దేశంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. దీంతో ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ ఆసక్తికర నివేదికను విడుదల చేసింది.
ప్రభుత్వం ఓ వైపు పన్నులు పెంచకపోవడం, మరోవైపు ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్న నేపథ్యంలో సిగరెట్ల అమ్మకాలు (Cigarette sales) పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ (Crisil Ratings) అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సిగరెట్ల డిమాండ్ 7 నుంచి 9 శాతం పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. సిగరెట్ల డిమాండ్ పెరిగితే అందుకు అనుగుణంగా అమ్మకాలు కూడా పెరగనున్నాయి.
కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో సిగరెట్ అమ్మకాలు అమాంతం పెరిగాయి. 2022లో సిగరెట్ అమ్మకాలు అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సారాలతో పోలిస్తే 18 శాతం పెరిగాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషణ ప్రకారం 7 నుంచి 9 శాతం పెరుగుదలను చూడవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగి ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్నును పెంచకపోతే సగటున ఏడాదికి 5 శాతం సిగరెట్ విక్రయాలు పెరిగే అవకాశం ఉంది.
ఆఫీసులో పనికి, సిగరెట్ల అమ్మకాలకు సంబంధమేంటి?
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో పని ఒత్తిడి కారణంగా చాలా మందికి సిగరెట్ అలవాటు ఉంటుంది. ఇక ఐటీ కంపెనీల్లో పనిచేసేవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫీసులో ఉద్యోగులు సిగరెట్ కోసం బ్రేక్ తీసుకోవడం మామూలే. అలా బయటకు వచ్చి రోడ్డు పక్కనున్న టీ స్టాల్స్, బడ్డీ కొట్ల వద్ద చాలా మంది టీలు, సిగరెట్‌లు తాగుతుంటారు. ఆఫీసులకు వచ్చి పనిచేసేవారి సంఖ్య గతేడాది 40 శాతం ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం 65 నుంచి 70 వరకు ఉండవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment