న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి థర్డ్‌వేవ్ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. అధిక సంఖ్యలో జనాలు కోవిడ్ బారిన పడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలో వీకెండ్ లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అలాగే ప్రస్తుతం 50శాతం సామర్థ్యంతో నడుస్తున్న బార్లు, రెస్టారెంట్లు సోమవారం మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒక జోన్‌లో రోజుకు ఒకే మార్కెట్‌కు అనుమతి ఇచ్చింది.
చదవండి: థర్డ్‌వేవ్ ప్రారంభమైంది.. జనవరి చివరి నాటికి..
తాజాగా కరోనా పాజిటివిటీ రేటు 23శాతానికి పెరిగిన నేపథ్యంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని ఢిల్లీవిపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులందరికీ వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల నుంచి ప్రైవేటు బ్యాంకులు, అత్యవసర సేవలు అందించే కార్యాలయాలు, బీమా కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, లాయర్లు కార్యాలయాలు, కొరియర్ సేవలకు మినహయింపు ఇచ్చింది. ఈ మేరకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీడీఏంఏ ఈ నిర్ణయం తీసుకుంది.
చదవండి: పాజిటివ్ వ్యక్తుల్లో ధైర్యం నింపేందుకు.. ఢిల్లీ సర్కార్ వినూత్న కార్యక్రమం
మరోవైపు ఢిల్లీలో లాక్‌డౌన్ ఉండబోదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అదే విధఃగా దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఢిల్లీ వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ‘ఎవరూ ఏం మాట్లాడటం లేదు. పాజిటివిటీ రేటు 25శాతం పెరిగింది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని తెలిపారు. పబ్లిక్‌ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని సూచించారు. ప్రస్తుత సమయంలో తీసుకునే జాగ్రత్తలను బట్టి ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం ఉండబోదని, అమలు చేస్తున్న ఆంక్షలన్నింటినీ పరిస్థితులు అదుపులోకి వచ్చాక తీసేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment