- నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు
- సాయంత్రం ఆరు తర్వాతా కొనసాగింపు
- పట్టించుకోని టీఎస్‌ఎండీసీ అధికారులు
- సర్కారు ఇసుక క్వారీలో ఇష్టారాజ్యం..
- పుష్కరాల పనుల్లో నాణ్యతాలోపం
- స్నానఘట్టాల క్యూరింగ్‌కు నీటి కొరత
- అధికారుల పర్యవేక్షణ కరువు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పెట్టడమే కాకుండా, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన సర్కారు క్వారీలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నీల్వాయి ఇసుక రీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఇసుక తవ్వకాలు జరపాలి. కానీ రీచ్‌లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్కోరోజు అర్ధరాత్రి వరకూ తవ్వకాలు సాగుతున్నాయి. అక్రమ తవ్వకాలను అరికట్టాలని నీల్వాయి గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేశారంటే ఇసుక ఏ స్థాయిలో తోడేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
నీల్వాయి వాగులో 1.92 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుకునేందుకు భూగర్భ గనుల శాఖ టీఎస్‌ఎండీసీ(ప్రభుత్వ రంగ సంస్థ)కి లీజుకు ఇచ్చింది. ఈ రీచ్ నుంచి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. టీఎస్‌ఎండీసీ ఈ స్టాక్ పాయింట్ నుంచి ఇసుక విక్రయాలు చేపడుతోంది. ఒక్కో క్యూబిక్ మీటరుకు రూ.550 చొప్పున విక్రయిస్తోంది. నీల్వాయి వాగులో ఇసుకను తవ్వి.. ట్రాక్టర్ల ద్వారా ఆ ఇసుకను స్టాక్ పాయింట్‌కు తరలించడం, స్టాక్‌పాయింట్ నుంచి ఇసుకను లారీల్లో నింపే పనుల కోసం టీఎస్‌ఎండీసీ టెండర్లు పిలిచింది.
అతి తక్కువకు కోట్ చేసిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌కు ఈ కాంట్రాక్టు దక్కింది. ఇసుకను తవ్వి.. లారీల్లో లోడు చేసినందుకు సదరు కాంట్రాక్టరుకు ఒక్కో క్యూబిక్ మీటరుకు రూ.156 చొప్పున టీఎస్‌ఎండీసీ చెల్లిస్తోంది. ఒప్పందం ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలి. కానీ ఒక్కో రోజు రాత్రి పది గంటల వరకు కూడా యథేచ్ఛగాఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని నీల్వాయి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకున్న ఇసుక క్వారీల్లో అక్రమ తవ్వకాలు జరగడం సర్వ సాధారణం. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వమే నిర్వహిస్తున్న క్వారీల్లోనే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం.
టీఎస్‌ఎండీసీ వైఖరిపై విమర్శలు..
స్వయంగా సర్కారు సంస్థ నిర్వహిస్తున్న క్వారీలో అక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీఎస్‌ఎండీసీ అధికారులకు ఉంటుంది. కానీ ఈ సంస్థ అధికారులు సదరు కాంట్రాక్టరును వెనుకేసుకు రావడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. ఇసుక కొనుగోలు చేసేందుకు వచ్చిన లారీలకు వెయిటింగ్ పడుతుందనే ఉద్దేశంతో ఒక్కో రోజు రాత్రి వరకు ఇసుక తవ్వకాలు జరపాల్సి వస్తోందని టీఎస్‌ఎండీసీ అధికారులు కాంట్రాక్టరుకు వెనుకేసుకొస్తున్నారు. వర్షం పడిన రోజు, ఆలస్యంగా తవ్వకాలు ప్రారంభమైన రోజు రాత్రి వరకు ఇసుక తవ్వాల్సి వస్తోందని పేర్కొన్నారు.
టీఎస్‌ఎండీసీ బాధ్యత వహిస్తుంది..
ప్రదీప్, మైనింగ్ ఏడీ లీజు ఒప్పందం ప్రకారం రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరపరాదు. టీఎస్‌ఎండీసీకి లీజుకు ఇచ్చిన నీల్వాయి రీచ్‌లో ఇసుక తవ్వకాలకు ఆ సంస్థనే బాధ్యత వహిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడితే ఆ సంస్థపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
తోడేస్తున్నారు..
Published Tue, Apr 28 2015 3:46 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement