SP AK Ravikrishna
-
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు
కర్నూలు : శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆకే రవికృష్ణ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సబ్ డివిజన్ల వారీగా డీఎస్పీలు, సీఐలతో సమీక్షించారు. నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలన్నారు. మట్కా, బెట్టింగ్, పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆదోనిలో మట్కా జోరుగా సాగుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలుసుకుని ఆదోని డీఎస్పీతో పాటు సీఐల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. మట్కా మహమ్మారిపై జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించాలని ఆదేశించారు. మట్కా నిర్వాహకులతో అధికారులకు సంబంధాలు ఉన్నట్లు వెలుగు చూస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ కేసులను ఆరా తీసి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీలు వారి పరిధిలోని కేసులపై శ్రద్ధ వహించాలన్నారు. మట్కా నిర్వాహకులను జిల్లా నుంచి తరిమివేయాలని సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు రాయచూరు, బళ్లారి ప్రాంతాలకు వెళ్లి మట్కా నిర్వహిస్తున్నవారిని, వారిని నియంత్రించడానికి కర్ణాటక పోలీసు అధికారులతో చర్చించాలని ఆదోనిడీఎస్పీని ఆదేశించారు. దోపిడీలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలపై ఆరు నెలలకొకసారి సీఐలతో సమావేశాలు నిర్వహించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీలకు సూచించారు. మతకలహాలు జరిగే ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లా కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మసలుకోవాలని సూచించారు. రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, తరచూ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. నంద్యాలలో ఒక హత్య కేసు ఛేదించినందుకు గాను డాగ్ స్క్వాడ్ హ్యాండ్లర్కు రివార్డు ప్రకటించారు. మాధవరం ఎస్ఐ వ్యక్తిత్వం మార్చుకోవాలని హెచ్చరించి ఆయన పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో నష్టపోతావని డోన్ పట్టణ ఎస్ఐ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సరిహద్దులో వాహనాలు లేని పోలీస్స్టేషన్లకు వాటిని సమకూరుస్తున్నట్లు చెప్పారు. కొంతకాలంగా జిల్లాలో లారీల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జలదుర్గం, జిల్లెల వంటి గ్రామాల్లో అంటరానితనాన్ని పూర్తిగా రూపు మాపాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సెల్‌ను ఇంకా అభివృద్ధి చేసుకొని పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆళ్లగడ్డ ఏఎస్పీ శేషుకుమార్, డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, పి.ఎన్.బాబు, ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, బి.ఆర్.శ్రీనివాసులు, వి.వి.నాయుడు, హరినాథరెడ్డి, దేవదానం, మురళీధర్, వినోద్‌కుమార్, సుప్రజతో పాటు సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
కర్నూలు : ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆకే రవిక్రిష్ణ సబ్ డివిజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ శివకోటి బాబురావుతో కలిసి మంగళవారం సాయంత్రం పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నేరాలపై డీఎస్పీలతో సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన రీచ్‌ల నుంచి కాకుండా ఇతర ఏ ప్రాంతాల నుంచి ఇసుక తరలించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఇందుకోసం నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్‌ను కూడా మరింత కట్టుదిట్టంగా నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని కట్టడి చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌పై ట్రాఫిక్ డీఎస్పీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మూడున్నర నుంచి నాలుగున్నర వరకు గంటపాటు సమావేశం జరిగింది. జిల్లాలో నమోదైన ముఖ్యమైన కేసుల పురోగతితో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ దర్యాప్తు పురోగతి గురించి చర్చించారు. ఆదోని సబ్ డివిజనల్ పరిధిలోని గ్రామాల్లో చౌక డిపోల వల్ల పెరుగుతున్న గ్రామ కక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి చర్చించారు. ఇటీవల జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న దారిదోపిడీల గురించి కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. నిర్దేశించిన కాల వ్యవధిలోనే దొంగలు, దోపిడీదారులను పట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రౌడీ షీటర్లు, ఇతర సస్పెక్ట్ షీటులు ఉన్న వారి పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని, అందుకు అవసరమైన కసరత్తు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏఎస్పీ శశికుమార్, డీఎస్పీలు డివి.రమణమూర్తి, బాబు ప్రసాద్, వీరరాఘవరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, హుసేన్‌పీరా, బీఆర్.శ్రీనివాసులు, పీఎన్.బాబు, రామచంద్ర, ఏజి.క్రిష్ణమూర్తి, వై.హరినాథరెడ్డి, వివి.నాయుడు, కె.సుప్రజ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
నేర దర్యాప్తు ఇక వేగవంతం
కర్నూలు: జిల్లా కేంద్రంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) బలోపేతానికి ప్రణాళిక సిద్ధమయ్యింది. జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని సీసీఎస్ బలోపేతమే పరిష్కార మార్గంగా ఎస్పీ ఆకే రవిక్రిష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు ఈ మేరకు ప్రతిపాదనలు చేరాయి. సీసీఎస్‌కు అవసరమైతే క్లూస్ టీమ్‌లను కూడా అటాచ్ చేసే ఆలోచనలో ఉన్నారు. నేరం జరిగిన వెంటనే అప్రమత్తమై త్వరితగతిన నిందితులను పట్టుకునేలా చర్యలు ఉండాలని భావిస్తున్నారు. దీంతో శాంతి భద్రతల విభాగంలో పనిచేసే సిబ్బందిపై ఒత్తిడి తగ్గడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రణాళికను రూపొందించారు. ప్రస్తుతం సీసీఎస్‌లో ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు ఉన్నారు. వీరికి సహాయ సహకారాలు అందించేందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో చోరీల దర్యాప్తు పూర్తిగా మందగించింది. ఈ నేపథ్యంలో సీసీఎస్‌ను జాగృతం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఎక్కడ నేరం జరిగినా... సంఘటన తీరును బేరీజు వేసుకుంటూ జిల్లాల అధికారుల సమన్వయంతో వ్యవహరిస్తూ పనిచేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక్కడ పనిచేసే సిబ్బందికి చోరీలపై నిఘా, సంఘటన స్థలాల్లో లభించే ఆధారాలను బట్టి గతంలో జరిగిన నేరాల్లో గుర్తించిన అంశాలు, ప్రస్తుత నేర స్థలంలో లభించిన సాక్ష్యాధారాలతో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేసులు ఛేదించే దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా పర్యవేక్షణ అధికారిగా త్వరలో సీసీఎస్‌కు డీఎస్పీని నియమించేందుకు రంగం సిద్ధమయ్యింది. సీఐలకు పర్యవేక్షణ బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన వ్యవస్థను మరింత బలోపేతంపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరాలు అధికంగా నమోదవుతున్న స్టేషన్ల పరిధిలో ఉన్నతస్థాయి పర్యవేక్షణ అధికారులను నియమించనున్నారు. తద్వారా త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పలు పోలీస్ స్టేషన్లను సీఐ స్థాయిని పెంచుతూ సబ్ డివిజన్ హోదా కల్పించి డీఎస్పీల నియామకం చేపట్టాలని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువగా ఉండి కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న చోట ఆయా స్టేషన్ల స్థాయిని పెంచాలని భావిస్తున్నారు. ప్రధాన పట్టణాల్లోని పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్(సీఐ) స్థాయి అధికారి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీఐల పర్యవేక్షణలో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉన్న వాటిని ఎంపిక చేసి వాటిని సబ్ డివిజన్లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయానికి జిల్లా పోలీస్ శాఖ ప్రతిపాదనలు పంపింది. హోదా పెంచిన పోలీస్ స్టేషన్లలో త్వరలో డీఎస్పీ స్థాయి అధికారిని నియమించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఆరు పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. అలాగే డీసీఆర్బీ, ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ హోదాలు కూడా పెరగనున్నాయి. వీటికి కూడా డీఎస్పీ స్థాయి అధికారులను నియమించనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీఐలకు త్వరలో పదోన్నతి లభించే అవకాశం ఉన్నందున వారిని ఆయా స్థానాల్లో నియమించనున్నట్లు సమాచారం. ఎస్ఐ స్థాయి నుంచి ఎస్హెచ్ఓగా.. ఇప్పటి వరకు అర్బన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) స్థాయి కల్పిస్తూ సీఐలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హత్యలు, ఇతర నేరాలు దర్యాప్తు అధికారిగా సర్కిల్ ఇన్స్పెక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల స్థాయిని ఎస్‌హెచ్‌ఓలుగా పెంచుతూ అక్కడ సీఐ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగింది. ఈ మేరకు జిల్లాలో సుమారు 5 నుంచి 15 పోలీస్ స్టేషన్లకు ఎస్హెచ్ఓ హోదా లభించే అవకాశం ఉన్నట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 109 పోలీస్ స్టేషన్లున్నాయి. అందులో సర్కిళ్లతో కలిసి ఉన్న స్టేషన్లు 18, అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్లు 14, ఎస్ఐల పరిరక్షణలో 65 పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి.