న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీలో కరోనా పడగ విప్పడంతో ప్రైవేటు కార్యాలయాన్ని మూసివేశారు. అత్యవసర ఆఫీసులు మినహాయించి అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) మంగళవారం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ప్రైవేటు ఆఫీసుల్లో 50% సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సిబ్బంది అందరికీ ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పించాలంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 23 శాతం దాటింది.
దేశంలో గత 24 గంటల్లో 1,68,063 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64% ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 8.85 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల విజృంభణతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ పరిస్థితులని సమీక్షించడానికి గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో ఈసారి మకర సంక్రాంతికి గంగానది జలాల్లో పుణ్య స్నానాలు ఆచరించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది.
లతా మంగేష్కర్‌కు కరోనా
ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌కు (92) కరోనా సోకింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బంధువులు చెప్పారు. ‘లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ లత‡ వయసును (92 ఏళ్లు) దృష్టిలో ఉంచుకొని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలని వైద్యులు మాకు సూచించారు’ అని ఆమె మేనకోడలు రచన చెప్పారు. లత కోలుకోవడానికి వారం రోజులు పడుతుందని వైద్యులు చెప్పినట్టుగా రచన తెలిపారు. లత కరోనా మొదటి వేవ్‌లోనూ వైరస్ బారినపడి కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment