వెల్దుర్తి, న్యూస్‌లైన్: అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రూ. లక్ష వెచ్చించి బోరు తవ్వినా చుక్క నీరు అందించకపోవడంతో ఇటు విద్యార్థులు, అటు భోజన పథక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని నెల్లూర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జూన్ మాసంలో గ్రామీణ నీటి పథకం, పారిశుద్ధ్య శాఖల ఆధ్వర్యంలో బోరు వేసి మోటార్‌ను బిగించారు. రెండు నెలల పాటు బోరు నుంచి ఓ మోస్తరు నీరు వచ్చింది. తర్వాత రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు, వంట కార్మికులు, విద్యార్థులు తెలిపారు.
మోటార్ చెడిపోవడంతో మరమ్మతుల కోసం తీసుకెళ్లి నేటికి ఐదు నెలలు అవుతున్నా మరమ్మతులు చేయలేదని, దీంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నీటి వసతి లేకపోవడంతో మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయని, దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయినులు ఇబ్బందులు పడుతున్నారని హెచ్‌ఎం తెలిపారు. ఇంటి నుండి తాగునీరు తెచ్చుకుంటున్నామని విద్యార్థులు వాపోయారు. అధికారులు స్పందించి బోరు నుంచి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పాఠశాలలో నీటి వసతి కరువు
Published Sat, Dec 21 2013 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement