ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
కర్నూలు : ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆకే రవిక్రిష్ణ సబ్ డివిజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ శివకోటి బాబురావుతో కలిసి మంగళవారం సాయంత్రం పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నేరాలపై డీఎస్పీలతో సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన రీచ్‌ల నుంచి కాకుండా ఇతర ఏ ప్రాంతాల నుంచి ఇసుక తరలించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఇందుకోసం నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.
అలాగే డ్రంకెన్ డ్రైవ్‌ను కూడా మరింత కట్టుదిట్టంగా నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని కట్టడి చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌పై ట్రాఫిక్ డీఎస్పీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మూడున్నర నుంచి నాలుగున్నర వరకు గంటపాటు సమావేశం జరిగింది. జిల్లాలో నమోదైన ముఖ్యమైన కేసుల పురోగతితో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ దర్యాప్తు పురోగతి గురించి చర్చించారు.
ఆదోని సబ్ డివిజనల్ పరిధిలోని గ్రామాల్లో చౌక డిపోల వల్ల పెరుగుతున్న గ్రామ కక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి చర్చించారు. ఇటీవల జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న దారిదోపిడీల గురించి కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. నిర్దేశించిన కాల వ్యవధిలోనే దొంగలు, దోపిడీదారులను పట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
రౌడీ షీటర్లు, ఇతర సస్పెక్ట్ షీటులు ఉన్న వారి పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని, అందుకు అవసరమైన కసరత్తు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏఎస్పీ శశికుమార్, డీఎస్పీలు డివి.రమణమూర్తి, బాబు ప్రసాద్, వీరరాఘవరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, హుసేన్‌పీరా, బీఆర్.శ్రీనివాసులు, పీఎన్.బాబు, రామచంద్ర, ఏజి.క్రిష్ణమూర్తి, వై.హరినాథరెడ్డి, వివి.నాయుడు, కె.సుప్రజ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.