జల గరళం
- సర్కారు స్కూళ్లలో తాగునీటి తిప్పలు
- విద్యార్థులకు పొంచి ఉన్న ముప్పు
- ఏజెన్సీ స్కూళ్లలో పరిస్థితి తీవ్రం
- రక్షిత మంచినీరు కరువు
- అటకెక్కిన జలమణి ప్లాంట్లు
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో సర్కారు స్కూళ్ల విద్యార్థులకు ముప్పు పొంచి ఉందా..? స్కూళ్లలో విద్యార్థులు తాగుతున్నది అరక్షిత మంచినీరేనా..? జిల్లా స్థాయిలో విద్యాశాఖ, క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులపై తమ బాధ్యతను విస్మరించారా..? వారి ఆరోగ్యంపై పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 2వేల పాఠశాలల్లో విద్యార్థులు కలుషిత బోరు నీరే తాగుతున్నారు. నమ్మలేకున్నా ఇదే వాస్తవం. ఓ పక్క విజృంభిస్తోన్న విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ జిల్లా ప్రజల్లో దడపుట్టిస్తుంటే.. మరోపక్క సర్కారు స్కూళ్లలో విద్యార్థులకు డయేరియా ముప్పు పొంచి ఉంది. ఆరేళ్ల క్రితం జిల్లాకు జలమణి ప్లాంట్లు(రక్షిత మంచినీటి) మంజూరు కాగా.. ప్రస్తుతం అవి జాడలేకుండా పోయాయి. దీంతో గ్రామీణ విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉన్న చేతిపంపులు, బోరుబావుల నీళ్లు తాగుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు.
అటకెక్కిన ‘జలమణి’..!
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యతోపాటు రక్షిత తాగునీరు అందించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2010లో ‘జలమణి’ పథకానికి శ్రీకారం చుట్టింది. తొలివిడతగా జిల్లా అధికారులు 2011లో జిల్లా వ్యాప్తంగా 146 పాఠశాలలను ఎంపిక చేసి ‘జలమణి’ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగించింది. పథకానికి సంబంధించి యూనిట్ల ఏర్పాటుకు ఓ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఏర్పాటు చేసే వాటర్ ప్లాంట్ల సామార్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్‌కు ఒక్కో విధంగా నిధులు కేటాయించింది.
కనిష్టంగా రూ.15వేలు గరిష్టంగా రూ.30వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. క్షేత్రస్థాయిలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ల కక్కుర్తితో విద్యార్థులకు రక్షిత నీరు అందకుండాపోయింది. చాలా పాఠశాలల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయనే లేదు. కొన్ని స్కూళ్లలో ఏర్పాటు చేసినా నిర్వహణ లోపంతో నిరుపయోగంగా.. అలంకార ప్రాయంగా మారాయి. ప్లాంట్లు ఏర్పాటు చేసే పాఠశాలల గుర్తింపు విషయంలోనూ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పెద్ద తప్పే చేశారు. భూగర్భ జలం, కనీసం బోరు కూడా లేని పాఠ శాలల పేర్లనూ కేంద్రానికి పంపారు. ఆయా స్కూళ్లలోనూ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్ర నిధులు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో నీళ్లు లేకపోవడంతో ప్లాంట్ల ఏర్పాటు జరగనే లేదు. ఫలితంగా మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు ఇప్పటికీ బావులు, బోరు నీటినే సేవించాల్సిన దుస్థితి ఏర్పడింది.
రక్షిత మంచినీరు లేని స్కూళ్లు 2వేలపైనే..
జిల్లాలో ప్రభుత్వ, ఐటీడీఏ పరిధిలో 4వేలకు పైగా ప్రాథమిక, 486 ప్రాథమికోన్నత, 570 ఉన్నత పాఠశాలలున్నాయి. మూడు లక్షలకు పైగా మంది విద్యార్థులున్నారు. సగానికి పైగా పాఠశాలలు, పలు వసతిగృహాల్లోనూ రక్షిత తాగునీరు కరువైంది. ప్లాం ట్లు పని చేయకపోవడంతో బోరు నీరే తాగుతున్నారు. ఏజెన్సీ పరిధిలోని పలు ఆశ్రమ, రెగ్యులర్ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. కలుషిత నీరే కారణమని వైద్యు లు స్పష్టం చేశారు. దీంతో పలు చోట్ల హెచ్‌ఎం దాతలను ఆశ్రయించి మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు మినరల్‌వాటర్ సమకూరుస్తున్నారు. మిగిలిన చోట్ల ఇంకా బోరు, కలుషిత నీరే తాగుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మూర్తిని సంప్రదించగా.. జలమణి ప్లాంట్లు పని చేయకపోవడంపై తమకు సంబంధం లేదని, నిర్వహణ బాధ్యత హెచ్‌ఎంలదేనని స్పష్టం చేశారు.