సాక్షి, అమరావతి బ్యూరో: పండ్లు, కూరగాయలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం మార్కెట్ యార్డులు, చెక్‌పోస్టుల్లో ఫీజును రద్దు చేసింది. ఈనెల 2వ తేదీన ప్రభుత్వం జీవో నం.58 విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 22 మార్కెట్‌లలో బుధవారం నుంచి అధికారికంగా ఫీజు రద్దు అమలు చేయనున్నారు. రైతులు పండించిన పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు ఎటువంటి మార్కెట్ ఫీజు చెల్లించకుండా ఎక్కడైనా విక్రయించే వెసులుబాటు ఉంటుంది. ప్రధానంగా మార్కెట్ యార్డుల్లో ఉన్న కమీషన్ ఏజెంట్ల వ్యవస్థకు మంగళం పలికారు.
ఇప్పటి వరకూ కమీషన్ ఏజెంట్లు మార్కెట్ యార్డుల్లో 4 నుంచి 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ రద్దుతో రైతులకు ఊరట లభించనుంది. కమీషన్ ఏజెంట్లు వ్యాపారం చేయాలంటే ట్రేడర్స్‌గా మారాల్సి ఉంటుంది. వీరు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీంతో ఔత్సాహికులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. ప్రధానంగా మదనపల్లి, ఏలూరు, తెనాలి, బంగారుపాలెం, పుంగనూరు, రావులపాలెం వంటి మార్కెట్‌లలో అమలు కానుంది. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా.. రైతులు, వినియోగదారులకు మేలు కలుగుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment