ధరాఘాతం
-
పెరిగిన కూరగాయల ధరలు
-
విలవిలలాడుతున్న సామాన్యులు
చెన్నూర్ : కూరగాయల ధరలపై శ్రావణ మాసం ఎఫెక్ట్ పడింది. శ్రావణ మాసంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులంతా మాంసాన్ని ముట్టుకోరు. నెలరోజుల పాటు శాకాహారాన్నే తీసుకుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. గత వేసవి కాలంలో కూరగాయల సాగు తక్కువగా ఉండడంతో కూరగాయల ధరలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. చిరుధాన్యాల ధరలు కూడా అధికంగా పెరిగాయి. ప్రస్తుతం వర్షాకాలంలో కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది.
తగ్గిన సాగు విస్తీర్ణం
చెన్నూర్, కోటపల్లి, మందమర్రి, జైపూర్ మండలాల్లో మొత్తం కలిపి దాదాపు కేవలం వేయి హెక్టార్లలోపు మాత్రమే కూరగాయల సాగు అవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గతంలో ఈ విస్తీర్ణం దాదాపు మూడు వేల హెక్టార్లుగా ఉండేదని వారు వివరిస్తున్నారు. గతంతో పోలీస్తే సాగు విస్తీర్ణం తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమనే చెప్పవచ్చు. దీంతో కూరగాయలను పక్కనున్న వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
పెరిగిన ధరలు...
నిన్న మొన్నటి వరకు కిలో రూ. 60 ఉన్న మిర్చి ధర ప్రస్తుతం కిలో రూ ధర 80 చేరుకుంది. ఇలా అన్ని కూరగాయాల ధరలు పెరిగాయి. దీంతో నిరుపేద వర్గాల ప్రజలు అందోళన చెందుతున్నాయి. ఇదే విధంగా కూరగాయాల ధరలు పెరుగుకుంటూ పోతే నిరుపేదలకు కూరగాయల భోజనం కరువయ్యే పరిస్థితులు వస్తాయని పలువురు మహిళలు తెలుపుతున్నారు.