హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మా రి తదనంతరం ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఇంటి నుంచి పని విధానానికి కంపెనీలు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడీపీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒక నివేదికను విడుదల చేసింది. పని విషయంలో అంతర్జాతీయంగా ఉద్యోగుల మనోగతంపై రూపొందిన ఈ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి విధులు నిర్వర్తించాల్సిందేనని కంపెనీలు పట్టుబడితే రాజీనామాకు సిద్ధమని 25–34 ఏళ్ల వయసున్న యువ ఉద్యోగులు తేల్చిచెబుతున్నారట. పూర్తి స్థాయిలో కార్యాలయంలో పని చేయాల్సిందేనని కంపెనీలు ఒత్తిడి చేస్తే 18–24 ఏళ్ల వయసున్న వారిలో 71 శాతం, 25–34 ఏళ్ల వయసున్న ఉద్యోగుల్లో 66 శాతం కొత్త జాబ్ వెతుక్కాంటామని స్పష్టం చేస్తున్నారట. అదే 45–54 ఏళ్ల వయసున్న సిబ్బంది విషయంలో ఇది 56 శాతంగా ఉంది. ప్రతిరోజు ఆఫీస్‌లో పని చేయడానికి తప్పనిసరిగా రావాలని యజమాని (కంపెనీ) షరతు విధిస్తే.. అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో మూడింట రెండు వంతుల మంది (64 శాతం) ఇంటి నుంచే పని కల్పించే జాబ్‌ను వెతుక్కునే యోచనతో ఉన్నారని నివేదిక వెల్లడించింది.
భారత్‌లోనూ అదే తరహా..
విధులు ఎక్కడ నుంచి నిర్వర్తించాలన్న విషయంలో భారతీయ ఉద్యోగులూ ఇంటి నుంచి పనికే మొగ్గుచూపుతున్నారు. ఆఫీస్‌కు రావాల్సిందేనని ఒత్తిడి చేస్తే ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగం నుంచి నిష్క్రమించే ఆలోచనలో ఉన్నట్టు సర్వేలో పాల్గొన్న 76.38 శాతం మంది స్పష్టం చేశారు. ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు తమ బృందాలతో సంపూర్ణ సహకారం కొనసాగించామని 75 శాతం మంది సిబ్బంది భావించారు. అందువల్ల చాలా మంది పూర్తి సమయం కార్యాలయానికి తిరిగి రావడానికి ఇష్టపడడం లేదని నివేదిక వివరించింది. 17 దేశాల నుంచి మొత్తం 32,924 మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో భారత్ నుంచి 1,600 మంది ఉన్నారు. 2021 నవంబర్ 1–24 తేదీల మధ్య ఏడీపీ ఈ సర్వే నిర్వహించింది. ‘లాక్‌డౌన్‌లు సడలించిన తర్వాత కార్మికులను తిరిగి కార్యాలయాలకు రావాలని అడగవచ్చా లేదా బలవంతం చేయవచ్చా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. చాలా మందికి ఇది వారి నిష్క్రమణ నిర్ణయంలో నిర్ణయాత్మక అంశం. కెరీర్ పురోగతి కోసం యువకులు తహతహలాడుతుంటారనే నమ్మకాలకు విరుద్ధంగా సర్వే ఫలితాలు వచ్చాయి’ అని ఏడీపీ ఇండియా ఎండీ రాహుల్ గోయల్ వ్యాఖ్యానించారు.
ఆఫీస్‌లో పనికి ఉద్యోగుల ససేమిరా!
Published Thu, Jun 16 2022 8:47 AM | Last Updated on Thu, Jun 16 2022 10:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment