తూకం తప్పుతోంది | health frobloms and family frobloms in dalily life | Sakshi
Sakshi News home page

తూకం తప్పుతోంది

Published Mon, Dec 12 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

తూకం తప్పుతోంది

తూకం తప్పుతోంది

‘‘నాన్నా...’’
రాత్రి పొద్దుపోయాక వచ్చిన ప్రసాద్‌ను ఆప్యాయంగా పలకరించింది పదేళ్ళ చిన్నారి రమ్య.
ప్రసాద్‌ ముఖంలో జీవం లేని చిరునవ్వు! ఓపిక లేకనో ఏమో, కూతుర్ని దగ్గరకు తీసుకోను కూడా లేదు.  బూట్లు, సాక్సులు విప్పేసి, అలసటగా హాలులో నుంచి తన పర్సనల్‌ బెడ్‌రూమ్‌ వైపు వెళ్ళిపోయాడు.
రమ్య ముఖం చిన్నబోయింది. ఆ మనసులో తెలియని బెంగ.

రోజూ పొద్దున్న 6.30 కల్లా తాను స్కూలుకు వెళ్ళేటప్పుడు నిద్ర లేవని నాన్న... ఇంట్లో అమ్మ, తను నిద్రపోయాక, రాత్రి పొద్దుపోయి ఆఫీసు నుంచి వచ్చే నాన్న... ఎప్పుడూ ఆఫీసు పనిలో మునిగి తేలుతూ, ఇంటి ధ్యాస పట్టని నాన్న... అప్పటికి అయిదారురోజులుగా నాన్నను చూడలేదనే బెంగ. ఆ రోజు ఎలాగైనా చూడాలనే... అమ్మ వద్దన్నా అంతసేపు మెలకువగా ఉంది. కానీ... నాన్న... ఇలా....
బెంగుళూరులో ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో పనిచేస్తున్న ప్రసాద్‌కు కూతురంటే ప్రేమే! కానీ, రోజూ ఏదో ఒక ఆఫీసు పని. ఉన్న ఓపికంతా ఆఫీసులోనే హరీ. ఇంటికొచ్చినా, ఏవో ఆఫీసు ఫోన్లు... మొబైల్,  మెసేజ్‌లు... మెయిల్స్‌... ఇంటికీ, ఆఫీసు పనికీ మధ్య ప్రసాద్‌ సమతూకం పాటించలేకపోతున్నాడు. ఈ రకమైన ప్రవర్తన ప్రసాద్‌ కుటుంబ సభ్యులకే కాదు... చివరకు ప్రసాద్‌కే తన మీద తనకు చీకాకు అనిపిస్తోంది.

ఇండియాలో పెరుగుతున్న సమస్య!
ఒక్క ప్రసాదే కాదు... ఇవాళ చాలామంది ఎదుర్కొంటున్న సమస్య – ఇంటి పని, ఆఫీసు పని మధ్య బ్యాలెన్స్‌ చేసుకోలేకపోవడం! ప్రపంచం మొత్తం మీద చూస్తే, భారతదేశంలోనే వారంలో ఎక్కువ రోజులు ఉద్యోగులు పని చేస్తారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ పెరిగిపోవడంతో, ఇంటర్‌నెట్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు... ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా... ఆఫీసుకూ, ఆఫీసు పనికీ అందుబాటులో ఉన్నట్లే. అలా ఆఫీసు పనికీ, తీరిక వేళలకూ మధ్య గీత క్రమంగా చెరిగిపోతోంది.

గడచిన అయిదారేళ్ళుగా ఇలా ఆఫీసు పనితో తల మునకలై, ఇంటిని అశ్రద్ధ చేస్తున్నవారి సంఖ్య మన దేశంలో గణనీయంగా పెరుగుతున్నట్లు ప్రసిద్ధ ‘ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌’ (ఇ.వై) సంస్థ వారి సర్వేలో తేలింది. ‘వర్క్‌ – లైఫ్‌ బ్యాలెన్స్‌’ గురించి భారతదేశంతో సహా ఎనిమిది దేశాల్లో ఆ సంస్థ గత ఏడాది సర్వే చేసింది. ఒకపక్క ఆఫీసు పనినీ, ఇటు కుటుంబ, వ్యక్తిగత బాధ్యతలనూ – రెండిటినీ సమతూకం చేసుకుంటూ ముందుకు సాగడం చాలా కష్టంగా మారినట్లు 30 శాతం భారతీయులు చెప్పారు.

సెలవులున్నాయ్‌! వాడుకొనే తీరిక లేదు!!   
ఇటీవలి కాలంలో ‘మీ పని టైమింగ్స్‌ ఏమిటి?’ అని ఎవరినైనా అడిగి చూడండి. ఒక నవ్వు నవ్వేసి, ‘ఆల్‌వేస్‌ ఆన్‌ డ్యూటీ’ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో జరిపిన సర్వేలో తేలింది ఏమిటంటే... ఉద్యోగుల్లో సగటున సుమారు 10 శాతం మంది సెలవుల్లో కూడా రోజూ ‘ఒకటికి పది సార్లు’ ఇ–మెయిల్‌ చెక్‌ చేసుకుంటూ ఉంటారట! ఆ మేరకు అందరూ పని ఒత్తిడిని అనుభవిస్తున్నారన్న మాట!
అధికారికంగా మంజూరైన సెలవులు వాడుకోవడం కూడా చాలా దేశాల్లో తక్కువే. ఆస్ట్రియా, బ్రెజిల్, ఫిన్లాండ్, ఫ్రాన్స్‌ లాంటి దేశాలు ఇచ్చిన సెలవులన్నీ వాడేసుకుంటున్నారు కానీ, మన దేశంలో మాత్రం సగటున 21 రోజుల సెలవులిస్తే, 15 రోజులే వాడుకోగలుగుతున్నారు. జపాన్‌లో అయితే, సగటున 20 రోజుల సెలవులిస్తే, 10 రోజులే వాడుకుంటున్నారు.

ప్రపంచస్థాయిలో పూర్‌ ర్యాంక్‌
భారతదేశంలో దుకాణాల్లో పని చేసేవారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉన్నట్లు తేలింది. వ్యక్తిగత జీవితాన్ని తాకట్టుపెట్టి మరీ ఆఫీసుల్లో అధిక గంటలు పనిచేసే దుఃస్థితి. ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఒక కన్సల్టెన్సీ సంస్థ ప్రపంచంలోని 100 ప్రధాన నగరాల్లో ఇటీవల ఒక సర్వే జరిపింది. అప్పుడు మనదేశంలోని 5 ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబయ్, ఢిల్లీలు వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌లో అతి తక్కువ ర్యాంకుల్లో ఉన్నట్లు తేలింది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతాల ర్యాంకులు 70లలో ఉంటే, ముంబయ్‌ 86వ ర్యాంకులో, ఢిల్లీ 87వ ర్యాంకులో నిలిచాయి. వర్క్‌ – లైఫ్‌ బ్యాలెన్స్‌ను లెక్క కట్టడం కోసం ఆ సంస్థ ప్రతి నగరంలో సగటు వార్షిక పని గంటల లెక్క తీసింది. దాన్ని బట్టి ఈ అంశంలో అగ్రశ్రేణి మూడు నగరాల్లో ఒకటిగా నిలిచిన హ్యామ్‌బర్గ్‌లో సగటున ఏటా 1,473 గంటలే పనిచేస్తారు. కానీ, భారతీయులు సగటున ఏటా 2,195 గంటలు పనిచేస్తున్నారు.  

ఆడాళ్ళూ... మీకు జోహార్లు!
మన దేశంలో ఉద్యోగినులు అటు గృహిణిగా తమ బాధ్యతలు తగ్గకుండానే, ఇటు ఆఫీసు పనిలో ఎక్కువ గంటలు వెచ్చిస్తూ, విపరీతమైన ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తోంది. అలా వర్క్‌ – లైఫ్‌ బ్యాలెన్స్‌ తప్పుతోంది.
చెన్నై శివార్లలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అపర్ణ సమస్యా  ఇలాంటిదే. ఒకపక్క ఏడేళ్ళ బాబు ఆలనాపాలన, మరోపక్క ఉద్యోగం. ఇంటి సంగతి పట్టకుండా ప్రైవేట్‌ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి సతమతమయ్యే భర్త. బాబు పుట్టాక కొద్దిరోజులు విజయవాడలోని పుట్టింటి నుంచి అమ్మానాన్న వచ్చి, ఆమెకు కొంత సాయపడ్డారు. ఆ తరువాత వాళ్ళు తప్పనిసరై విజయవాడకు వెళ్ళిపోవాల్సి రావడంతో, అపర్ణ ఇప్పుడు బాబు సంరక్షణ కోసం ఇంట్లోనే ఉండే ఆయాను పెట్టుకోవాల్సి వచ్చింది. దానికి తోడు కంపెనీకి బిజినెస్‌ క్లయింట్స్‌ ఉన్న అమెరికా లాంటి ఇతర టైమ్‌ జోన్‌లతో సమన్వయం చేసుకుంటూ, పని చేయాల్సి రావడంతో జీవితం నరకంగా మారుతోంది.

ఆఫీసు పని – ఇంటి బాధ్యతల మధ్య నలిగిపోతున్న ఉద్యోగుల ఒత్తిడిని క్రమంగా సంస్థలు కూడా అర్థం చేసుకుంటున్నాయి. హిందుస్తాన్‌ లీవర్, ఇన్ఫోసిస్, జి.ఇ. లాంటి వివిధ రంగాల్లోని ప్రముఖ సంస్థలు పని గంటల విషయంలో వెసులుబాటు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇంటి నుంచే ఆఫీసు పని చేసే ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ లాంటి అవకాశాలిస్తున్నాయి. ఆఫీసు దగ్గర చైల్డ్‌ కేర్‌ లాంటి వసతులు కల్పిస్తున్నాయి. అలాగే, బిడ్డ పుట్టినప్పుడు మగవాళ్ళకు ఇచ్చే ‘పెటర్నిటీ లీవ్‌’, ఆడవారికి ఇచ్చే ‘మెటర్నిటీ లీవ్‌’లను కూడా మునుపటి కన్నా పెంచాయి.
    
అంతా మన చేతుల్లోనే!
నిజానికి పని ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా... దాన్నీ, కుటుంబ బాధ్యతల్నీ బ్యాలెన్స్‌ చేసుకోవడం మన చేతుల్లోనే చాలా భాగం ఉందని నిపుణుల మాట. పెరిగిపోయిన సాంకేతిక, సమాచార సాధనాలు కూడా తెలియని ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇవాళ స్మార్ట్‌ఫోనే మాట్లాడడానికీ, మెయిల్స్‌కూ, వాట్సప్‌కూ – అన్నిటికీ మార్గం కావడంతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు అధ్యయనవేత్తలు తేల్చారు. మొబైల్‌ ఫోన్లను అతిగా వాడితే తెలియకుండానే డిప్రెషన్‌లోకి జారిపోతామని అమెరికాలోని నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీ వారు జరిపిన పరిశోధనలో తేలింది. కాబట్టి, రోజూ కనీసం గంట సేపైనా ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేస్తే మంచిది. అలాగే, మనకు ఇష్టమైన వ్యాపకం ఏదైనా పెట్టుకొని, పని దినాల్లోనే వారంలో ఏదో ఒక రోజున దానికి కాస్తంత టైమ్‌ కేటాయించాలి.

ఇక, మనదేశంలో వర్కింగ్‌ జనాభాలో దాదాపు 26 శాతం మంది ప్రతి రోజూ గంటన్నర పైగా టైమ్‌ ఉద్యోగాలకు ప్రయాణం చేయడంలోనే గడిపేస్తున్నారని ఒక లెక్క. కాబట్టి, ఆఫీసుకు కాస్తంత దగ్గరగా ఇల్లు అద్దెకు తీసుకొని ఉండడం మంచిదని నిపుణుల సలహా. ఆఫీసుకు వెళ్ళి, వచ్చే ప్రయాణసమయాన్ని తగ్గించుకోగలిగితే, ఆ మిగిలిన టైమ్‌ని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు. మీతో మీరు గడపడానికీ, మీ కుటుంబంతో గడపడానికీ వీలుంటుంది. అలా మానసికంగా ఉల్లాసంగా ఉంటేనే... ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మన చుట్టూ వాతావరణం బాగుంటుంది. సామర్థ్యం పెరుగుతుంది. వ్యక్తిగత బాధ్యతలైనా, ఆఫీసు బాధ్యతలైనా సంతృప్తిగా చేయగలుగుతాం. సో... లెటజ్‌ ట్రై టు బి మోర్‌ బ్యాలెన్స్‌›్డ!

అద్భుతమైన అరగంట టెక్నిక్‌
ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా సామర్థ్యం పెరగాలంటే, దానికి నిపుణులు ఒక టెక్నిక్‌ చెప్పారు. ప్రతి పనికీ అరగంటేసి వంతున టైమ్‌ కేటాయించాలి. ఏ పని మీద అయినా 25 నిమిషాల చొప్పున ఏకాగ్రతతో దృష్టి పెడితే, ఎఫెక్టివ్‌గా ఉంటుందని నిపుణుల మాట. 25 నిమిషాలు కాగానే, 5 నిమిషాలు బ్రేక్‌ తీసుకోవాలి. దీని వల్ల పనిచేస్తూనే, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకొని, పుంజుకున్నట్లు అవుతుంది. ఆ తరువాత చేసే అరగంట పనికి కొత్త శక్తి వస్తుంది. అయితే, మధ్యలో విరామం అయిదు నిమిషాలు మించి, పక్కవాళ్ళతో పూర్తిగా ముచ్చట్లలో పడిపోతే లాభం లేదు. టైమ్‌ మేనేజ్‌మెంట్‌లో ‘పొమొడోరో టెక్నిక్‌’గా పేర్కొనే ఈ అరగంటేసి పనుల టెక్నిక్‌ చాలా ఎఫెక్టివ్‌ అని ప్రపంచంలో చాలామంది అంగీకరించారు. దీని వల్ల పనీ అవుతుంది. పని కాలేదనే ఒత్తిడీ తగ్గుతుంది. ఇంటి పనికీ, ఆఫీసు పనికీ మధ్య బ్యాలెన్స్‌ కుదురుతుంది.

ఇక... వర్క్‌ ఫ్రమ్‌ ట్రాఫిక్కే!
వర్క్‌ – లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసుకోలేకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి – ట్రాఫిక్‌. ఈ మాట సశాస్త్రీయంగా నిపుణులు తేల్చిన సంగతి. మన దేశంలోని నగరాలు ఇప్పటికే జనంతో కిక్కిరిసి ఉన్నాయి. వచ్చే 2050 నాటి కల్లా ఈ నగర జనాభా మరో 30 కోట్లు పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. మన సిటీల్లో ఇప్పటికే రవాణా సౌకర్యాలు అంతంత మాత్రం. ఇంకా జనాభా పెరిగితే ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు! ఉదాహరణకు, ముంబయ్‌ పరిసరాల్లో ఇప్పటికే చాలామంది ఉద్యోగులు ఆఫీసుకు వెళ్ళి రావడానికే రోజూ ఎనిమిదేసి గంటలు పడుతోంది. ఇక, ‘భారతదేశపు సిలికాన్‌ వ్యాలీ’గా పేరున్న బెంగళూరులో ట్రాఫిక్‌ ఇప్పటికే ఎంత దారుణంగా ఉందంటే, ఉద్యోగుల జీవితంలో ప్రతి రోజూ సగటున రెండేసి గంటలు ట్రాఫిక్‌లో ప్రయాణానికే సరిపోతోంది.

అంటే, ప్రతి ఉద్యోగీ ఏటా 470 గంటలు ఈ రద్దీ ప్రయాణాల్లోనే గడిపేస్తున్నారన్నమాట! ఇప్పుడిక ‘వర్క్‌ ఫ్రమ్‌ ట్రాఫిక్‌’ అనే ఆప్షన్‌ వస్తుందని ఆ మధ్య ఒక జోక్‌ ప్రచారంలోకి వచ్చింది. ఆ మాటకొస్తే, ట్రాఫిక్‌లో ఇరుక్కున సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు క్యాబ్‌లో కూర్చొనే ల్యాప్‌టాప్‌ మీద పనిచేస్తున్న సంఘటనలు ఇప్పటికే చూస్తున్నాం కదా! ట్రాఫిక్‌తో ఆఫీసు పని మొదలవడమే ఆలస్యమవుతుంటే, సాయంకాలం సుదీర్ఘంగా సాగే మీటింగ్‌లతో పని ఆలస్యం కావడం, ఇంటికి ఆలస్యంగా చేరడం షరా మామూలే!

ఇలా చేస్తే... అంతా బ్యాలెన్స్‌!
 వర్క్‌ – లైఫ్‌ బ్యాలెన్స్‌ కుదరాలంటే... కొన్ని మార్గాలు ఇవీ...
ఇష్టమైన వ్యాపకం ఏదైనా పెట్టుకొని, దానికి కాస్తంత టైమ్‌ కేటాయిస్తే, మానసికంగా ఉత్సాహం వస్తుంది. అది ఇల్లు, ఆఫీసు మధ్య సమతూకానికి సాయపడుతుంది
ఉద్యోగంలో పై స్థాయికి వెళుతున్న కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి, కష్టపడి పనిచేయడంతో పాటు, సులువుగా, చులాగ్గా ఎలా పనిచేయాలన్నది నేర్చుకోవడం చాలా ముఖ్యం
ప్రతి రోజూ ఉదయం లేవగానే ఆ రోజు ఆఫీసులో, ఇంట్లో చేయాల్సిన పనులేమిటో జాబితా రాసుకోండి. వాటిలో ఏది యమ అర్జెంట్, ఏది అర్జెంట్, ఏది ముఖ్యమైనది, ఏది తాపీగా చేయవచ్చో చూసుకొని, ప్రాధాన్యాల ప్రకారం పని చేయండి. ఈ పద్ధతిని అనుసరిస్తే, ముఖ్యమైన పనులేవీ ఆగవు. అవి ఇంకా కాలేదే అన్న మానసిక ఒత్తిడి ఉండదు
వారానికి కనీసం రెండు సార్లయినా ఆఫీసుకు డ్యూటీ కన్నా ఒక అరగంట ముందే వెళ్ళండి. ప్రశాంతంగా ఆలోచించి, ఆనాటి రెగ్యులర్‌ వర్క్‌ మొదలవడాని కన్నా ముందే కీలకమైన ఇ–మెయిల్స్‌ వగైరా చూసి, సమాధానాలివ్వండి
ఆఫీసులో పని చేసే టైమ్‌లో దాని మీదే ఏకాగ్ర దృష్టి పెట్టండి. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్‌లు తీసుకుంటూ, ఆఫీసు టైమ్‌లోనే పని మొత్తం పూర్తయ్యేలా చూసుకోవాలి. మధ్యలో ముచ్చట్లు పెట్టుకొని, డ్యూటీ టైమ్‌ అయిపోయాక పనిచేయడం, ఎక్కువ సేపు పనిచేస్తున్నామని ఆ తర్వాత వాపోవడం లాంటివి శుద్ధ వేస్ట్‌
సెలవు రోజుల్లో ఆఫీసు మెయిల్స్, స్మార్ట్‌ఫోన్లలో ఛాటింగ్‌లకు దూరంగా ఉండాలి. దానివల్ల ఇంట్లో వాళ్ళతో క్వాలిటీ టైమ్‌ గడపగలుగుతాం.

ఒళ్ళు బాగుంటే... ఇల్లు బాగుంటుంది!
శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే, ఇంట్లోనూ, ఆఫీసులోనూ ఉత్సాహంగా ఉంటామని గ్రహించాలి. అందుకు ప్రతిరోజూ పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. అదీ టైమ్‌కి తినాలి
రోజూ రాత్రి పూట కనీసం 7 గంటలు బాగా నిద్ర పోవాలి. గాఢమైన నిద్ర అలసిపోయిన శరీరానికీ, మనస్సుకూ మంచి టానిక్‌
రోజూ వ్యాయామం చేయాలి. జిమ్‌కు వెళ్ళడం కుదరకపోతే, కనీసం వాకింగ్‌ అయినా చేయాలి. వాకింగ్‌ వల్ల మానసిక ఆందోళన స్థాయి తగ్గుతుంది
వారానికి కనీసం నాలుగు రోజులైనా, ప్రతిసారీ కనీసం ముప్పావు గంట వంతున యోగా, ధ్యానం లాంటివి చేయాలి. ప్రాణాయామం కూడా చాలా మంచిది. వీటివల్ల శారీరకంగా, మానసికంగా ఉత్తేజం కలుగుతుంది
స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌లో మరో ముఖ్యమైన విషయం – మనకు బాగా ఆప్తులైన మిత్రుల్నీ, చుట్టాల్నీ కలవడం, అడపాదడపా ఫోన్‌లో మాట్లాడడం. అలా మీ మనసులోని భావాలు మరొకరితో పంచుకోవడం వల్ల భారం తగ్గుతుంది. అయితే, అది మరీ అతిగా ఆధారపడడంగా మారిపోకూడదు
మనకు మనం అందంగా, ఆహ్లాదంగా కనిపించడం కూడా ముఖ్యం. అందుకని, అడపాదడపా ఫేషియల్స్, మసాజ్‌ల లాంటివి చేయించుకోవాలి. ఇనుమడించిన అందంతో, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయని గమనించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement