జీవనది తడారి..జనం బతుకు ఎడారి..! | Adilabad district in the huge water drought | Sakshi
Sakshi News home page

జీవనది తడారి..జనం బతుకు ఎడారి..!

Published Wed, Apr 27 2016 9:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

జీవనది తడారి..జనం బతుకు ఎడారి..! - Sakshi

జీవనది తడారి..జనం బతుకు ఎడారి..!

కరువు కోరల్లో అడవుల జిల్లా ఆదిలాబాద్
♦ గోదావరి ఎండిపోవడంతో ఎక్కడ చూసినా దుర్భిక్షం
♦ పల్లె, పట్టణం, గోండు గూడేల్లో దాహం దాహం
♦ దారుణంగా పడిపోయిన భూగర్భ జలాలు
♦ అడవుల్లో చెలిమ నీళ్లే దిక్కు
♦ నీటి కోసం కిలోమీటర్ల కాలినడక
♦ గుక్కెడు నీటికి అల్లాడుతున్న మూగ జీవాలు
♦ తెలంగాణ, మహారాష్ట్రకు పట్టని సరిహద్దు గ్రామాలు
 
 ఈ చిత్రాన్ని చూశారా? ఏముంది..? ఓ రోడ్డుపై ఆర్టీసీ బస్సు వెళ్తోందంటారా? అలా అంటే పొరపాటే! ఈ బస్సు వెళుతోంది జీవనది గోదావరిలో!! తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా గోదావరి చుక్కనీరు లేకుండా ఎండిపోయి ఇలా రహదారిగా మారింది. ఆదిలాబాద్ జిల్లాకు కడెం మండల కేంద్ర సమీపంలోని ఈ చిత్రం కరువుకు అద్దం పడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి అవతల వైపు ఉన్న కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలకు నది మధ్యలోంచి ఆర్టీసీ బస్సులు నడుతున్నారు. ఇలా బస్సులు నడపడం ఇదే తొలిసారి! ‘‘గోదావరిలో ఆర్టీసీ బస్సును నడపడం గతంలో ఎప్పుడూ చూడలేదు.. ఇదే మొదటిసారి’’ అని పలువురు పేర్కొన్నారు.
 
 అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్.. కరువు కోరల్లో చిక్కుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. జీవనది గోదావరి ఎడారిగా మారింది. పంటలెండిపోవడంతో రైతు కాడి పడేశాడు. మూగజీవాలు కబేళాకు తరలుతున్నాయి. పెన్‌గంగా, ప్రాణహిత నదులు కూడా ఎండిపోయాయి. కడెం, స్వర్ణ, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులు ‘డెడ్’స్టోరేజీకి చేరాయి. ఇక తాగునీటి కష్టాలు వర్ణనాతీతం.. పల్లెలు, పట్టణాలు, గోండు గూడేలు గుక్కెడు నీటికోసం  అలమటిస్తున్నాయి.
 - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
 
 గోదారమ్మ.. నీటి జాడ ఏదమ్మా..
 చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత జిల్లాలోకి ప్రవేశించే గోదావరి నది.. కోటపల్లి వరకు సుమారు 250 కిలో మీటర్ల మేర ప్రవహిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నది ఎడారిగానే కనిపిస్తోంది. రాళ్లు, రప్పలే దర్శనమిస్తున్నాయి. ఒక్క గోదావరి నదే కాదు.. పెన్‌గంగా, స్వర్ణ నదుల్లో కూడా చుక్క నీరు లేదు. నదుల పరిస్థితి ఇలా ఉంటే చిన్నాచితక వాగులు, వంకలు, చెరువుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలాచోట్ల చెరువులు నెర్రెలు పడ్డాయి. ప్రజలు ప్రత్యామ్నయంగా భూగర్భ జల వినియోగంపై ఆధారపడుతుండటంతో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. గోదావరి నదిపై సుమారు 100కు పైగా తాగునీటి పథకాలున్నాయి. ఒక్కో పథకం కింద రెండు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా గోదావరిలో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో నదిపై ఉన్న తాగునీటి పథకాలన్నీ వట్టిపోతున్నాయి. ఇప్పటికే సుమారు 20 తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. దీంతో సమీపంలోనే గోదావరి ఉన్నా తీర ప్రాంతాలు దప్పిక కోసం నానా యాతన పడుతున్నాయి.
 
 రెండు బిందెల నీళ్లకు గంట
 చెలిమెలో నీళ్లను తోడుకుంటున్న ఈ దృశ్యం ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనుల తాగునీటి సమస్యకు అద్దం పడుతోంది. నార్నూర్ మండలం గణేష్‌పూర్‌లో సుమారు 40 కుటుంబాలున్నాయి. ఊళ్లో ఉన్న రెండు బావులు ఎండిపోయాయి. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేద్దామంటే గ్రామానికి రోడ్డు లేదు. ట్యాంకర్ వెళ్లడం కూడా కుదరదు. ఈ ఊరికి అర కిలోమీటరు దూరంలో వాగు ఉంది. అది కూడా ఎండిపోయింది. ఆ వాగులో రెండు చెలిమెలే వీరి దాహం తీర్చుతున్నాయి. ఒక్కో కుటుంబానికి రెండు బిందెల చొప్పున నీళ్లు తెచ్చుకుంటున్నారు. రెండు, మూడు బిందెలు తోడితే నీళ్లు ఊరడానికి గంట సేపు ఆగాలి. వంతుల వారీగా ఉదయం నుంచి రాత్రి వరకు ఈ చెలిమెల వద్ద నీళ్ల కోసం పడిగాపులుకాయాల్సిన పరిస్థితి. ఇది ఒక్క గణేష్‌పూర్ సమస్యే కాదు.. జిల్లాలో అనేక గోండు గూడేలు తాగునీటికి అల్లాడిపోతున్నాయి.
 
 వన్యప్రాణుల విలవిల
 వన్యప్రాణులు కరువు కాటుకు బలవుతున్నాయి. అడవిలో చెలిమె లు, కుంటలు ఎండిపోవడంతో చు క్క నీరు దొరక్క విలవిల్లాడుతున్నా యి. గొంతు తడుపుకునేందుకు అడవిని వదిలి గ్రామాల బాటపట్టాయి. ఇలా దాహార్తి తీర్చుకునేందుకు రెం డు కృష్ణ జింకలు ఇటీవల కడెం మం డలం బుట్టాపూర్ గ్రామం వైపు వ చ్చాయి. ఈ గ్రామానికి చెందిన రైతు తన పంట రక్షణ కోసం అమర్చిన కరెంటు తీగలకు తగిలి ఆ రెండు జింకలు మృత్యువాత పడ్డాయి.
 
 పట్టణాల్లోనూ దాహం దాహం!
 పల్లెల్లోనే కాదు.. పట్టణాల్లోనూ దాహం కేకలు వినిపిస్తున్నాయి. బెల్లంపల్లి పట్టణానికి నాలుగు రోజుకోసారి.. కేవలం గంటసేపు మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. మొత్తం 56,396 జనాభాకు 6.70 ఎంఎల్‌డీల నీళ్లు అవసరం ఉండగా. 3 ఎంఎల్‌డీల నీళ్లే ఇస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లక్షా 75 వేల జనాభాకు రోజు విడిచి రోజు అరగంట మాత్రమే నీటి సరఫరా అవుతోంది. భైంసా మున్సిపాలిటీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మంచిర్యాల మున్సిపాలిటీలో 1.07 లక్షల జనాభా ఉంది. 9 ఎంఎల్‌డీల నీళ్లు అవసరముండగా.. 7 ఎంఎల్‌డీల నీళ్లు సరఫరా చేస్తున్నారు. రోజు విడిచి రోజు నీరిస్తున్నారు. మందమర్రి పట్టణంలో 30 వేల మందికి వార ంలో రెండు సార్లే నీటి సరఫరా అవుతోంది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోని 57,876 జనాభాకు.. రోజు 5.5 ఎంఎల్‌డీల నీటి అవసరం ఉండగా 3.15 ఎంఎల్‌డీల నీళ్లు మాత్రమే సరఫరా అవుతుంది.
 
 గోండు పల్లెల గోడు..
 ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇల్లు సుగురె సత్యపాల్‌ది. నార్నూర్ మండలం సాంగ్వి పంచాయతీ పరిధిలోని లోకారి(బి)కి చెందిన ఈ రైతు తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా వలస వెళ్లాడు. సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కరువుతో పంటలు ఎండిపోయాయి. ఉపాధి హామీ పనులు కూడా సాగడం లేదు. ఈ గ్రామంలో 180 కుటుంబాలుంటే 80కిపైగా రైతు కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ పరిస్థితి ఒక్క లోకారి(బి)దే కాదు... జిల్లాలో వందలాది గోండు గూడేలు వలస బాట పట్టాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకం పడకేసింది. వందకుపైగా గ్రామాల్లో ఈ పనులు సాగడం లేదు. కొన్ని గ్రామాల్లోనైతే ఏడాదిగా పనుల జాడే లేదు. మరోవైపు చేసిన పనులకు కూలి చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. సుమారు 1.55 లక్షల మంది కూలీలకు జనవరి 20 నుంచి డబ్బులు చెల్లించడం లేదు. సుమారు రూ.64 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
 
 మూగజీవాలకు గ్రాసం కరువు..
 కరవు కారణంగా మూగజీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసం, నీటి కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. దీంతో రైతులు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే పశువులను తెగనమ్ముకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 27,000 టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడిందని జిల్లా పశుసంవర్థక శాఖ అంచనా వేసింది. స్థానికంగా గ్రాసం దొరక్క తమ పశువులను మేపేందుకు అడవికి తీసుకెళుతున్నామని, నీళ్ల కోసం సుమారు పది కిలో మీటర్ల దూరంలో ఉన్న సాత్నాల ప్రాజెక్టుకు తీసుకెళుతున్నామని జైనథ్ మండలం సైదాపూర్‌కు చెందిన రాంచందర్ అనే రైతు వాపోయాడు. జిల్లాలో సుమారు 16 వరకు పశువుల సంతలున్నాయి. ఇందులో ఇచ్చోడ, కౌటాల, దండేపల్లి మండలం కొరివిచల్మ, బెజ్జూరు మండలం సలుగుపెల్లి, జైనూరు వంటి సంతల్లో పశువుల విక్రయాలు పెరిగాయి. గడ్డిని కొనుగోలు చేద్దామన్నా ధర చుక్కలనంటుతోంది. వరిగడ్డి కట్ట ఇప్పుడు రూ.18 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
 
 ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సైద్‌పూర్‌లో సుమారు 1300 మంది జనాభాకు ఒకటే బోరుబావి. కరెంటు వస్తేనే నీళ్లు. దీంతో ఉదయం 6 గంటల నుంచి ఈ బోరు వద్ద నీళ్ల కోసం ఇలా నిరీక్షించాల్సిందే.
 
 మా బాధలు పట్టవా?
 ఈ కాలంలో కూడా బావి నీళ్లనే తాగుతూ కష్టాలు పడుతున్నాం. మమ్ముల్ని పట్టించుకునేవారే లేరు. మా బాధలు ఎవరికీ పట్టవా? ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు అనుభవించాలి?
 - శికారే మథురాబాయి, లేండిగూడ
 
 ట్యాంకులతో నీళ్లివ్వాలి
 నీరు లేని చోట అధికారులు ట్యాంకర్లతో నీటిని అందించాలి. మమ్ముల్ని రెండు ప్రభుత్వాలు కూడా చిన్నచూపు చూస్తున్నాయి. మా బాధలు ఆ దేవుడికే తెలుసు.
 - కొండాబాయి, ఎంపీటీసీ
 
 ఆ ఒక్క బావి కూడా ఎండిపోతోంది
 ఎండల దెబ్బకు ఇప్పుడు నీళ్లు తెచుకుంటున్న బావి కూడా ఎండిపోయేలా ఉంది. అది ఎండిపోతే ఏం చేయాలో తోచడం లేదు. తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, నేతలు వెంటనే స్పందించాలి.
 - కుడ్మెతే అంబుబాయి, బొలాపటార్
 
 పాతాళానికి పానీ..
 జిల్లాలో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. 2015 నవంబర్‌లో జిల్లాలో సగటు నీటిమట్టం 7.81 మీటర్ల లోతున ఉండేది. ఇప్పుడు ఇది 10.78 మీటర్లకు పడిపోయింది. ఏడాదిలోనే మూడు మీటర్ల లోతుకు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని 20 మండలాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా తానూరు, లోకేశ్వరం, బజార్‌హత్నూర్, ఆసిఫాబాద్, దిలావర్‌పూర్ మండలాల్లో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయింది. తానూర్‌లో 28.20 మీటర్లు, లోకేశ్వరంలో 25.40 మీటర్లు, బజార్‌హత్నూర్‌లో 24.42 మీటర్లు, ఆసిఫాబాద్ 23.88 మీటర్లకు, దిలావర్‌పూర్‌లో 18.25 మీటర్లు, నేరడిగొండలో 18.02 మీటరు, ముధోల్, సారంగపూర్‌లలో 15.92 మీటర్లు, కుంటాల, తాండూర్‌లలో 14.90 మీటర్లు, జైనథ్, బెల్లంపల్లి, బెజ్జూర్‌లలో 13.55 మీటర్లు, కాగజ్‌నగర్, గుడిహత్నూర్, దహేగాంలలో 12.20 మీటర్లకు భూగర్భ జలమట్టం పడిపోయింది.
 
 సరిహద్దు గ్రామాల అరణ్యరోదన
 తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో వివాదాస్పద గ్రామాలవి. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలోని ఈ 14 గ్రామాలను రెండు రాష్ట్రాలు పాలిస్తున్నాయి. ఈ గ్రామాలవారికి రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులుంటాయి. ఈ గ్రామాల్లో ఇప్పుడు తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి సమస్య పరిష్కారానికి వచ్చేసరికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. మనకెందుకులే అన్న ధోరణితో రెండు రాష్ట్రాల అధికారులు ఉండటంతో ఈ గ్రామాలు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు. పరందోళి, తాండ, మహరాజ్‌గూడ, ముకదంగూడ, శంకర్‌లొద్ది, లేండిజాల, గౌరీ, లేండిగూడ, భోలాపటార్, నారాయణగూడ, యోసాపూర్, పద్మావతి, అంతాపూర్, ఇంద్రానగర్ గ్రామాల్లో 4,852 జనాభా ఉంది. ఒక్క శంకర్‌లొద్ది మినహా ఏ ఒక్క గ్రామంలో నీటి సౌకర్యం లేదు. ఈ 14 గ్రామాల్లో 12 మంచినీటి పథకాలు ఉన్నాయి. అందులో కేవలం రెండే పనిచేస్తున్నాయి. 34 చేతిపంపుల్లో ఐదే పనిచేస్తున్నాయి. ఏళ్ల తరబడి ఆయా గ్రామాల్లో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. లేండిగూడ, అంతాపూర్, పద్మావతి గ్రామాల్లో కిలో మీటరు దూరంలో ఉన్న బావి నుంచి నీటిని తెచ్చుకొని కాలం వెల్లదీస్తున్నారు. మరో 15 రోజులైతే ఆ బావులు కూడా ఎండిపోయో ప్రమాదం ఉంది.
 
 వర్షాలు లేక.. రబీకి వెళ్లలేక..
 ఖరీఫ్‌లో పత్తి సాగు చేసిన భూముల్లో పత్తి కట్టెలను తొలగించి రబీకి సిద్ధమవుతారు రైతులు! కానీ చుక్కనీరు కూడా కరువవడంతో ఖరీఫ్‌లో వేసిన పత్తిని ఇదిగో ఇలాగే వదిలేశాడు సైదాపూర్‌కు చెందిన ఓ రైతు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో రబీ సాగు దారుణంగా పడిపోయింది. జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 71,531 హెక్టార్లు కాగా.. 63 వేల హెక్టార్లలో సాగైనట్టు అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఖరీఫ్‌లో నష్టాలు ఎదుర్కొన్న రైతులు రబీ సాగుకు వెనుకడుగు వేశారు. వరి 19,352 హెక్టార్లకుగాను 14 వేల ఎకరాల్లోనే సాగైంది. జొన్న 11,149 హెక్టార్లకు.. 7,689 హెక్టార్లలోనే సాగైంది. మిగతా పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పెట్టుబడులు పెట్టి అప్పులపాలయ్యే కన్నా బీడుగా ఉంచుకోవడమే మేలని భావిస్తున్నారు.
 
 ప్రత్యేక చర్యలు చేపట్టాం
 కరువు నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాం. జిల్లాలో నాలుగు వందలకుపైగా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ఈ గ్రామాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరువు కారణంగా ప్రజలు వలసలు వెళ్లకుండా నివారించేందుకు అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరం చేశాం. పశువుల విక్రయాలు జిల్లాలో లేవు. పశువుల తాగునీటి కోసం తొట్టెల నిర్మాణం చేపట్టాం. జిల్లా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు తాగునీటి వసతి కల్పించేందుకు సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశాం.
 - సుందర్ అబ్నార్, జిల్లా జాయింట్ కలెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement