
చెన్నైకి తాగునీరు విడుదల చేయాలని సీఎంకు వినతిపత్రం ఇస్తున్న తమిళనాడు మంత్రులు
సాక్షి, అమరావతి : చెన్నై నగరవాసుల తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ఆదేశాల మేరకు తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్‌పీ వేలుమణి, మత్స్య శాఖ, పాలనా సంస్కరణల మంత్రి జయకుమార్, ముఖ్య కార్యదర్శి మనివాసన్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు.
తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని, అందుకు నీటిని విడుదల చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. తాగునీరు లేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని మంత్రులు చెప్పగా.. వైఎస్ జగన్ వెంటనే స్పందించి చెన్నైకి తాగునీటిని విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల బృందంతో అన్నారు. కష్టాల్లో పాలు పంచుకోవాలని, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరముందని సీఎం జగన్ వివరించారు.