది మాత్రమే చూసి స్నేహం చేస్తాను. నేనిలా ఆలోచించడం కరెక్టేనా? లేక మావాళ్లు అంటున్నది నిజమా? నేనేం చేయాలి? నా స్నేహితుల్ని వదులుకోవాలా? - పావని, ములుగుర్తి పూర్తిగా మంచి మనస్తత్వమే ఉన్నవారంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. మంచీ చెడుల మేళవింపే మనిషి. ఎవరూ కోరి కోరి చెడ్డవాళ్లతో స్నేహం చేయరు. చివరికి దొంగతనాలు చేసేవాడు కూడా మరో దొంగతోనే ఎందుకు స్నేహం చేస్తాడంటే, దొంగతనం అనేది చెడు కాదని, బతకడానికి అదొక మార్గమని నమ్ముతాడు కాబట్టి. అయితే ఈ కింది వారితో స్నేహం వల్ల మన సమయం వృథా అవుతుంది. మాటల అతిసార వ్యాధితో బాధపడే వాళ్లు (Diarrhea of talking), తమ భావాలు మన మీద రుద్దేవారు, వాదనలతో మనల్ని ఒప్పించేందుకు మన సమయాన్ని వృథా చేసేవారు, పుకార్లను విస్తరింపజేయడం ద్వారా గుర్తింపు పొందాలనుకునేవారు, సూడో తెలివి తేటలతో మనపై అధికారాన్ని చెలాయించాలని అనుకునేవారు. మీ స్నేహితులు బాగా చదువుతారా కాదా అన్నది ముఖ్యం కాదు. వారి ప్రభావం మీమీద ఎంత ఉందన్నదే ముఖ్యం. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు మీ ఫ్రెండ్స్‌లో ఉన్నాయోమో ఒకసారి పరిశీలించుకోండి. దాన్నిబట్టి స్నేహాన్ని కంటిన్యూ చేయండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
పెళ్లయ్యిందంటూ గుసగుసలు
కాయలున్న చెట్టుకే దెబ్బలన్న సామెతగా నటి నయనతార గురించి ఏదో ఒక ప్రచారం తరచూ జరుగుతూనే ఉంది.రెండు సార్లు ప్రేమలో ఓడిపోయిన నయనతార సంచలనాలకు కేంద్రబిందువు కాదని ఎవరూ అనజాలరు. మొదట్లో శింబుతో ప్రేమ కోలీవుడ్‌లో చాలానే కలకలం పుట్టించింది. ఆ ప్రేమ కథ కంచికి చేరడంతో కొన్నాళ్లు సెలైంట్‌గా ఉన్న నయనతార మళ్లీ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వారి మధ్య ప్రేమ పెళ్లి పీటలెక్కడం ఖాయం అనుకున్నారు. అయితే అదీ తొలి ప్రేమ దారే పట్టింది. ఆ తరువాత ప్రేమా లేదు దోమ లేదు ఆ రెండింటికి తన జీవితంలోనే తావు లేదు అంటూ విరక్తిని వ్యక్తం చేసిన ఈ మలయాళీ భామ మరోసారిప్పుడు ప్రేమలో పడ్డట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. ఆమె తాజాగా నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమలో పడ్డట్టు ప్రచారం మొదలై చాలా నెలలే అయ్యింది. దర్శకుడికి నయనతార ఖరీదైన కారును బహుమతిగా కొనిచ్చినట్లు, చెన్నైలో ఒక అందమైన ఇంటిని కొనిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా దర్శకుడు విఘ్నేశ్‌శివను నయనతార రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అదంతా వదంతేనంటూ దర్శకుడు కొట్టి పారేశారు. అలాంటిది సమీపకాలంలో నానుమ్ రౌడీదాన్ చిత్ర విలేకరుల సమావేశంలో కరెక్ట్ చేయడంలో విఘ్నేశ్‌శివ సిద్ధహస్తుడని ఆ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటుడు పార్తీపన్ వ్యాఖ్యానించారు. దీంతో వేదిక మీద ఉన్న చిత్ర యూనిట్‌తో పాటు వేదిక ముందు ఉన్నవాళ్లు గొల్లున నవ్వడం గమనార్హం. కాగా నయనతారతో ప్రేమ, రహస్య వివాహం గురించి దర్శకుడు విఘ్నేశ్‌శివను ప్రశ్నించగా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం అనవసరం అనే భావాన్ని వ్యక్తం చేయడం వారి మధ్య ఏదో ఉందనే సందేహానికి ఆస్కారం కలగక మానదంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.