కర్నూలు:
జిల్లా కేంద్రంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) బలోపేతానికి ప్రణాళిక సిద్ధమయ్యింది. జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని సీసీఎస్ బలోపేతమే పరిష్కార మార్గంగా ఎస్పీ ఆకే రవిక్రిష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు ఈ మేరకు ప్రతిపాదనలు చేరాయి. సీసీఎస్‌కు అవసరమైతే క్లూస్ టీమ్‌లను కూడా అటాచ్ చేసే ఆలోచనలో ఉన్నారు. నేరం జరిగిన వెంటనే అప్రమత్తమై త్వరితగతిన నిందితులను పట్టుకునేలా చర్యలు ఉండాలని భావిస్తున్నారు.
దీంతో శాంతి భద్రతల విభాగంలో పనిచేసే సిబ్బందిపై ఒత్తిడి తగ్గడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రణాళికను రూపొందించారు. ప్రస్తుతం సీసీఎస్‌లో ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు ఉన్నారు. వీరికి సహాయ సహకారాలు అందించేందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో చోరీల దర్యాప్తు పూర్తిగా మందగించింది. ఈ నేపథ్యంలో సీసీఎస్‌ను జాగృతం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లాలో ఎక్కడ నేరం జరిగినా... సంఘటన తీరును బేరీజు వేసుకుంటూ జిల్లాల అధికారుల సమన్వయంతో వ్యవహరిస్తూ పనిచేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక్కడ పనిచేసే సిబ్బందికి చోరీలపై నిఘా, సంఘటన స్థలాల్లో లభించే ఆధారాలను బట్టి గతంలో జరిగిన నేరాల్లో గుర్తించిన అంశాలు, ప్రస్తుత నేర స్థలంలో లభించిన సాక్ష్యాధారాలతో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేసులు ఛేదించే దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా పర్యవేక్షణ అధికారిగా త్వరలో సీసీఎస్‌కు డీఎస్పీని నియమించేందుకు రంగం సిద్ధమయ్యింది.
సీఐలకు పర్యవేక్షణ బాధ్యత
శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన వ్యవస్థను మరింత బలోపేతంపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరాలు అధికంగా నమోదవుతున్న స్టేషన్ల పరిధిలో ఉన్నతస్థాయి పర్యవేక్షణ అధికారులను నియమించనున్నారు. తద్వారా త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే పలు పోలీస్ స్టేషన్లను సీఐ స్థాయిని పెంచుతూ సబ్ డివిజన్ హోదా కల్పించి డీఎస్పీల నియామకం చేపట్టాలని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువగా ఉండి కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న చోట ఆయా స్టేషన్ల స్థాయిని పెంచాలని భావిస్తున్నారు. ప్రధాన పట్టణాల్లోని పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సీఐ) స్థాయి అధికారి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం సీఐల పర్యవేక్షణలో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉన్న వాటిని ఎంపిక చేసి వాటిని సబ్ డివిజన్లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయానికి జిల్లా పోలీస్ శాఖ ప్రతిపాదనలు పంపింది. హోదా పెంచిన పోలీస్ స్టేషన్లలో త్వరలో డీఎస్పీ స్థాయి అధికారిని నియమించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఆరు పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. అలాగే డీసీఆర్‌బీ, ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ హోదాలు కూడా పెరగనున్నాయి. వీటికి కూడా డీఎస్పీ స్థాయి అధికారులను నియమించనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీఐలకు త్వరలో పదోన్నతి లభించే అవకాశం ఉన్నందున వారిని ఆయా స్థానాల్లో నియమించనున్నట్లు సమాచారం.
ఎస్‌ఐ స్థాయి నుంచి ఎస్‌హెచ్‌ఓగా..
ఇప్పటి వరకు అర్బన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఓ) స్థాయి కల్పిస్తూ సీఐలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఎస్‌ఐలు, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హత్యలు, ఇతర నేరాలు దర్యాప్తు అధికారిగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల స్థాయిని ఎస్‌హెచ్‌ఓలుగా పెంచుతూ అక్కడ సీఐ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగింది. ఈ మేరకు జిల్లాలో సుమారు 5 నుంచి 15 పోలీస్ స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓ హోదా లభించే అవకాశం ఉన్నట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 109 పోలీస్ స్టేషన్లున్నాయి. అందులో సర్కిళ్లతో కలిసి ఉన్న స్టేషన్లు 18, అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్లు 14, ఎస్‌ఐల పరిరక్షణలో 65 పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి.
నేర దర్యాప్తు ఇక వేగవంతం
Published Fri, Nov 7 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement