
ట్రామాలో బాధితురాలు!
కోల్‌కతా: దేశాన్ని కుదిపేసిన ఆర్‌జీ కర్ ఆస్పత్రి హత్యాచార బాధితురాలైన ట్రెయినీ వైద్యురాలు ఆ ఘటనకు ముందు నుంచే తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడినట్టు మోహిత్ రణ్‌దీప్ అనే సైకియాట్రిస్టు తెలిపారు. ఆస్పత్రిలో జరిగే అవకతవకలతో పాటు సుదీర్ఘ పనివేళలు, షిఫ్టుల కేటాయింపులో వివక్ష వంటివి ఆమెను తీవ్ర ఇబ్బందులకు, ఒత్తిళ్లకు లోను చేసినట్టు వివరించారు.
ఆయన సోమవారం ఒక బెంగాలీ టీవీ చానల్‌తో మాట్లాడారు. ‘‘హత్యాచారోదంతానికి నెల ముందు ఆమె నన్ను సంప్రదించింది. ఒక్కోసారి వరుసగా 36 గంటలపాటు డ్యూటీ చేయాల్సి వచ్చేదని వాపోయింది. అందరికీ అలాగే వేస్తారా అని అడిగితే లేదని చెప్పింది. వీటికితోడు ఆస్పత్రికి అవసరమయ్యే వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలులో భారీ అవకతవకలు ఆమెను ఎంతగానో కలతకు గురిచేశాయి. తనకు పలు సలహాలిచ్చా.
ఆమె మరోసారి కౌన్సెలింగ్‌కు రావాల్సి ఉండగా ఆలోపే ఘోరానికి బలైపోయింది’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఇందుకు సంబంధించి సీబీఐ ముందు వాంగ్మూలమిచ్చేందుకు కూడా సిద్ధమన్నారు. గత ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లోనే ఆమె అత్యాచారానికి, హత్యకు గురవడం తెలిసిందే. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే పౌర వలెంటీర్‌ను దోషిగా కోర్టు నిర్ధారిస్తూ అతనికి జీవితఖైదు విధించింది. ఈ ఘోరం వెనక పలువురు పెద్దల హస్తముందని బాధితురాలి తల్లిదండ్రులు, తోటి వైద్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో అవకతవకల్ని ప్రశ్నించినందుకే ఆమెపై కక్ష కట్టినట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment