కర్నూలు : శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆకే రవికృష్ణ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సబ్ డివిజన్ల వారీగా డీఎస్పీలు, సీఐలతో సమీక్షించారు. నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలన్నారు. మట్కా, బెట్టింగ్, పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆదోనిలో మట్కా జోరుగా సాగుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలుసుకుని ఆదోని డీఎస్పీతో పాటు సీఐల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.
మట్కా మహమ్మారిపై జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించాలని ఆదేశించారు. మట్కా నిర్వాహకులతో అధికారులకు సంబంధాలు ఉన్నట్లు వెలుగు చూస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ కేసులను ఆరా తీసి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీలు వారి పరిధిలోని కేసులపై శ్రద్ధ వహించాలన్నారు. మట్కా నిర్వాహకులను జిల్లా నుంచి తరిమివేయాలని సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు రాయచూరు, బళ్లారి ప్రాంతాలకు వెళ్లి మట్కా నిర్వహిస్తున్నవారిని, వారిని నియంత్రించడానికి కర్ణాటక పోలీసు అధికారులతో చర్చించాలని ఆదోనిడీఎస్పీని ఆదేశించారు. దోపిడీలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలపై ఆరు నెలలకొకసారి సీఐలతో సమావేశాలు నిర్వహించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీలకు సూచించారు.
మతకలహాలు జరిగే ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లా కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మసలుకోవాలని సూచించారు. రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, తరచూ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. నంద్యాలలో ఒక హత్య కేసు ఛేదించినందుకు గాను డాగ్ స్క్వాడ్ హ్యాండ్లర్‌కు రివార్డు ప్రకటించారు. మాధవరం ఎస్‌ఐ వ్యక్తిత్వం మార్చుకోవాలని హెచ్చరించి ఆయన పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో నష్టపోతావని డోన్ పట్టణ ఎస్‌ఐ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా సరిహద్దులో వాహనాలు లేని పోలీస్‌స్టేషన్లకు వాటిని సమకూరుస్తున్నట్లు చెప్పారు. కొంతకాలంగా జిల్లాలో లారీల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జలదుర్గం, జిల్లెల వంటి గ్రామాల్లో అంటరానితనాన్ని పూర్తిగా రూపు మాపాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ సెల్‌ను ఇంకా అభివృద్ధి చేసుకొని పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆళ్లగడ్డ ఏఎస్పీ శేషుకుమార్, డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, పి.ఎన్.బాబు, ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, బి.ఆర్.శ్రీనివాసులు, వి.వి.నాయుడు, హరినాథరెడ్డి, దేవదానం, మురళీధర్, వినోద్‌కుమార్, సుప్రజతో పాటు సీఐలు, ఎస్‌ఐలు సమావేశంలో పాల్గొన్నారు.